Desmond Coutinho
-
నిరాడంబరంగా ఇరోం షర్మిల వివాహం
-
నిరాడంబరంగా ఇరోం షర్మిల వివాహం
సాక్షి, చెన్నై : ఉక్కు మహిళ, మణిపూర్ పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల వివాహం తమిళనాడులోని కొడైకెనాల్లో గురువారం నిరాడంబరంగా జరిగింది. లండన్‌కు చెందిన డెస్మండ్ కౌటిన్హోను ఆమె వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని కొడైకెనాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షర్మిల వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరువురు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో పూలమాలలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరోం షర్మిల వివాహానికి పలు సంఘాలు వ్యతిరేకించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇలావుండగా ఇరోం షర్మిల వివాహానికి డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు దివ్యభారతి నేరుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో ఫోన్ ద్వారా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నానని షర్మిల తెలిపారు. మిగతా బంధువులకు ఆహ్వాన పత్రికలు ఇవ్వలేదని, అందుకే ఎవరూ రాలేదన్నారు. కాగా వారి వివాహాన్ని కొడైకెనాల్లో జరపకూడదంటూ హిందూ మక్కల్ కట్చి, ఉళవర్ ఉళైప్పాళర్ సహా అనేక సంఘాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. -
‘ఐరన్ లేడీ’ పెళ్లికి తొలగిన అడ్డంకి
కొడైకెనాల్: మణిపూర్ ఉక్కు మహిళ, పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల(44) వివాహానికి అవరోధం తొలగింది. బ్రిటిష్ జాతీయుడైన డెస్మండ్ కౌటిన్హోను ఆమె త్వరలో పెళ్లి చేసుకోనుందనే విషయం తెలిసిందే. అయితే, ఆమె పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మహేంద్రన్ అనే లాయర్, హక్కుల కార్యకర్త అభ్యంతరం తెలిపారు. ఆ దంపతులు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని తమిళనాడులోని కొడైకెనాల్ సబ్‌రిజిస్ట్రార్‌కు తెలియజేశారు. దీనిపై విచారణ జరిపిన ఆయన ఆ అనుమానాలను కొట్టిపారేశారు. షర్మిల, డెస్మండ్ కౌటిన్హోల వివాహానికి, ఇక్కడ నివాసం ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. కౌటిన్హోతో తన వివాహానికి అనుమతి ఇవ్వాల్సిందిగా జూలై 12వ తేదీన ఇరోం షర్మిల సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా నెల రోజుల్లోగా ఎవరైనా తెలియజేయాల్సి ఉంది. సబ్ రిజిస్ట్రార్ తాజా నిర్ణయంతో ఆమె వివాహానికి అడ్డంకులు తొలగిపోయాయి. మరోవైపు సైనిక ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లపాటు పోరాటం చేసిన ఉక్కు మహిళ షర్మిల గతేడాది ఆగస్టు 9న ఆమరణ నిరాహారదీక్షను విరమించారు. ఈ ఏడాది మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయగా కేవలం 90 ఓట్లే సొంతం చేసుకుని ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న షర్మిల.. మళ్లీ మణిపూర్ వెళ్లాలనుకోవడం లేదని ఇటీవల స్పష్టం చేశారు. -
వివాహానికి ఇరోం షర్మిల దరఖాస్తు
కొడైకెనాల్(తమిళనాడు): మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల గురువారం ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహానికి దరఖాస్తు చేశారు. కాబోయే భర్త, బ్రిటిష్ జాతీయుడు డెస్మాండ్ కౌటిన్హోతో కలిసి ఆమె హిందూ వివాహ చట్టం–1955 కింద వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు కొడైకెనాల్ సబ్ రిజిస్ట్రార్ మీడియాకు తెలిపారు. హిందూ వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహాలను రిజిస్టర్ చేయలేమని పేర్కొన్నారు. ప్రత్యేక వివాహ చట్టం–1954 ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేయగలమని చెప్పారు. ఇందుకోసం 30 రోజుల నోటీస్ సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మళ్లీ మణిపూర్ తిరిగి వెళ్లే ఆలోచన లేదని ఇరోం షర్మిల చెప్పారు. సైనిక ప్రత్యేక అధికారాల చట్టంకు వ్యతిరేకంగా 16 ఏళ్లు పోరాటం చేశాను. కానీ ఎన్నికల్లో ప్రజలు నన్ను తిరస్కరించారు. అందుకే మళ్లీ మణిపూర్ వెళ్లాలనుకోవడం లేద’ని ఇరోం షర్మిల వెల్లడించారు. 16 ఏళ్ల నిరాహారదీక్ష చేసిన గతేడాది ఆగస్టు 9న దీక్ష విరమించారు. ఈ ఏడాది జరిగిన మణిపూర్ ఎన్నికల్లో ఆమె పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు ఓడిపోయారు. ఇరోం షర్మిల కూడా పరాజయం పాలయ్యారు. ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
‘జీవితంలో పోటీ చేయను.. జూలైలో పెళ్లి’
ఇంపాల్: తన జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయబోనని మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల అన్నారు. ఇక నుంచి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. జూలై చివర్లో తన వివాహం జరగనుందని చెప్పారు. దాదాపు 16 ఏళ్లపాటు ఆహార పదార్థాలు మానేసి మణిపూర్‌లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టం అమలును ఆపేయాలంటూ దీక్ష చేసిన ఆమె అనంతరం తన దీక్షను విరమించి సొంతంగా పార్టీ పెట్టి మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఆమె త్వరలో జూలై చివరిలో అక్కడే వివాహం చేసుకోనున్నట్లు ఫోన్ ద్వారా తెలిపారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని, అయితే, ఒక పౌర హక్కుల కార్యకర్తగా తన పోరాటం మాత్రం కొనసాగిస్తానంటూ స్పష్టం చేశారు. పోరాటయోధురాలు ఇరోం షర్మిల తన బాయ్‌ఫ్రెండ్ డెస్మండ్ కొటిన్హోను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. షర్మిల నిర్ణయాన్ని ఇటీవలె ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని, ఆమెకు తాము అండగా ఉంటామని చెప్పారు. -
ఉక్కుమహిళకు పెళ్లి కుదిరింది
ఇంఫాల్: ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగానే ఆ రాష్ట్ర ఉక్కు మహిళ, పోరాటయోధురాలు ఇరోం షర్మిల త్వరలో తన బాయ్‌ఫ్రెండ్ డెస్మండ్ కొటిన్హోను పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ ధ్రువీకరించారు. కాగా వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో ఉన్న ఈ జంట అక్కడే పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. షర్మిల నిర్ణయాన్ని ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని, ఆమెకు తాము అండగా ఉంటామని చెప్పారు. షర్మిల దీక్ష చేస్తున్న సమయంలో 2011లో ఆమెకు తొలిసారి బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ పరిచయమయ్యారు. తర్వాత ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకున్నారు. వివాహం బంధంతో తామిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నట్టు డెస్మండ్ చెప్పారు. అనుమతులు తీసుకున్నాక తమిళనాడులోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ధ్రువీకరించారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేసిన దీక్షను షర్మిల విరమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఘోర పరాజయం ఎదురైంది. థౌబాల్ నియోజకవర్గంలో సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేయగా 90 ఓట్లు మాత్రమే వచ్చాయి.