రూ. 931 కోట్లకుపైగా ఆస్తులు పోగేశారు.. ఏడీఆర్ నివేదిక
అత్యల్ప సంపద గల సీఎంగా అట్టడుగున నిలిచిన మమతా బెనర్జీ
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వం రెండెకరాల భూమికి మాత్రమే యజమానిని అని చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఏకంగా వందల కోట్లకు అధిపతి అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ(ఏడీఆర్) కుండబద్ధలు కొట్టింది. భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఏడీఆర్ సంస్థ సోమవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల చిట్టాను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలపాటు అధికారం చలాయించి, ప్రస్తుతం సైతం ఏపీ సీఎం కుర్చీపై కూర్చున్న చంద్రబాబు నాయుడు పేరిట ఏకంగా రూ.931 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్ర బాబేనని స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వార్షిక తలసరి ఆదాయం కేవలం రూ.1,85,854 కాగా సగటున ముఖ్యమంత్రి తలసరి ఆదాయం ఏకంగా రూ.13,64,310కు పెరిగింది.
అంటే దేశంలో వార్షిక తలసరి సగటు కంటే సీఎం ఆదాయం ఏకంగా 7.3 రెట్లు అధికంగా ఉంది. దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. మోదీ సర్కార్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పేరిట కేవలం రూ.15 లక్షల ఆస్తులు ఉండటం విశేషం. చంద్రబాబు తర్వాత దేశంలో రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ నిలిచారు. ఆయన పేరిట రూ.332 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. ఆయన పేరిట రూ.51.93 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట రూ.30 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. ఒక కోటి రూపాయల అప్పు ఉంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట రూ.55 లక్షల ఆస్తులున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్ పేరిట రూ.1.18 కోట్ల ఆస్తులున్నాయి. ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఏకంగా రూ.52.59 కోట్లుకావడం గమనార్హం.
42 శాతం సీఎంలపై క్రిమినల్ కేసులు
నివేదికల పేర్కొన్న ముఖ్యమంత్రుల్లో 42 శాతం మందిపై.. అంటే 13 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 32 శాతం మందిపై.. అంటే పది మందిపై హత్య, అపహరణ, ముడుపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిలిచారు. ఆయనపై ఏకంగా 89 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 72 కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి ఉన్నాయి.
రేవంత్‌రెడ్డి తర్వాత స్థానాల్లో 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, 19 కేసులతో చంద్రబాబు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్ల అప్పులు ఉన్నాయి. సిద్ధరామయ్య రూ. 23 కోట్లు, చంద్రబాబు నాయుడుకు రూ.10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.
31 మంది సీఎంలలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా, ఇద్దరు డాక్టరేట్ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి ఆరుగురు ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కలు కాగా, 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు్కలేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఇద్దరే మహిళా సీఎంలు(మమతా బెనర్జీ, అతిశి మార్లేనా) ఉన్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment