ఇంపాల్: కరోనా వచ్చిన నాటి నుంచి మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. బంధువులు లేరు.. వేడుకలు లేవు. ఎక్కడికైనా వెళ్లాలంటే అంటే ఈ మాయదారి రోగం ఎక్కడ అంటుకుంటుందో అనే భయం. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కరోనా బారిన పడిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెగిటివ్ వచ్చినప్పటికి ఇంకా వారిని వివక్షతోనే చూస్తున్నారు. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నా కుటుంబ సభ్యులు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా నుంచి కోలుకున్న ఓ పేషెంట్‌కి, ఒక మహిళ ఆటో డ్రైవర్ సహాయం చేసింది. ఆస్పత్రి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషెంట్ స్వగ్రామానికి మహిళా డ్రైవర్ తన ఆటోలో తీసుకెళ్లింది. మణిపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా ఆటో డ్రైవర్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాలు..
సోమిచాన్ చితుంగ్(22) అనే యువతి మే నెలలో కోల్‌కతా నుంచి మణిపూర్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆమెకి చికిత్స అందించారు. 14 రోజుల చికిత్స తర్వాత మే 31న ఆమెకి కరోనా నెగిటివ్‌గా తేలింది. దాంతో వైద్యులు చితుంగ్‌ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమె స్వగ్రామం కామ్‌జాంగ్ వరకు అంబులెన్స్ ఏర్పాటు చేయడానికి ఆస్పత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలిపింది. ఆయన ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ కరోనా నుంచి కోలుకున్న పేషంట్‌ని తీసుకురావలని చెప్పడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంగతి కాస్తా లైబికి తెలిసింది. కరోనా భయంతో ఎవరు ముందుకు రాకపోవడంతో తానే చితుంగ్‌ని ఇంటికి చేర్చాలని నిర్ణయించుకుంది. వెంటనే వెళ్లి తాను చితుంగ్‌ని ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. (లాక్‌డౌన్ వల్ల కలిగిన లాభం ఇదే..!)
నా మాటలను సీరియస్‌గా తీసుకోలేదు
దీని గురించి లైబి మాట్లాడుతూ.. ‘మొదట వారు నా మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో నాకు సొంత ఆటో ఉందని.. దాదాపు పదేళ్ల నుంచి ఆటో నడుపుతున్నానని వారికి చెప్పాను. జాగ్రత్తగా తీసుకెళ్తానని చెప్పి ఒప్పించాను. అప్పుడు వారు నా ఆటోలో రావడానికి అంగీకరించారు. మే 31 రాత్రి మొదలైన మా ప్రయాణం జూన్ 1న ముగిసింది. సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న చితుంగ్ ఇంటికి చేరుకోవడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఇందుకు గాను వారి వద్ద నుంచి రూ.5 వేల రూపాయల కిరాయి తీసుకున్నాను. మాతో పాటు నా భర్త ఓనమ్ రాజేంద్ర కూడా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చింది లైబి. (పోలీస్ భార్య ప్రేమ)
నా జీవితంలో అత్యంత కష్టమైన ప్రయాణం
తన జీవితంలో ఇది అత్యంత కష్టతరమైన ప్రయాణం అని చెప్పుకొచ్చింది లైబి. ‘కమ్జోంగ్ వరకు పొగమంచు కురుస్తుంది. నా ఆటో హెడ్‌లైట్ సరిగా పని చేయడం లేదు. రోడ్డు కూడా బాగాలేదు. అంతా గుంతలు గుంతలుగా ఉంది. ఎలాగైతేనేం చితుంగ్‌ని క్షేమంగా ఇంటికి చేర్చాను’ అని లైబి చెప్పుకొచ్చింది. అనంతరం చితుంగ్ మాట్లాడుతూ.. ‘లైబికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆమె చేసిన సాయాన్ని ఎన్నటికి మరిచిపోను. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే’ అన్నారు. దీని గురించి తెలుసుకున్న మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరెన్ సింగ్ లైబిని ప్రశంసించారు. ‘జేఎన్‌ఐఎమ్‌ఎస్ నుంచి డిశ్చార్జ్ అయిన అమ్మాయిని తీసుకెళ్లడానికి హాస్పటల్ సిబ్బంది నిరాకరించారు. ఇతర ప్రైవేట్ వాహనదారుల ముందుకు రాలేదు. కానీ వీటిని లెక్కచేయకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పేషెంట్‌ని ఇంటికి తీసుకెళ్లిన పంగేకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీమతి లైబీ ఓనమ్‌ను 1,10,000 రూపాయల నగదు బహుమతితో గౌరవించడం ఆనందంగా ఉంది. ఇంఫాల్ నుంచి కమ్‌జోంగ్‌కు ఎనిమిది గంటలపాటు ఆటో నడిపిన ఆమె సేవ ఎంతో అభినందనీయం' అని ప్రశంసిస్తూ బీరెన్ సింగ్ ట్వీట్ చేశారు.(పాజిటివ్ ఉన్నా లక్షణాల్లేవా!)
Comments
Please login to add a commentAdd a comment