![Delhi court summons Lalu Prasad Yadav sons in land for job scam](/styles/webp/s3/article_images/2024/09/18/bihar.jpg.webp?itok=gKSkuxcI)
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనల
కాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.
ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను జూన్‌లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment