‘జీవితంలో పోటీ చేయను.. జూలైలో పెళ్లి’
ఇంపాల్: తన జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయబోనని మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల అన్నారు. ఇక నుంచి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. జూలై చివర్లో తన వివాహం జరగనుందని చెప్పారు. దాదాపు 16 ఏళ్లపాటు ఆహార పదార్థాలు మానేసి మణిపూర్‌లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టం అమలును ఆపేయాలంటూ దీక్ష చేసిన ఆమె అనంతరం తన దీక్షను విరమించి సొంతంగా పార్టీ పెట్టి మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే.
ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఆమె త్వరలో జూలై చివరిలో అక్కడే వివాహం చేసుకోనున్నట్లు ఫోన్ ద్వారా తెలిపారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని, అయితే, ఒక పౌర హక్కుల కార్యకర్తగా తన పోరాటం మాత్రం కొనసాగిస్తానంటూ స్పష్టం చేశారు. పోరాటయోధురాలు ఇరోం షర్మిల తన బాయ్‌ఫ్రెండ్ డెస్మండ్ కొటిన్హోను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. షర్మిల నిర్ణయాన్ని ఇటీవలె ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని, ఆమెకు తాము అండగా ఉంటామని చెప్పారు.