‘ఉక్కుమహిళ’ కొత్త మార్గం | Editorial on Manipur Iron Lady irom Sharmila | Sakshi
Sakshi News home page

‘ఉక్కుమహిళ’ కొత్త మార్గం

Published Wed, Jul 27 2016 1:32 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial on Manipur Iron Lady irom Sharmila

పదహారేళ్లుగా కొనసాగిస్తున్న తన నిరవధిక నిరాహార దీక్షను వచ్చే నెల 9న విరమించుకోబోతున్నట్టు మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల మంగళవారం చేసిన ప్రకటన ఏకకాలంలో సంతోషాన్నీ, విచారాన్నీ కలిగిస్తుంది. సంతోషం ఎందు కంటే- ఇన్నేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఆహారమూ, మంచినీరూ తిరస్కరిస్తూ వస్తున్న షర్మిల ఇకపై దానికి స్వస్తిచెప్పబోతున్నారు గనుక... తనకు నచ్చిన ఆహారాన్ని తీసు కుంటారు గనుక... తన మనసు గెలిచినవాడిని మనువాడబోతున్నారు గనుక... తనకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోబోతున్నారు గనుక. కానీ ఇదే సమయంలో విచారించదగ్గ అంశమూ ఉంది. ఏ పార్టీలోనూ, సంస్థలోనూ సభ్యత్వం లేని, ఎలాంటి సిద్ధాంతాలకూ ప్రభావితంకాని ఒక సాధారణ మహిళ... తన కళ్లెదుట సాగుతున్న దుర్మార్గాలను కొనసాగనీయరాదన్న ఏకైక లక్ష్యంతో ముందుకొచ్చిన ప్పుడు ఆమె గొంతును వినడానికి ఏ ప్రభుత్వమూ సిద్ధపడలేదు. ఆమె డిమాం డ్‌ను కనీసం పరిశీలించి నెరవేర్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినవారు లేరు.

ఇది బాధాకరమైన విషయం. 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ నిరశన దీక్షకు సంకల్పించినప్పుడు ఇంత సుదీర్ఘకాలం కొనసాగించవలసి వస్తుందని ఆమె అనుకుని ఉండరు. మహాత్మాగాంధీ చూపిన అహింసాయుత మార్గంలో తన దేహాన్నే అస్త్రంగా మలుచుకుని షర్మిల సాగించిన దీక్ష మన దేశంలోనే కాదు... ప్రపంచంలోనే నిరుపమానమైనది. ఆ దీక్షా యజ్ఞం కోసం ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు అందరినీ అచ్చెరువొందిస్తాయి. హృదయమున్న ప్రతి ఒక్కరినీ కదిలి స్తాయి. అమ్మను చూస్తే కరిగి నీరై పోతానని, ఎంచుకున్న మార్గంనుంచి పక్కకు తప్పుకుంటానని శంకించి ఆమెను కలవబోనని షర్మిల ప్రకటించారు. తల్లి సైతం కన్నపేగు మమకారాన్ని తనలోనే అణుచుకుని, షర్మిల నిర్ణయాన్ని గౌరవించి ఆమెకు దూరంగా ఉండిపోయారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 309కింద ఆత్మహ త్యకు ప్రయత్నించారని ఆరోపించి కేసు పెట్టడం, నిర్బంధించడం...ముక్కు ద్వారా ట్యూబు పెట్టి బలవంతంగా ద్రవాహారాన్ని ఎక్కించడం మాత్రమే ఇన్నేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న పని. ప్రతి 15 రోజులకూ ఆమెపై కేసు పెట్టడం, నిర్బంధిం చడం, కోర్టులో శిక్ష విధించడం... అది పూర్తయ్యాక మళ్లీ ఇదంతా ప్రారంభం కావడం రివాజు అయింది. ఆమె కోసం ఇంఫాల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఒక వార్డునే జైలుగా మార్చారు. అందులోనే ఆమె ఇన్నేళ్లుగా బందీగా ఉన్నారు. షర్మిల మనోభావాలేమిటో, ఆమె ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో దీక్షను కొనసాగిస్తు న్నారో ఈ నెల 14న ‘సాక్షి’లో వెలువడిన వ్యాసం కళ్లకుకట్టింది.

షర్మిల మానవమాత్రులకు తీర్చడం సాధ్యంకాని డిమాండ్‌నేమీ కోరలేదు. సాయుధ దళాల(ప్రత్యేకాధికారాల) చట్టాన్ని రద్దు చేయాలని ఆమె అడిగారు. ఆ చట్టం సాయుధ దళాలకు అది అపరిమితమైన అధికారాలిస్తున్నది. కల్లోలిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించాక అలాంటిచోట ఏ వారెంటూ లేకుండా ఎక్క డైనా సోదా చేయడానికీ, ఎవరినైనా అరెస్టు చేయడానికీ, అనుమానం వస్తే కాల్చి చంపడానికీ జవాన్లకు అధికారం సంక్రమిస్తుంది. వారి చర్యను న్యాయ స్థానాల్లో ప్రశ్నించడానికి వీలుండదు. ఇలాంటి అపరిమిత అధికారాలిచ్చిన అండతో సాయుధ బలగాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని... అమాయక పౌరులపై జులుం ప్రదర్శిస్తున్నాయని... పౌరుల ప్రాణాలు తీస్తున్నాయనీ పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

తీవ్రవాదంతో, వేర్పాటువాదంతో సంబంధం లేని అనేకమంది యువతీయువకులు అకారణంగా అదృశ్యమవుతున్నారని, మహిళలపై అత్యాచారా లతోసహా అనేక నేరాలు చోటుచేసుకుంటున్నాయని ఆ సంఘాలు సవివరమైన నివేదికలిచ్చాయి. మొన్న జనవరిలో ఒక కానిస్టేబుల్ ఆరేళ్లక్రితంనాటి ఎన్‌కౌంటర్ వెనకున్న వాస్తవమేమిటో వెల్లడించి అందరినీ దిగ్భ్రమపరిచాడు. ఇంఫాల్ నడి బొడ్డున దుకాణ సముదాయంలో నిరాయుధంగా ఉన్న 22 ఏళ్ల యువకుడు సంజిత్ మెయితీని అప్పటి ఏఎస్‌పీ ఆదేశాల మేరకు కాల్చిచంపానని మీడియాకు వెల్లడించాడు. ఈమధ్యనే సుప్రీంకోర్టు సైతం దాదాపు 1,528 ఎన్‌కౌం టర్ల విషయంలో కేంద్రాన్ని నిలదీసింది. ఏదోరకమైన జవాబుదారీతనాన్ని కల్పించ కుంటే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో అందరికీ సందేహాలొస్తున్నాయి...ఏలినవారికి తప్ప! కేంద్రమే నియమించిన జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి కమిషన్ ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని గతంలో తేల్చిచెప్పింది. భద్రతారీత్యా అవసరమనుకుంటే ఆ చట్టంలోని కొన్ని నిబంధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లో చేర్చ వచ్చునని సూచించింది. ఒక యువతి అదృశ్యం, హత్య కేసులో నియమించిన ఉపేంద్ర కమిషన్ సైతం ఇలాగే సిఫార్సుచేసింది. యూపీఏ సర్కారు హయాంలో పదేళ్లపాటు కీలక స్థానాల్లో పనిచేసిన చిదంబరం మాజీగా మారాక ఇప్పుడు ఆ చట్టం సరికాదంటున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్లుగా మన పాలకులు ఆమె విష యంలో పాటించిన మౌనం, నిర్లిప్తత బాధాకరమైనది.
 
28 ఏళ్ల ప్రాయంలో దీక్షకు ఉపక్రమించిన షర్మిల ఆరోగ్యం ఈ సుదీర్ఘ దీక్షతో గణనీయంగా దెబ్బతిన్నది. మహిళగా నెలనెలా ఎదుర్కొనక తప్పని ఇబ్బందులు ఆమెను ఎంతగానో బాధిస్తున్నాయి. సాధారణ పద్ధతిలో ఆహారం తీసుకోక పోవడంవల్ల... అది కూడా ద్రవాహారమే కావడంవల్ల జీర్ణ వ్యవస్థ ఆ మేరకు అస్త వ్యస్థమైందని వైద్యులు అంటున్న మాట. ఇప్పుడు సాధారణ జీవనస్రవంతిలోకి అడుగిడాలనుకుంటున్న షర్మిలకు మన నేతలిచ్చే సందేశం ఏమిటి? దీక్ష ద్వారా సాధించలేనిది ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై పొందగలనన్న ఆమె విశ్వాసానికి భరోసా ఇవ్వగలరా? ఆమె మాట ఇకపై అరణ్యరోదన కాబోదని హామీ ఇవ్వ గలరా? అసలు మన ఎన్నికల వ్యవస్థ షర్మిలవంటి వజ్రసదృశ వ్యక్తిత్వాలను శిరోభూషణం చేసుకుంటుందని ఘంటాపథంగా చెప్పగలరా? ఇవన్నీ చేయగలిగితే షర్మిలను మాత్రమే కాదు... ఇతరేతర మార్గాల్లో పోరాడేవారిని సైతం ఇటువైపు ఆకర్షించడం సాధ్యమవుతుంది. మన నేతలు అందుకవసరమైన చిత్తశుద్ధినైనా ప్రదర్శించాలని కోరుకుందాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement