సాక్షి, చెన్నై : ఉక్కు మహిళ, మణిపూర్ పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల వివాహం తమిళనాడులోని కొడైకెనాల్‌లో గురువారం నిరాడంబరంగా జరిగింది. లండన్‌కు చెందిన డెస్మండ్ కౌటిన్హోను ఆమె వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని కొడైకెనాల్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షర్మిల వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరువురు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో పూలమాలలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇరోం షర్మిల వివాహానికి పలు సంఘాలు వ్యతిరేకించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇలావుండగా ఇరోం షర్మిల వివాహానికి డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు దివ్యభారతి నేరుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో ఫోన్ ద్వారా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నానని షర్మిల తెలిపారు. మిగతా బంధువులకు ఆహ్వాన పత్రికలు ఇవ్వలేదని, అందుకే ఎవరూ రాలేదన్నారు. కాగా వారి వివాహాన్ని కొడైకెనాల్‌లో జరపకూడదంటూ హిందూ మక్కల్ కట్చి, ఉళవర్ ఉళైప్పాళర్ సహా అనేక సంఘాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
డెస్మండ్ కౌటిన్హోను పెళ్లాడిన ఇరోం షర్మిల
Published Thu, Aug 17 2017 7:22 PM | Last Updated on Tue, Sep 12 2017 12:20 AM
Advertisement