ఎన్నికల్లో ఓడిపోతే.. పెళ్లి చేసుకుంటా!
ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఒకవేళ ప్రజలు తనను తిరస్కరిస్తే మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతానని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేస్తున్న దీక్షను ఆమె ఇటీవలే విరమించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని షర్మిల ఇంతకుముందు చెప్పారు. ప్రజలు తన కొత్త వ్యూహాన్ని పట్టించుకోకపోయినా, తనను అవమానించినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం అవుతుందని చెమర్చిన కళ్లతో ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె హార్లిక్స్‌తో పాటు గంజి తీసుకుంటున్నారు.
షర్మిలకు మంగళవారం బెయిల్ మంజూరైనప్పుడు కోర్టు పరిసరాల్లో ఆమె బోయ్ ఫ్రెండు డెస్మండ్ కోటిన్హో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ నియోజకవర్గంలోనే తాను 2017 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇరోం షర్మిల చెప్పారు. అయితే, సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టంపై పోరాటాన్ని ఆపేయడానికే ఆమెను రాజకీయాల్లోకి దించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇంతకుముందు సేవ్ షర్మిల అనే ప్రచారాన్ని చేపట్టిన కొంతమంది అంటున్నారు.