మణిపూర్ ఇక నా ఇల్లు కాదు
ఉక్కు సంకల్పం
ఇరోమ్ షర్మిల ఇక ఎప్పటికీ సొంతూరికి పోనంటోంది.
ఊరికే కాదు, సొంతరాష్ట్రానికే పోనంటోంది.
నిజమే, మణిపూర్‌ని ఆమె అమితంగా ప్రేమించింది.
మణిపూర్ ప్రజల కోసమే ఇన్నేళ్లు బతికింది.
ఇప్పుడు తన కోసం తాను బతుకుతానంటోంది.
పెళ్లి బంధంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది.
ఇరోమ్ చానూ షర్మిల... గడచిన పదహారేళ్లుగా పోరాడింది. ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ కోసం పోరాడింది. సామాన్యులు హాయిగా రోజు గడిపే రోజు కోసం పోరాడింది.
ప్రభుత్వం సాయుధ బలగాలకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాల హక్కు(ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ –ఎఎఫ్‌ఎస్‌పిఎ) కు ఎదుర్కోవడానికి ఆమె దగ్గర సైనిక శక్తి లేదు. నిరాహార దీక్షనే సత్యాగ్రహ ఆయుధంగా మలుచుకుంది. పోలీసుల ఒత్తిడులకు వెరవకుండా పదహారేళ్లపాటు నిరాహార దీక్షను కొనసాగించింది. ఆమెను అరెస్టు చేయడం, మళ్లీ విడుదల చేయడం సాధారణమైపోయింది. నిరాహార దీక్షను భగ్నం చేయడానికి చేయరాని పాట్లన్నీ పడింది మణిపూర్ ప్రభుత్వం. ట్యూబుతో ద్రవాహారంతోనే దీక్షను కొనసాగించింది షర్మిల.
హక్కుల పోరాటంలో నిరాహార దీక్షకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ ఏడాది ఎన్నికల్లో పోటీచేసింది ఇరోమ్. తాను ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే పోరాటం చేస్తున్నానని ఆమె గట్టిగా విశ్వసించింది. ఆ నమ్మకాన్ని మణిపూర్ ప్రజలు నిలబెడతారని ఆశించింది. కానీ ఓట్లు వందకు లోపే రావడంతో యావత్తు దేశం నివ్వెరపోయింది.
ఆమె పోరాటం ఆమె కోసం కాదు, తన వాళ్ల కోసం, తనలాంటి వారి కోసం. ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అది చట్టం రూపంలో అమలవుతోంది. ఆ వెసులుబాటే స్థానికులకు దినదినగండంగా మారింది. వారి బతుకులను వారిని బతకనివ్వని దారుణాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియచేయాలని నిరాహార దీక్షకు పూనుకుంది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జీవితాన్ని ఫణంగా పెట్టింది.
ఎన్నికలతో మలుపు!
మణిపూర్‌లో గత మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. ఎవరి బతుకులు బాగుపడడానికి తన జీవితాన్ని అంకితం చేసిందో ఆ ప్రజలే ఆమెను అక్కున చేర్చుకోలేకపోయారు. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా అసాధ్యమే. ఆమెకూడా అలాగే తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆమె భుజం తట్టి అండగా నిలిచాడు డెస్‌మాండ్ కూటిన్‌హో. గోవాలో పుట్టిన డెస్‌మాండ్ ప్రస్తుతం బ్రిటన్ పౌరుడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి డెస్‌మాండ్ ఎప్పుడూ సిద్ధమే. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆమెను మణిపూర్ నుంచి కొడైకెనాల్‌కు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉందామె. గడచిన బుధవారం కొడైకెనాల్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ హక్కుల ఉద్యమకారులిద్దరూ తమ వివాహానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘ఇకపై మణిపూర్‌కి వెళ్లను’’ అని, అది తన వ్యక్తిగత నిర్ణయం అని మీడియాకు చాలా స్పష్టంగా వెల్లడించింది. ఐరన్‌లేడీ తీసుకునే నిర్ణయం ఏదైనా ఉక్కులా గట్టిగానే ఉండవచ్చు.
వివాహం తర్వాత!
ఎన్నికల తర్వాత కొడైకెనాల్‌లోని పెరుమామలైలో మానసిక సాంత్వన పొందింది షర్మిల. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి వారి పెళ్లికి ఆగస్టులో అనుమతి రావచ్చు. ఆ తర్వాత పెరుమలామలై చర్చిలో పెళ్లి. రెండు మతాల వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే నెల ముందుగా అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షర్మిల, డిస్‌మాండ్ చేసింది అదే. పెళ్లికి మణిపూర్ నుంచి పెద్దగా ఎవరూ ఉండరని, దరఖాస్తు చేసే సమయంలో తల్లి, సోదరుడు దగ్గర ఉన్నట్లు చెప్పింది. ఇకపై తాను సాధారణ మహిళగానే జీవితాన్ని గడపాలనుకుంటున్నానని 45 ఏళ్ల షర్మిల చెప్పారు. అయితే రాబోయే సెప్టెంబరు 17 నుంచి 20 మధ్యలో ఒడిషాలో జరిగే యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.
కాబోయే భర్త డెస్‌మాండ్‌తో షర్మిల