అమ్మ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా..
మణిపూర్: మణిపూర్ ఉక్కు మహిళ, హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆమె తల్లి సఖి కలవడానికి రావడమే ఇందుకు కారణం. అమ్మ తనను కలడానికి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యానని షర్మిల అన్నారు. మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె పదహారేళ్లుగా నిరశన దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తన తల్లి తనను కలవడానికి వస్తే మనసు మార్చుకొని దీక్షను విరమించాల్సి వస్తుందని ఆమె ఇన్నాళ్లూ తల్లికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దీక్షను విరమించడంతో కుమార్తెను తల్లి కలిశారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల 2000 సంవత్సరం నుంచి నిరశన దీక్షను కొనసాగించారు. ఇటీవలే ఆగస్టు 9 న తన దీక్షను విరమించారు. తాను వివాహం చేసుకుంటానని త్వరలోనే రాజకీయాలలో చేరుతానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.