irom sharmila chanu
-
‘జీవితంలో పోటీ చేయను.. జూలైలో పెళ్లి’
ఇంపాల్: తన జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయబోనని మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల అన్నారు. ఇక నుంచి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. జూలై చివర్లో తన వివాహం జరగనుందని చెప్పారు. దాదాపు 16 ఏళ్లపాటు ఆహార పదార్థాలు మానేసి మణిపూర్‌లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టం అమలును ఆపేయాలంటూ దీక్ష చేసిన ఆమె అనంతరం తన దీక్షను విరమించి సొంతంగా పార్టీ పెట్టి మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఆమె త్వరలో జూలై చివరిలో అక్కడే వివాహం చేసుకోనున్నట్లు ఫోన్ ద్వారా తెలిపారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని, అయితే, ఒక పౌర హక్కుల కార్యకర్తగా తన పోరాటం మాత్రం కొనసాగిస్తానంటూ స్పష్టం చేశారు. పోరాటయోధురాలు ఇరోం షర్మిల తన బాయ్‌ఫ్రెండ్ డెస్మండ్ కొటిన్హోను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. షర్మిల నిర్ణయాన్ని ఇటీవలె ఆమె సోదరుడు ఇరోం సంఘాజిత్ స్వాగతించారు. వివాహం చేసుకోవాలన్న షర్మిల నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని, ఆమెకు తాము అండగా ఉంటామని చెప్పారు. -
‘బీజేపీ రూ. 36 కోట్లు ఆఫర్ చేసింది’
ఇంపాల్: బీజేపీ తనకు రూ. 36 కోట్లు ఇవ్వజూపిందని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను వెల్లడించారు. అంతేకాదు మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ పై పోటీ చేసేందుకు తౌబాట్ నియోజవర్గం సీటు ఆఫర్ చేసిందని తెలిపారు. ‘నేను దీక్ష ముగించిన తర్వాత బీజేపీ నేత ఒకరు నన్ను కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే చాలా డబ్బు అవసరమవుతుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం రూ. 36 కోట్లు ఉండాలన్నారు. నేను కావాలనుకుంటే ఆ డబ్బు కేంద్రం ఇస్తుందని, ఒకవేళ ఇవ్వకపోతే తాను సమకూరుస్తానని బీజేపీ నాయకుడు నాతో చెప్పార’ని ఇరోం షర్మిల వెల్లడించారు. ఈ ఆఫర్ ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలకు చూపకుంటే షర్మిలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ ప్రధాన కార్యదర్శి(అడ్మినిస్ట్రేషన్) తొంగమ్ బిశ్వజిత్ సింగ్ హెచ్చరించారు. -
ఎన్నికల్లో ఓడిపోతే.. పెళ్లి చేసుకుంటా!
ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఒకవేళ ప్రజలు తనను తిరస్కరిస్తే మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతానని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేస్తున్న దీక్షను ఆమె ఇటీవలే విరమించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని షర్మిల ఇంతకుముందు చెప్పారు. ప్రజలు తన కొత్త వ్యూహాన్ని పట్టించుకోకపోయినా, తనను అవమానించినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం అవుతుందని చెమర్చిన కళ్లతో ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె హార్లిక్స్‌తో పాటు గంజి తీసుకుంటున్నారు. షర్మిలకు మంగళవారం బెయిల్ మంజూరైనప్పుడు కోర్టు పరిసరాల్లో ఆమె బోయ్ ఫ్రెండు డెస్మండ్ కోటిన్హో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ నియోజకవర్గంలోనే తాను 2017 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇరోం షర్మిల చెప్పారు. అయితే, సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టంపై పోరాటాన్ని ఆపేయడానికే ఆమెను రాజకీయాల్లోకి దించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇంతకుముందు సేవ్ షర్మిల అనే ప్రచారాన్ని చేపట్టిన కొంతమంది అంటున్నారు.