16 ఏళ్ల దీక్ష విరమిస్తా | I will withdraw 16-year-old strike | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల దీక్ష విరమిస్తా

Published Wed, Jul 27 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

16 ఏళ్ల దీక్ష విరమిస్తా

16 ఏళ్ల దీక్ష విరమిస్తా

- ఆగస్టు 9న దీక్ష విరమణకు ఇరోమ్ షర్మిల ముహూర్తం
- వచ్చే మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
- ప్రజాసంఘాల ఉదాసీనత కారణంగానే నిర్ణయం  
- కుటుంబసభ్యులు, సన్నిహితుల ఆశ్చర్యం
 
 ఇంఫాల్ : మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఎత్తేయాలని కోరుతూ 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల ఆగస్టు 9న తన సుదీర్ఘ దీక్షను విరమించనున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై మంగళవారం ఇంఫాల్ కోర్టు విచారణకు హాజరైన 44 ఏళ్ల షర్మిల.. నిరాహార దీక్ష వల్ల సాధించేదీ లేదని భావిస్తున్నందున వివాదాస్పద ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం రద్దుకోసం త్వరలోనే రాజకీయాల్లో చేరనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానన్నారు.

ప్రజలు, ప్రజాసంఘాల నుంచి తన ఉద్యమానికి సరైన మద్దతు రాకపోవటం, ప్రభుత్వం తన డిమాండును పట్టించుకోకపోవటంతోనే నిరాహార దీక్షను విరమించాల్సి వస్తోందన్నారు. 2000లో దీక్ష మొదలుపెట్టినప్పటినుంచి ఆహారం తీసుకునేందుకు నిరాకరించటంతో.. ముక్కునుంచి వేసిన ట్యూబు ద్వారా ద్రవాలనందిస్తున్నారు. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు ఈ ఉక్కు మహిళను కలసి.. తమ పార్టీలో చేరాలని కోరినా ఆమె తిరస్కరించారు. కాగా, నిరాహార దీక్ష విరమించాలని షర్మిల తీసుకున్న నిర్ణయంతో ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని విరమించాలని ఎన్నిసార్లు చెప్పినా ఇరోమ్ వినలేదని.. అలాంటిది దీక్ష విరమించి అనుకున్నది సాధించేందుకు రాజకీయ మార్గం ఎంచుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ఆమె సోదరుడు సింఘాజిత్ తెలిపారు.

ఆమెతో పాటు పోరాటం చేస్తున్న పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, వివాదాస్పద చట్టాన్ని రద్దుచేయాలంటూ నిరాహార దీక్ష మొదలైనప్పటినుంచి కేవలం ఒకసారి మాత్రమే తల్లిని కలిసిన (2009లో తీవ్రమైన అనారోగ్యం బారినపడ్డప్పుడు) ఈ ఉక్కు మహిళ దీక్ష విరమించాక తొలిముద్ద తన తల్లి చేతుల మీదుగానే తింటానన్నారు. దీక్ష విరమించాక వివాహం చేసుకోనున్నట్లు ఆమె ప్రకటించారు. ఓ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు షర్మిలకు బాయ్‌ఫ్రెండ్ అని తెలిసింది. ఈయన ప్రోత్బలంతోనే షర్మిల నిరాహార దీక్ష విరమించుకుని.. రాజకీయ బాట పట్టారనే గుసగుసలూ వినబడుతున్నాయి.

 అవార్డులు, అభినందనలు
 ఈమె చేసిన ప్రయత్నానికి పలు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 2007లో ‘గ్వాంగ్జు ప్రైజ్ ఫర్ హ్యుమన్ రైట్స్’ ఈ ఐరన్ లేడీకి దక్కింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు షర్మిలను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశాయి. పలు ఎన్జీవోలు ఈమెకు మద్దతుగా  ఉన్నాయి. ఈమె పేరుతో చాలా పుస్తకాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ‘మై బాడీ, మై వెపన్’ పేరుతో వచ్చిన డాక్యుమెంటరీ ఎన్నో ప్రశంసలు అందుకుంది.
 
 దీక్ష ఎందుకోసం?
 2000 నవంబర్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని ఓ గ్రామంలో అస్సామ్ రైఫిల్స్ బెటాలియన్ (సాయుధ బలగాలు) 10 మందిని హతమార్చారు.  సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (అనుమానం వచ్చిన వ్యక్తులను చంపినా.. దీనికి కోర్టులో విచారణ ఉండదు) కారణంగానే ఈ హత్యలు జరగటంతో ఈ చట్టాన్ని రద్దుచేయాలని షర్మిల అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. షర్మిల చేస్తున్న అహింసాయుత ఉద్యమానికి కొద్ది రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి మద్దతు లభించింది. 2006లో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగి ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునివ్వటంతో.. ఆమెను అరెస్టు చేసి వదిలిపెట్టారు. అనంతరం  పలుమార్లు ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టు చేసి,  విడుదల చేశారు.
 
 ‘శరీరమే నా ఆయుధం’
 ఇరోమ్ చాను షర్మిల. మారుమూల రాష్ట్రమైన మణిపూర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యను పరిష్కరించేందుకు ప్రాణాన్నే పణంగా పెట్టిన సామాజిక వేత్త. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన షర్మిల మణిపురీ భాషలో మంచి కవయిత్రి కూడా.  2000 నవంబర్లో ఇంఫాల్ సమీపంలో జరిగిన ‘మాలమ్ హత్యాకాండ’ షర్మిల జీవితాన్ని మలుపుతిప్పింది. బస్‌స్టాపులో నిలబడిన 10 మందిని అస్సాం రైఫిల్స్ బెటాలియన్ దారుణంగా కాల్చి చంపింది. మృతుల్లో 62 ఏళ్ల మహిళతోపాటు సినామ్ చంద్రమణి (18) అనే జాతీయ సాహస బాలల అవార్డందుకున్న యువతి కూడా ఉంది. దీంతో తీవ్రంగా చలించిన షర్మిల సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను రద్దుచేయాలంటూ దీక్ష ప్రారంభించారు. ఆహారాన్ని తీసుకోకపోవటం మాత్రమే కాదు.. ఈ చట్టాన్ని తొలగించేంత వరకు అద్దంలో మొహం చూసుకోనని, జుట్టును కూడా ముడివేయనని చాణక్య శపథం తీసుకున్నారు.

డిమాండ్ నెరవేర్చుకునేందుకు తన శరీరాన్ని శుష్కించుకునేందుకు కూడా వెనకాడలేదు. ఒక రోజు, రెండ్రోజులు కాదు.. ఏకంగా 16 ఏళ్లుగా ఇలా నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టంపై యుద్ధం ప్రారంభించేటప్పటికి షర్మిల వయసు 28 ఏళ్లు. 2004లో 30 మంది షర్మిల మద్దతు దారులు ఢిల్లీలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ముందు నగ్నంగా ప్రదర్శన చేశారు. దీంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఉక్కు మహిళ ఆందోళనపై దృష్టిపెట్టాయి. జాతీయంగా పలువురు నోబెల్ అవార్డు గ్రహీతలు, అన్నాహజారే వంటి సామాజిక కార్యకర్తలు ఆమె ఉద్యమానికి మద్దతు తెలిపారు. అయినా.. ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయించటంలో విజయం సాధించలేకపోయారు. ఇందుకోసం ప్రధానులు, మంత్రులకు లెక్కలేనన్ని సార్లు లేఖలు రాశారు. అయితే.. తన డిమాండ్ నెరవేర్చుకునేందుకు రాజకీయ పోరాటాన్ని ఎంచుకోవాలని ఉక్కు మహిళ నిర్ణయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement