ఇదీ మణిపూర్ ముఖచిత్రం! | opinion on Manipur Iron Lady irom Sharmila by chaitanya pingali | Sakshi
Sakshi News home page

ఇదీ మణిపూర్ ముఖచిత్రం!

Published Wed, Jul 27 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ఇదీ మణిపూర్ ముఖచిత్రం!

ఇదీ మణిపూర్ ముఖచిత్రం!

ఢిల్లీలో నిర్భయకి జరిగింది.. ఇక్కడ మణిపూర్‌లో ప్రతి నెలా ఎవరో ఒకరికి జరుగుతూనే ఉంటుంది. కానీ.. వాటిని ఎవరన్నా పట్టించుకున్నారా? జాతీయ స్థాయి వార్త ఎప్పుడైనా అయ్యిందా? 15 ఏళ్ళగా ఇరోమ్ షర్మిల నిరాహార దీక్ష చేస్తోంది. ఎవ్వరికైనా పట్టిందా?
 
 ‘ఇండియన్ ఆర్మీ.. రేప్ అజ్’ అని బ్యానరు పట్టు కొని కాంగ్లా కోటని ఆక్రమించిన అస్సాం రైఫిల్స్ ముందు నిలబడి.. 2004లో పోరాడిన ఆ ధీర వనితల్ని కలవాలని మణిపూర్ రాజధాని ఇంఫాల్ వెళ్ళాను. ఏదో యుద్ధాన్ని దగ్గర నుండి చూసినట్టు ఉంది. సరిగ్గా మేం ఇంఫాల్ వెళ్ళే సరికి.. అక్కడ ప్రజలందరూ సమ్మె చేస్తున్నారు. తారిణి బబిత అనే యువతిని ఇండియన్ ఆర్మీ కాల్చింది. మరో ఇద్దరు కాలేజికి వెళ్తున్న కుర్రా ళ్ళని ఏ కారణం లేకుండా జవాన్లు చితక్కొట్టారు. గతంలో ఆర్మీ చేసిన మరో హత్య కేసులో ఆ రోజే ఒక జవాను, కోర్టులో నేరం అంగీకరించాడు.
 
వీటన్నిటివల్లా ప్రజలూ, ఆర్మీ.. ఇరు వర్గాలు ఆవేశంగా ఉన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ టెంట్లు వేసి ధర్నా చేస్తున్నారు. అక్కడ నిరసన చేసే పద్ధతి ఇక్కడి పరిస్థితులకి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజ లంతా ఒకే చోట కాకుండా.. ఎవరి ఇంటి దగ్గరున్న రోడ్డు మీద వాళ్ళు చేస్తారు. ఒక వర సలో రోడ్డుకి అడ్డంగా కూర్చుంటారు. వాళ్ళకి ఒక అరకిలోమీటరు దూరంలో మరి కొంత మంది కూర్చుంటారు.. వాళ్ళకి దూరంలో ఇంకొంతమంది.. అలా వరసలు వరసలుగా, అన్ని చిన్న చిన్న గల్లీలతో సహా, అన్ని రోడ్ల మీదా నిరసనకి కూర్చుంటారు ప్రజలు. ఆర్మీ వాళ్ళు మొదటి వరసలో ఉన్న వాళ్ళ మీద దాడి మొదలుపెట్టగానే, రాయి తీసుకుని కంచం మీదో, కరెంటు స్తంభం మీదో కొడుతూ.. వెనక కూర్చున్న వాళ్ళని హెచ్చరి స్తారు ఉద్యమకారులు. ఆ శబ్ద సంకేతం రాగానే తర్వాత వరసలో కూర్చున్న వాళ్ళు రాళ్ళు, మైకులు తీసుకుని అప్రమత్తమవుతారు. ఇక్కడ నిరసన చేసేది అత్యధిక శాతం ఆడవాళ్ళే. 9మంది స్త్రీలు ఉంటే ఒక పురుషుడూ ఉంటాడు.. నిరసనల్లో. అన్ని వయసులు స్త్రీలు ధర్నాల్లో ఉంటారు.
 
మేం ఆర్మీ రాకముందే.. పశ్చిమ ఇంఫాల్‌లోని ఉరిపోక్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాం. 2004లో జూలై 14న కాంగ్లా కోట ముందు.. నగ్నంగా నిరసన తెలియజేసిన 11 మంది స్త్రీలలో.. ముగ్గురు ఆ ప్రాంతంలో ధర్నా చేస్తున్నారు. వాళ్ళ పేర్లు అంగోమ్ జీబన్‌మాలా లెయిమా, సైబమ్ మామన్‌లెయిమా, మీతమ్ ఇబెంహాల్ లెయిమా. వాళ్ళని కలవటానికి.. చాలా వరసల నిరసన కారుల్ని దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. మేం వెళ్ళేసరికి.. ఆ ముగ్గురు స్త్రీలు కొన్ని బ్యానర్లు పట్టుకుని.. ఒక షెడ్డులో కూర్చున్నారు. 2004 నాటి పోరాటానికి కారణం ఏమిటి? అని అడిగాను. ఇబున్‌హాల్ సమాధానం ఇచ్చారు. ‘జూలై 11వ తేదీ ముందు రోజు రాత్రి మనోరమ అనే యువతిని 17వ అస్సాం రైఫిల్స్ ఆర్మీ అరెస్టు చేయటానికి ఇంటికి వచ్చారు. ఆమె కుటుంబ సభ్యుల ఎదురుగానే, మనోరమ కళ్ళకి గంతలు కట్టి అరగంట పాటు.. జాలీ దయా లేకుండా చావబాదారు. అక్కడే ఆ వరండాలోనే లైంగికంగా కూడా హింసించారు. ఆ తర్వాత అరెస్టు నెపంతో మనోరమని తీసుకెళ్ళి పోయారు. 11వ తేదీన ఆమె శవం.. సగం సగం బట్టలతో.. వంటి మీద బుల్లెట్ గాయాతో, తొడల మీద కత్తి గాట్లతో.. రోడ్డు మీద పడి కనిపించింది. ఎన్నిసార్లు ఇలా ఎంతమంది అమ్మాయిలకి జరిగిందో తెల్సా? 15 ఏళ్ళ వయసు పిల్లల్నుంచీ..’ అని చెప్పి ఆమె ఏడవటం మొదలుపెట్టింది.

 ఆ టెంటులో ఆ చుట్టుపక్కల కూర్చున్న అమ్మాయిలు ఆమె భుజాలని పట్టుకుని ఓదార్చుతూ ఉన్నారు. ఇబెంహాల్ నా గడ్డం పట్టుకుని.. ‘చూడు.. ఈ అమ్మాయిల్లో ఎవరినైనా సరే రేప్ చేయొచ్చు.. చూడు.. వీళ్ళని చూడు..’ అంటూ అందర్నీ చూపిస్తోంది. నేనూ ఏడ్చాను. ఇంతలో గట్టిగట్టిగా కంచాన్ని కొడుతున్నట్టు శబ్దం వినిపిం చింది. ఏమయింది అని అడిగాను. ‘వాళ్ళు వస్తున్నారు. ఈ రోడ్డున మనకంటే ముందు దీక్షలో కూర్చున్న వాళ్ళని కొట్టేశారన్న మాట’ అని చెప్పిందో మహిళ. నేను వెంటనే టెంటు నుంచి రోడ్డు మీదకి వెళ్ళి చూశాను. ఆర్మీ జట్లు జట్లుగా నడుచుకుంటూ వస్తోంది. వాళ్లను రానివ్వకుండా కొందరు టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆర్మీకి ఎదురెళ్ళి టెంట్ వరకూ రానివ్వకుండా నిలబడ్డారు. ఏవో నినాదాలు ఇస్తున్నారు. ఇంతలో తొంగమ్ సునీత అనే అమ్మాయి నన్ను టెంటు లోపలికి గుంజుకుని వచ్చి.. ‘తక్కువ టైం ఉంది, ఇంటర్వ్యూ త్వరగా చేసేయండి’ అన్నది. నేను మళ్ళీ టెంటులోకి వెళ్ళాను. ఇబెంహాల్ చేయిని పట్టుకుని, ‘ఆఫ్‌స్పా చట్టాన్ని ఎత్తేస్తారమ్మా.. కచ్చితంగా జరుగుతుంది’ అని చెప్పా. ‘మేము బతికుండగా చూస్తామా?’ అని మమన్ లైమా అడిగింది. నేను మౌనంగా కూర్చున్నాను.

 ‘ఆ రోజున కాంగ్లా గేటు ముందర నిలబడి బట్టలు తీసి పారేశాం. చెప్పు.. ఏ స్త్రీ అయినా చేయగలదా ఆ పని? ఎందుకు చేశాం? బట్టలుండి ఉపయోగం ఏంటి? ప్రతి రోజూ మణిపుర్‌లో ఎక్కడో అక్కడ ఒక ఆడపిల్ల చిరిగిన బట్టలతో శవమై రోడ్డున తేలుతోంది. ఏం ఉపయోగం బట్టలతో.. మేం అదే చెప్పాం.. పద కొండుమంది ఉన్నాం ఆ రోజు. మమ్మల్ని రేప్ చేయండి. ఎంత మంది జవాన్లు కావాలంటే అంతమంది.. మేం బతికి ఉన్నన్నాళ్ళూ మమ్మల్ని వాడుకోండి. కానీ.. మా పిల్లల్ని వదిలేయండి. మా అమ్మా యిల మానం చెడగొట్టద్దు. మా అబ్బాయిలని బుల్లెట్లకి బలి చేయొద్దు అని ఏడ్చాం. వాళ్ళేం అన్నారు? మా సి.ఎం. ఏం అన్నాడు? ఇలా కల్లోలాలు సృష్టించడం వల్లే ఆఫ్‌స్పా వచ్చింది, నేను సెంటర్‌తో మాట్లాడతా, మీరు పోరాటం ఆపండి అన్నారు. ఏం చేశారు? పన్నెండేళ్ళయింది? ఏమన్నా మార్పు ఉందా? అని ఆవేశంగా అరిచింది సైబమ్ మమన్ లెయిమా.
 
మీ పోరాటం తర్వాత పరిస్థితుల్లో కాస్త కూడా మార్పు రాలేదా? అని అడి గాను. ‘వచ్చింది. ఒకే ఒక్క మార్పు. మేము పవిత్రంగా, దేవతల నిలయంగా భావించే కాంగ్లా కోట నుండి అస్సాం రైఫిల్స్‌ని పంపించేసింది కేంద్రం. దాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. అంతకు మించి ఏం జరగ లేదు. 15 ఏళ్ళగా ఇరోమ్ షర్మిల నిరాహార దీక్ష చేస్తోంది. ఎవ్వరికైనా పట్టిందా? మణిపుర్‌కి మోడి వచ్చాడు. కనీసం ఇరోమ్ షర్మిలని కలవలేదు. అసలు మాకేం విలువ ఉంది? మేం చేసిన నేరం ఏంటి? ఎందుకు మమ్మల్ని మనుషులుగా  చూడరు? అని నన్నే నిలదీసినట్టు అడి గింది ఆవిడ.

 ‘2004లో మీరు చేసిన పోరాటానికి కూడా ప్రజలు చాలా కదిలిపోయారు. అప్పటికి సోషల్ మీడియా ఇంతగా లేకపోబట్టి ప్రచారం కాలేదు. మా తెలుగు భాషలో పత్రికల వాళ్ళు చాలా మంది మీ గురించి రాశారు. కవితలు వచ్చాయి. ఖండనలు వచ్చాయి. నేను కూడా రాశాను..’ అని నా దగ్గరున్న పీడీఎఫ్ ప్రతిని చూపించాను. వాళ్ళ మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి.. మన భాష అర్థం కాకపోరుునా.. ఏం రాశానో అక్షరం అక్షరం చదివి వినిపించుకున్నారు. ఇంకా చాలా మందే రాశారు అని శివసాగర్ కవిత చెప్పాను. ఏమన్నా ఉంటే పేపర్ కటింగ్స్ పంపమని అడ్రస్ కూడా ఇచ్చారు. ఇంతలో ఆర్మీ ఉద్యమకారులని దాటుకుని టెంట్ దాకా రానే వచ్చింది. వాళ్ళకీ, వీళ్ళకీ మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్మీ వాళ్ళు మమ్మల్ని చూసి, వీళ్ళెవరు? అని అడిగారు. అప్పటిదాకా మాతో అంత ప్రేమగా మాట్లాడి, బాబుకి బంద్ టైంలో కూడా లేస్ కొనిచ్చినవాళ్ళు.. ఒక్కసారి ‘మాకు తెలీదు’ అని ఇంగ్లీషులో చెప్పారు.

 ‘టూరిస్టులు. బంద్ అని తెలీక రోడ్డు మీదకి వచ్చారట. ఎటు వెళ్లాలో తెలీక ఇక్కడ ఆగారు’ అని మావైపు చూసి, సైగ చేశారు. అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా, ‘మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. వెళ్ళిపోండి’ అని గట్టిగా చెప్పారు. ‘మేం మొండిగా నిలబడ్డాం. ఏం జరుగుతుందో చూస్తాం, మీరుండలా, మేమూ అలాగే ఉంటాం’ అని చెప్పాం. వాళ్ళలో ఒకరు చేతికి తగిలిన దెబ్బ చూపించి, ఇదే దెబ్బ మీ బాబుకి తగలచ్చు వెళ్ళిపొండి అని చెప్పారు. ఆర్మీ వాళ్ళు మా దగ్గరకి వచ్చి, వార్నింగ్ ఇచ్చారు. మేం ఆ స్త్రీల వైపు చూస్తే.. ‘వెళ్ళిపోండి.. ఎవరు చెప్పారు మణిపుర్‌కి వెళ్ళమని. ఇక్కడ మీరు పీల్చే గాలి.. ఎందరో పిల్లల.. ఆఖరి శ్వాస’ అని అరిచి, వెళ్ళిపొండి, బాబు ఉన్నాడు అన్నట్టు సైగ చేసింది. మేము మౌనంగా మా హోటల్ వైపు నడిచాం. దారిలో టియర్‌గ్యాస్, రబ్బరు బులెట్ల ఆనవాళ్ళు... రక్తం మరకలు.. ఆ మర్నాడు పేపర్‌లో.. రక్తం ఓడుతున్న కుర్రాళ్ళ ఫొటోలు..
 

(వ్యాసకర్త : చైతన్య పింగళి, పాత్రికేయురాలు ఈమెయిల్ : chaithanyapingali@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement