మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిలను మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిందిగా ఇంఫాల్‌లోని జవహర్‌లాల్‌నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(జేఎన్‌ఐఎంఎస్) వైద్యులు సూచించారు. మణిపూర్‌లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దుచేయాలంటూ 16ఏళ్లపాటు చేసిన నిరాహార దీక్షను ఇరోం షర్మిల గత మంగళవారం విరమించడం తెలిసిందే. అప్పట్నుంచీ ఆమె ఇంఫాల్‌లోని జేఎన్‌ఐఎంఎస్ ఆస్పత్రిలోనే కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య గడుపుతున్నారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఎవరైనా పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేసి.. విరమించగానే ఘనాహారం తినడం ప్రారంభిస్తే అతడు లేదా ఆమె శరీరం ఏ విధంగా స్పందిస్తున్నదనేదానిపై వైద్య చరిత్రలో స్పష్టత లేదని వారు తెలిపారు. అందువల్ల షర్మిల మరికొన్నాళ్లపాటు వైద్య పర్యవేక్షణలో ఉండడం మంచిదని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం షర్మిలకు పాలు, పండ్లరసాలతోపాటు మెత్తగా ఉడికించిన అన్నం, ఓట్స్ వంటి తేలికపాటి ఆహారం ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతమిస్తున్న ఆహారానికి ఆమె శరీరం బాగానే సహకరిస్తోందన్నారు. అయితే అన్నిరకాల ఘనాహారాన్ని వెంటనే తీసుకునే స్థితిలో ఆమె శరీరం లేదని స్పష్టం చేశారు. షర్మిల ఆరోగ్య పరిస్థితిని వివిధ స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కాగా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకూ ఆసుపత్రిలో షర్మిల ఉంటుందని ఆమె సోదరుడు సింఘాజిత్ తెలిపారు.