
ఇరోమ్ షర్మిల నిర్దోషి
ఢిల్లీ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: మణిపూర్ హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిలను ఓ కేసులో ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పదహారేళ్లుగా ఆమరణ దీక్ష చేస్తున్న ఇరోమ్‌పై 2006లో ఢిల్లీలో నమోదైన ఆత్మహత్యాయత్నం కేసులో ఈ తీర్పు వెలువరించింది.
2006లో జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంలో ఇరోమ్‌పై ఆత్మహత్యాయత్నం కేసు నమోదైంది. దీన్ని విచారించిన ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఆమెను నిర్దోషిగా ప్రకటించారు. దీనిపై షర్మిల కోర్టుబయట మాట్లాడుతూ గాంధేయ మార్గంలో నడుస్తున్నానన్నారు తనను జైల్లో ఉంచినా, బయట ఉంచినా ఆ చట్టం ఉపసంహరించేవరకూ తన పోరాటం సాగిస్తానని వెల్లడించారు. కాగా ఆమెకు ఓ కేసులో బెయిలు మంజూరుకు కోర్టు రూ.10వేల వ్యక్తిగత పూచీకత్తును చెల్లించాలని కోర్టు ఆదేశించగా దాన్నీ ఆమె తిరస్కరించారు. తాను అహింసా మార్గంలో పోరాడతానన్నారు.