మరో కొత్త పార్టీ వచ్చేస్తోంది!
మణిపూర్ రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించాలంటూ దాదాపు 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలా చాను.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దానిపేరు 'పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్'. వచ్చే సంవత్సరం మణిపూర్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఈ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా ఒక మార్పును తీసుకొస్తామని, ఏఎఫ్ఎస్‌పీఏ లాంటి చట్టాలు ఇకమీదట సామాన్యులను ఇబ్బంది పెట్టలేవని పార్టీ ప్రకటన సందర్భంగా ఆమె అన్నారు.
2000 సంవత్సరం నవంబర్ రెండో తేదీన మొదలుపెట్టిన నిరాహార దీక్షను ఆమె గత ఆగస్టు నెలలో విరమించారు. అప్పుడే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ''నిరాహార దీక్షను ముగించినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపినట్పలు కాదు. మరో కొత్త ప్రారంభం ఉంటుంది'' అని ఆమె అన్నారు. రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావాలని, ఆ తర్వాత సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని నిషేధించాలని భావిస్తున్నారు. అయితే తాజా సర్వేల ప్రకారం.. మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీయే అధికారం చేపడుతుందని.. షర్మిలా చానుకు మద్దతు పలికేవాళ్లు కేవలం 6 శాతం మంది మాత్రమేనని తేలింది. మరి ఈ పార్టీ స్థాపించి ఆమె ఏం సాధిస్తారో.. ఎంతమేరకు ఫలితాలు రాబడతారో వేచి చూడాల్సిందే.