నేరస్థులు నలుగురు.. కోటీశ్వరులు 32 మంది
నేరస్థులు నలుగురు.. కోటీశ్వరులు 32 మంది
Published Tue, Mar 14 2017 8:56 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
ఇంఫాల్: నేర చరిత్ర లేని ప్రజాప్రతినిధులను ఆశిస్తుంటే.. రోజురోజుకి వీరి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. తాజాగా మణిపూర్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 32 మంది కోటీశ్వరులు, నలుగురు నేరస్థులు ఉన్నారని ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్మ్స్) తెలిపింది. నేరచరిత్ర, ఆస్తులు, విద్య, వయసు వివరాలపై విశ్లేషించి మంగళవారం ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 , బీజేపీ 21, ఇతరులు 11 స్థానాలు గెలుచుకున్నారు. కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేల్లో క్రిమినల్ కేసులున్నవారు ఇద్దరని, సీరియస్ క్రిమినల్ కేసులు (హత్యానేర ఆరోపణలు) మరో ఇద్దరిపై ఉన్నాయని పేర్కొంది. బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై, కాంగ్రెస్ నేతల్లో ఇద్దరిపై క్రిమినల్ కేసులున్నాయి. 2012 ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఏ ఒక్కరికి నేరచరిత్ర లేదు.
గత ఎన్నికల్లో సగటు ఎమ్మెల్యే ఆస్తి రూ.95.551లక్షలు కాగా 2017 లో రూ.2.196 కోట్లకు చేరింది. గత ఎన్నికల్లో కోటీశ్వరులు 27 శాతం ఉండగా ఈ ఎన్నికల్లో 53 శాతం మంది ఉన్నారు. ఆస్తుల వివరాల్లో మొత్తం 60 మంది ఎమ్మెల్యేల్లో రూ.5 కోట్ల కన్నా ఎక్కవ ఆస్తులన్న అభ్యర్థులు ఇద్దరు, రూ.2- 5 కోట్ల ఆస్తులు ఉన్నవారు 17 మంది, రూ. 50 లక్షల - రూ.2కోట్లు ఉన్న వారు 27 మంది ఉన్నట్లు ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇక 13 మందికి రూ.10 - 50 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి.
అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 18 మంది కోటీశ్వరులు, బీజేపీలో 21 ఎమ్మెల్యేలలో 10 మంది ఉన్నారు. ఇతరుల్లో నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. అత్యధికంగా రూ.36 కోట్ల ఆస్తి ఉన్నట్లు కాంగ్రెస్ ఉక్రుల్ ఎమ్మెల్యే ఎస్. అర్థుర్ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఇక అతి తక్కువగా రూ. 9.28లక్షల ఆస్తి ఉన్నట్లు బీజేపీ ఇంఫాల్ వెస్ట్ ఎమ్మెల్యే సెక్మాల్ ప్రకటించారు.
ఆదాయపు పన్ను దాఖలు చేసిన అభ్యర్థులు ముగ్గురు. వీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం విశేషం. 60 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది ఆదాయపుపన్ను వివరాలు వెల్లడించారు. 2017 ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు రెండోసారి ఎన్నికయ్యారు. 2012లో వీరి సగటు ఆస్తి రూ.1.39 కోట్లు ఉండగా 2017లో రూ.1.96 కోట్లకు చేరింది. వీరి ఆస్తులు 41 శాతం పెరిగాయి. కాంగ్రెస్ నుంచి 22 మంది రెండో సారి ఎన్నిక కాగా, బీజేపీ నుంచి నలుగురు, ఇతరపార్టీల నుంచి ఇద్దరు గెలుపొందారు.
విద్యార్హతల పరంగా 14 మంది 5 నుంచి 12వ తరగతి చదివిన వారు ఉండగా, 42 మంది ఎమ్మెల్యేలు డిగ్రీ పూర్తిచేశారు. వీరిలో 13 మంది పీజీ చదివారు. ఒక ఎమ్మెల్యే నిరక్షరాస్యుడని తెలిపారు. వయసు రీత్యా 27 మంది ఎమ్మెల్యేలు 50 ఏళ్ల లోపు, 33 మంది 50 ఏళ్ల పై బడిన వారున్నారు. 8 మంది యువకులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం ముగ్గురే. 2012 లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలిచారు. ఈ సారి అదనంగా ఒక మహిళా ఎమ్మెల్యే శాసనసభలో అడుగు పెట్టనున్నారు.
Advertisement