
ఇరోమ్ షర్మిల బాటలో మరో మహిళ
ఇంఫాల్: మణిపూర్ లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దుచేయాలంటూ 16 ఏళ్లపాటు చేసిన నిరాహార దీక్షను ఇరోమ్ షర్మిల విరమించిన నేపథ్యంలో మరో మహిళ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆరంబం రోబిత లీమా అనే 32 ఏళ్ల మహిళ నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కమ్యునిటీ హాల్ లో సోమవారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు రోబిత తెలిపారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దు చేయడంతో పాటు ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్పీ) వ్యవస్థను అమలు చేయాలన్న డిమాండ్ తో దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు.
రోబితకు డైమండ్(10), తంపామణి(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇరోమ్ షర్మిల అంటే తనకు గౌరవమని, ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని తాను కొనసాగించాలనుకుంటున్నట్టు రోబిత తెలిపారు. కుమార్తెల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిరవధిక దీక్షకు దిగొద్దని పలు మహిళా సంఘాల నేతలు రోబితను వారించారు. అయితే తన నిర్ణయానికే ఆమె కట్టుబడ్డారు.