
ఆమె భారతీయురాలే కానీ..!
ఆమె దేశంలో పేరొందిన హక్కుల కార్యకర్త.
ఆమె దేశంలో పేరొందిన హక్కుల కార్యకర్త. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మద్దతుదారులున్నారు. కానీ సొంత రాష్ట్రం మణిపూర్ లో ఆమెకంటూ ఓ గుర్తింపుపత్రం లేదు. ఆమె భారతీయ పౌరురాలు అని చెప్పడానికి ఎలాంటి చట్టబద్ధ ఆధారమూ లేదు.
16 ఏళ్ల సుదీర్ఘ నిరవధిక నిరాహార దీక్షను ఇటీవల విరమించిన 44 ఏళ్ల హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ప్రస్తుత పరిస్థితి ఇది. వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఉద్యమించిన ఆమె ఇటీవల తన దీక్ష విరమించి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవసరమైన ధ్రువపత్రాలు షర్మిల వద్ద లేవు. పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఓటరు కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలేవి ఆమె వద్ద లేవు. ఈ పత్రాలుంటేనే ఆమెను భారతీయ పౌరురాలిగా గుర్తించి ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆమె పేరిట గుర్తింపుపత్రాలు తీసుకొని.. ఎన్ని కల్లో పోటీచేసేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నట్టు ఇరోమ్ షర్మిల మద్దతుదారులు చెప్తున్నారు.