నిరసనపై జులుం నేరంతో నెయ్యం | Dileepreddy opinion on irom Sharmila | Sakshi
Sakshi News home page

నిరసనపై జులుం నేరంతో నెయ్యం

Published Fri, Aug 12 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

నిరసనపై జులుం నేరంతో నెయ్యం

నిరసనపై జులుం నేరంతో నెయ్యం


సమకాలీనం

షర్మిల వంటి గాంధేయవాదుల నిరసనల్ని, పోరాటాల్ని పాలకులు ఏళ్ల తరబడి లక్ష్య పెట్టకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. నిరసించే, ప్రశ్నించే పరిస్థితులే లేకుండా పోతు న్నాయి. ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల మంచి వారికి విశ్వాసం సన్నగిల్లుతోంది. చెడ్డ వారికి భయం లేకుండాపోతోంది. డబ్బు, పలుకుబడిగలవారు సత్వర ఫలితాలకు నయీమ్ లను ఆశ్రయిస్తుంటే... చట్టబద్ధ వ్యవస్థల రక్షణ కరవై బడుగుజీవులు తృణమో, పణమో, సాంతమో ఈ ముఠాలకు సమర్పించుకొని ‘బతుకు జీవుడా’ అనాల్సిన దుస్థితి నెలకొంది.

24 గంటల వ్యవధిలోనే రెండు పరస్పర విరుద్ధ భావధారలు భారత రాజ కీయ తెరపైన ప్రతీకలుగా ప్రస్ఫుటమయ్యాయి. అత్యధికుల్ని చలింప జేశాయి. ఇప్పుడాలోచింపజేస్తున్నాయి.
ఒకటి: ప్రజాస్వామ్యయుతమైన నైతికతకు శీర్షాయమానంగా నిలిచిన తన పదహారేళ్ల నిరాహార దీక్షకు స్పందన లేనందుకు విరమిస్తూ, వ్యవస్థలో భాగమై పోరాటం కొనసాగిస్తానని ప్రకటించిన ఈరోమ్.
రెండు: అమానుష నేరగాడిగా... రాజకీయ అవినీతిని, పోలీసు దిగజారు డుతనాన్ని ఆయుధాలుగా మలచుకొని రెండు దశాబ్దాల పాటు నెలకొల్పిన నేరసామ్రాజ్యం కుప్పకూలి, నరకాసుర వధలా బతుకు చాలించిన నయీమ్.

ఈ రెంటిలో ఎన్నో సామ్యాలను. మరెన్నో వైరుధ్యాలను, పరస్పర విరుద్ధమైన అంశాల్ని కలిపి చర్చించాల్సిరావడం బాధ కలిగిస్తున్నా... ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను మన నయా ఉదారవాద ఆర్థిక పాలనా నమూనా నిర్దయగా తొక్కేసిన కుటిల నీతి పర్యవసానమైతే, రెండోది అదే నమూనా వల్ల ఒక దుర్మార్గపు ప్రక్రియ బలపడటం కావ డమే ఇక్కడ ముఖ్యాంశం. రెండు చోట్లా తుది ఫలితం సమాజం బలహీనపడటమే! రెండుచోట్లా స్వార్థ పర శక్తులదే ఆధిపత్యం, సామాన్యులే బాధితులు. అందుకే, కలిపి చర్చిం చాల్సి వస్తోంది. అధికార బలంతో, చట్టం దన్నుగా ‘ప్రత్యేక’ సాయుధ బల గాలు సాగిస్తున్న అరాచకాలను నిలిపివేయండన్న ఈరోమ్ షర్మిల ఆక్రందన గాలికి పోయింది. శాంతియుతంగా గాంధేయ మార్గంలో 16 ఏళ్లుగా తిండి తినకుండా ఆమె నిరసన తెలిపితే ప్రభుత్వ, రాజకీయ, అధికార వ్యవస్థల నుంచి కించిత్తయినా స్పందన రాలేదు.

నిబద్ధత కలిగిన వ్యక్తిగా షర్మిల తన పంథాను మార్చుకొని, పోరాటం కొనసాగించాల్సి వస్తోంది. ఆమె పట్టుద లకు, త్యాగనిరతికి ప్రపంచమంతా నీరాజనం పలికింది. దీక్ష మాత్రమే విరమించానని, పోరాటాన్ని కొనసాగిస్తున్నాననీ ఆమె గర్వంగా ప్రకటిం చింది. ఇది అభినందించాల్సిన పరిణామం. ఆదర్శాల నిబద్ధతతోనో, పచ్చి ముసుగుగానో నక్సలైటుగా మొదలై - నేరస్తుడి రూపమెత్తాడు నయీమ్. నేరాల రుచి మరిగి, పోలీసుల, నాయకుల చేతిలో పావుగా, వారి స్వార్థమే నిచ్చెనగా అతగాడు నెలకొల్పిన నేర సామ్రాజ్యం ప్రజాస్వామ్య వ్వవస్థకు ఓ రాచపుండు. ఎన్ని కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు, దొమ్మీలు, మెడమీద కత్తిపెట్టి చేసిన  కోట్లాది రూపాయల,  స్థిరచరాస్తుల వసూళ్లు! సంపద సంగతి సరే, చట్ట రక్షకుల కనుసన్నల్లో నయీమ్ ముఠా తూటాలకు, కత్తిపోట్లకు ఎన్నో జీవితాలు బుగ్గిపాలయ్యాయి. కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి.

రాజకీయాల్ని అనివార్యం-అంతిమం చేశాం
చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.... అనే పెదవి విరుపు నానుడొకటుంది. కాలక్ర మంలో మనం మన రాజకీయ వ్యవస్థను అంతగా అనివార్యం, అంతిమం చేసుకున్నాం. రాజ్యాంగంలో తప్ప... ఆచరణలో ఎక్కడా తనిఖీల్లేవు, సమ తూకాల్లేవు. మన జీవితాల్లో ప్రతి పార్శ్వాన్నీ శాసించే గుత్తాధికారాన్ని రాజకీయ వ్యవస్థకు తెలిసో తెలియకో ధారాదత్తం చేశాం. మంచి వాళ్లైనా, చెడ్డవాళ్లైనా అందరూ అటువైపే చూడాల్సిన పరిస్థితులిప్పుడు నెలకొన్నాయన డానికి ఈరోమ్, నయీమ్‌లే తాజా ఉదాహరణ. ఇద్దరూ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు! ‘మణిపూర్‌లో సానుకూల మార్పులు తీసుకురావడానికి నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను, అందుకే 2017లో స్వతంత్య్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీచేస్తాన’ని ఈరోమ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించి భూమిక సిద్ధం చేసు కుంటున్న నయీమ్, ఏమో.... కలిసొస్తే ఏకంగా ముఖ్యమంత్రే కావాలను కున్నాడేమో! తెలియదు.

ఇప్పుడు నయీమ్ ఎలాగూ లేడు. రాజకీయాలవైపు రావడానికి మంచివాళ్లు సాహసించట్లేదని ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో షర్మిల ప్రకటన ఆహ్వానించదగ్గ పరిణామం. పదహారేళ్ల దీక్షతో కానిది ఎమ్మెల్యేగా గెలిచి సాధిస్తుందా? అసలు ముఖ్యమంత్రి అవుతుందా? అయినా.. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్పీఏ) రద్దు చేయించగలరా? వంటి ధర్మసందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు మేధావులు. అవి పెద్దగా ప్రాముఖ్యత లేని ప్రశ్నలు. మేధావి వర్గపు ప్రతి నిధిగా చిత్తశుద్ధితో అంత సుదీర్ఘకాలం దీక్ష చేసిన షర్మిల ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా... పోరాటపంథా వీడకపోవడమే గొప్ప! రూపు మార్చి పోరాటం కొనసాగిస్తాననడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక. ఆమె ఇంకో గొప్ప మాట చెప్పారు. ‘కొందరు రాజకీయాలు మురికి అంటారు, సమాజం కూడా అంతే!’ అన్న ఆమె మాటలు కుహనా మేధావి వర్గానికి చెంపదెబ్బ. షర్మిల దీక్షకి పదహారేళ్లపాటు స్పందించని పాలనా వ్యవస్థల్ని మన సమాజం లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం.

ఇబ్బడి ముబ్బడిగా అధికార బలం, పట్టపగ్గాల్లేని చట్టస్వామ్యం చేతుల్లో ఉన్న నేతలు, పోలీసులు చెక్కిన వంచనా శిల్పం నయీమ్. నయీమ్ చచ్చిన తర్వాత దొంతర్లు దొంతర్లుగా ఆస్తులు, టన్నులు టన్నులుగా సమాచారం బయటకొచ్చే వరకు ఆయా ముఖ్యుల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ సమాజంలో ప్రతిబంధకాలేవి? ఇప్పటికైనా  ముసుగుల్లో దాగిన ముఖ్యుల బండారం బయటకొస్తుందో? రాదో? సందే హమే! రంగు మారని రాజకీయాలే వారికి రక్షణ కవచం అవుతాయనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే, రాజకీయాలు మారాలంటారు. ‘‘రాజకీయాల్లో చేర కుండా ‘రాజకీయాల్ని‘ తుదముట్టించడమో, సంస్కరించడమో కుదరదు కాక కుదరదు’’ అని జీన్ పాల్ సార్ట్రే విశ్వవిఖ్యాత నాటిక ‘డర్టీ హ్యాండ్స్’లో ఒక పాత్ర చేత పలికిస్తారు. ‘రాజకీయాల్ని ముట్టుకోకుండా నేను నా సామాజిక  సేవను కూడా కొనసాగించలేను. ప్రజాస్వామ్యంలో రాజకీయం తడమని జీవన ప్రక్రియలే ఉండవు’ అని మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’ (1920) లో రాశారు.

రాజకీయాల్లో మంచివాళ్లు, ఆలోచనాపరుల దామాషా పెరిగి వాటిలో పరివర్తనను తేవాల్సిన అవసరాన్ని సమకాలీన పరిస్థితులు నొక్కిచెబు తున్నాయి.
 
నిరసన అస్త్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారు

ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థల్లో నిరసన తెలుపడం ఒక బలమైన ఆయుధం. నిరాయుధ అహింసావాదిగా విశ్వమంతా పేరు తెచ్చుకున్న జాతిపిత బాపూజీ ఈ ఆయుధంతోనే పోరాడారు. రవి అస్తమించని బ్రిటిష్ పాలకుల మెడలు వంచి దేశానికి స్వాతంత్య్రం సాధించారు. ఆంగ్లేయుల వంటి వలస పాలకులు సైతం గౌరవించిన ‘నిరసన’ నేటి మన ప్రజాస్వామ్య పాలకులకు కంటగింపయింది. స్వాతంత్య్రం సిద్ధించిన తదుపరి తొలి దశాబ్దాల్లో ఉన్న సామరస్య ధోరణి కూడా లేదు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన చివరి రోజుల వరకూ కూడా ఏ నిరాహార దీక్షనూ నిర్లక్ష్యం చేయలేదంటారు. ఎవరైనా దీక్ష చేస్తే వారి వద్దకు ప్రధాని తరఫు నుంచో, ప్రభుత్వం వైపు నుంచో సంప్రదింపులకు, చర్చలకు పంపేవారు. కానీ, ఇప్పుడు శాంతి భద్రతల ముసుగులో శాంతియుత నిరసనలనూ కర్కశంగా అణచివేస్తు న్నారు.

రేపు ఫలానా చోటకు వెళ్లి నిరసన తెలుపుతామంటే, ఈరోజే అరెస్టు చేస్తారు. లాఠీలతో హింసిస్తారు, గుర్రాలతో తొక్కిస్తారు, ప్లాస్టిక్ పిల్లెట్లతో నెత్తురు కళ్లజూస్తారు. మగ పోలీసులే మహిళా నిరసనకారులపై చేయి చేసుకుంటారు, చేతుల్లో బంధిస్తారు, ఒంటిపై గుడ్డలు చింపుతారు, రోడ్లపై ఈడ్చుకెళ్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో, కశ్మీర్‌లో, దేశంలోని పలు ఇతరేతర ప్రాంతాల్లో పాలకుల దమననీతి నేడు నడివీధుల్లో నెత్తురు చిమ్మిస్తోంది. అందుకే, కశ్మీర్‌లో బుర్హాన్ వనీ మరణానంతర పరిణామాల్లో పోలీసుల దాష్టికాల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వారిలో మానవీయ కోణమే కొరవడిం దని నొక్కిచెప్పింది. సాయుధ బలగాల అమానవీయ చేష్టల్ని, నేరపూరిత చర్యల్ని విచారించనవసరం లేని మినహాయింపు (ఇమ్యునిటీ) తలంపే ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రాజ్యం తన అణచివేత చర్యల ద్వారా రాను, రాను పౌరులు నిరసన తెలిపే ద్వారాలనే మూసివేస్తోంది. కూర్చున్న చోటే చేసే సత్యాగ్రహాన్ని, నిరసన దీక్షల్ని ఇక అసలు ఖాతరు చేయరు.

ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలైనా పట్టించుకోరు. రోడ్లపైకి ప్రదర్శనగా వస్తే చతురంగ బలాలతో అణచివేతకు దిగుతారు. 108 వైద్య సర్వీసుల ఉద్యో గులు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇందిరాపార్కు వద్ద ఏడాది పాటు దీక్ష చేశారు. ప్రభుత్వం పలకరించిన పాపాన పోలేదు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి నలిగి కడకు ఏ పరిష్కారం లేకుండానే దీక్ష నుంచి వైదొలిగారు. ఏపీలో విపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పలు నిరసన, నిరాహార దీక్షలపై పోలీసు దాష్టికాల్ని చూశాం. ముద్రగడ పద్మనాభంపై ఆస్పత్రిలో భౌతికదాడి, కుటుంబసభ్యుల్ని అవమానించడం వంటి దుర్మార్గాల్ని మీడియా కళ్లకు కట్టింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు, మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలకు, ప్రజాసంఘాలకు ఎదురైన చేదు అనుభవాలు తెలిసినవే! జాతీయ స్థాయిలో కూడా... సాయుధ బలగాలకు చెందిన మాజీ సిబ్బంది ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ నినాదంతో జంతర్‌మంతర్ వద్ద నెలల తరబడి దీక్ష జరిపినా పట్టించుకున్నవారు లేరు. కడకొక రాజకీయ పరిష్కారంగానే ఆ సమస్యకు తెరపడింది.

బాధల వల్లే.... బాదరాయణ బంధం
షర్మిల వంటి గాంధేయవాదుల నిరసనల్ని, పోరాటాల్ని పాలకులు సంవత్స రాల పాటు లక్ష్యపెట్టకపోవడం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. నిరసించే, ప్రశ్నించే పరిస్థితులే లేకుండా చేస్తున్నారు. విమర్శను తట్టుకోలేక విమ ర్శకుల్ని నిర్మూలించే నియంతృత్వ పోకడలు పాలకుల్లో పెచ్చుమీరాయి. ప్రజాస్వామ్యం పట్ల, దాని విభిన్న అంగాల పట్ల, వ్యవస్థల పట్ల మంచి వారికి విశ్వాసం సన్నగిల్లుతోంది. చెడ్డవారికి భయం లేకుండా పోతోంది. డబ్బు, పలుకుబడి కలిగిన వారికి సత్వర ఫలితాలకు ‘నయీమ్’వంటి వ్యవస్థలే నయమనే అభిప్రాయానికి వస్తున్నారు.  చట్టబద్ధ వ్యవస్థలు తమ రక్షణకు రానపుడు తృణమో, పణమో, కడకు సాంతమో.... హంతక ముఠాలకు సమర్పించుకొని ‘బతుకు జీవుడా’ అనాల్సిన దుస్థితి బడుగుజీవులది.

ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చిన పాలకుల నయా ఉదారవాద అభివృద్ధి నమూనా పర్యవసానమే ఇది. ఏ కొందరికో అసాధారణ ప్రయోజనాల్ని కల్పించి, అత్యధికులకు కన్నీళ్లను మిగులుస్తోంది. కొందరి గుప్పిట చిక్కిన ‘అధికారం’ దాష్టికాలను అడ్డగించేవారే ఉండట్లేదు, ఉన్నా, నయీమ్ లాంటి కిరాయి ముఠాల ఊడిగంతో వారి అడ్డు తొలగించుకుంటున్నారు. యథేచ్ఛగా చీకటి రాజ్యాలేలుతున్నారు. లేకపోతే, వందల సెల్‌ఫోన్లు, వేల సిమ్‌కార్డులు, లక్షల లావాదేవీలు, వేల కోట్ల ఆస్తులు... ఒక ముఠా నేర సామ్రాజ్యంలో ఎలా పోగుపడ్డాయి? ఇరవై ఏళ్లుగా ఇది నిరాఘాటంగా సాగుతుంటే, మననిఘా సంస్థలు, నియంత్రణ వ్యవస్థలు, తనిఖీ యంత్రాంగాలు ఏం చేశాయనే సందేహం రావడం సహజం. దీనికి పాలకులు సమాధానం చెప్పాలి. లేకుంటే ప్రజలే వారికి, వారి దాష్టీకాలకు చరమగీతం పాడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం!

వ్యాసకర్త: ఆర్. దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement