ఇరోమ్ షర్మిల గురించి ఈ విషయాలు మీకు తెలుసా! | 10 things you need to know about Irom Sharmila | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కావాలనుకుంది.. కానీ జీవితమంతా ఆస్పత్రిలోనే!

Published Tue, Aug 9 2016 3:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఇరోమ్ షర్మిల గురించి ఈ విషయాలు మీకు తెలుసా!

ఇరోమ్ షర్మిల గురించి ఈ విషయాలు మీకు తెలుసా!

సాయుధ బలగాల అకృత్యాలపై పోరుబాట పట్టి.. 16 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్‌ షర్మిల మహాపోరాట ప్రస్థానం మంగళవారం మరో కీలక మలుపు తీసుకుంది. ఆమె నిర్విరామ నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిశ్చయించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా.. ఆ బెదిరింపులను లక్ష్యపెట్టకుండా ముందుకుసాగుతున్న ఉక్కుమహిళ షర్మిల ప్రస్థానంలోని కీలకాంశాలివి..  

  •     మణిపూర్‌ ఉక్కుమహిళగా పేరొందిన ఇరోమ్‌ షర్మిల మధ్యతరగతి కుటుంబంలో  1972లో జన్మించారు. తొమ్మిది మంది తోబుట్టువుల్లో చివరి సంతానం ఆమె. మొదట్లో డాక్టర్‌ కావాలనుకున్నారు. కానీ హక్కుల కార్యకర్తగా మారి.. 'సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆఫ్సా)కు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సైనికులకు 'చంపే లైసెన్స్‌' ఇచ్చే చట్టంగా పేరొందిన ఆఫ్సాను రద్దుచేయాలని నినదించారు.
     
  •     ఇరోమ్‌ షర్మిల 28 ఏళ్ల వయస్సులో ఉండగా 2000 నవంబర్‌ 4న ఉక్కుసంకల్పంతో నిరాహార దీక్షకు దిగారు. అంతకు రెండురోజుల ముందు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ సమీపంలోని మాలోమ్‌లో సైనికుల కాల్పుల్లో పదిమంది చనిపోయారు. అందులో ట్యూషన్‌ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న టీనేజ్‌ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో చలించిపోయిన షర్మిల పోరుబాటను ఎంచుకున్నారు.  
     
  •     మణిపూర్‌లో, దేశవ్యాప్తంగా ఆఫ్సా వ్యతిరేక ఉద్యమానికి షర్మిల కేంద్రంగా మారారు. ముక్కు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ ఏళ్లకు ఏళ్లు ఆమె కొనసాగించిన దీక్ష దేశమంతటికీ చేరింది.
     
  •     అప్పటినుంచి షర్మిల ఇంఫాల్‌లోని సజీవ సెంట్రల్‌ జైలులో కస్టడీలో ఉంచారు. కానీ, ఎక్కువకాలం నగరంలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ వైద్య విజ్ఞాన కేంద్రంలోనే గడిపారు. ఐదుగురు వైద్యులు, 12మంది నర్సులు, ముగ్గురు మహిళా పోలీసులు.. ఇలా దాదాపు 40మంది నిత్యం ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారం, పౌష్టికాలు అందజేసేవారు.
     
  •     షర్మిల 2000 సంవత్సరంలో తొలిసారి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించారన్న కారణంతో ఆమెను అరెస్టు చేయడం, విడుదల చేయడం నిత్యకృత్యంగా జరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు దేశంలో ఆత్మహత్యాయత్నం నేరంగా ఉండగా.. దీనిని నేరరహితంగా ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును గత సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఇంకా లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది.
     
  •     షర్మిల మంచి రచయిత, కవి. స్థానిక మీటిలాన్‌ భాషలో ఆమె రచనలు చేశారు. ఆమె రచనల్లో 12 కవితలతో కూడిన 'ఫ్రాగ్రాన్స్‌ ఆఫ్‌ పీస్‌' పుస్తకాన్ని తన మహా దీక్షకు ముందే రచించారు.
     
  •     2006లో షర్మిల తన ఆందోళనకు దేశ రాజధాని ఢిల్లీని వేదికగా చేసుకున్నారు. జంతర్‌ మంతర్‌లో ఆమె, కార్యకర్తలతో కలిసి దీక్ష చేశారు. వెంటనే ఆమెను అరెస్టు చేసినప్పటికీ ఆమె నిరాహార దీక్ష ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆఫ్సాలో మార్పులు తీసుకురావాలంటూ కోరుతూ యూరోపియన్‌ పార్లమెంటు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.
     
  •     అహింసాయుత మార్గంలో షర్మిల సాగించిన పోరాటం ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. 2007లో గ్వాంగ్జు మానవహక్కుల పురస్కారం, ఆసియన్‌ మానవ హక్కుల కమిషన్‌ జీవితసాఫల్య పురస్కారం, 2010లో విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ శాంతి బహుమతి ఆమెకు లభించాయి. 2013లో ఆమెస్టీ ఇంటర్నేషనల్‌ ఆమెను 'ప్రిజనర్‌ ఆఫ్‌ కాన్‌షైన్స్‌' (ఆత్మసాక్షికి ఖైదీ)గా కీర్తించింది.
     
  •     ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత షర్మిల వ్యక్తిగత జీవితం ప్రారంభమైందని చెప్పవచ్చు. 2011 మార్చిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు డెస్మండ్‌ కౌటిన్హో (48) ఆమెను ఆస్పత్రిలో కలిశారు. 2009లో నుంచి వీరిద్దరూ పరస్పరం లేఖలు రాసుకుంటున్నారు. అతడు తనను ప్రేమిస్తున్నట్టు షర్మిల మీడియాకు తెలిపింది. అయితే, ఆఫ్సా వ్యతిరేక ఉద్యమం నుంచి ఆమె దారి మళ్లించేందుకే ప్రభుత్వం కౌటిన్హోను పరోక్షంగా రంగంలోకి దింపిందని అప్పట్లో అనుమానాలు వచ్చాయి.
     
  •     గత నెల 26న తాను దీక్షను విరమించబోతున్నట్టు ప్రకటించి షర్మిల తన మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మంగళవారం దీక్ష విరమించి రాజకీయాల్లో చేరుతానని, పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement