
యూపీలో వీస్తున్నది పాతగాలే
జాతిహితం
ఈసారి యూపీ ఎన్నికల్లో ఎవరూ ఎవరిపైనా పెద్దగా ఆశపెట్టుకోలేదు. ప్రజలు తమ సంప్రదాయక ఓటింగు ధోరణులను మార్చుకునేలా చేసే బలమైన ప్రేరణ ఏదీ లేదు. ‘బయటివారు’ అని ఆలోచించేవారు మోదీనే అలా చూస్తున్నారు తప్ప, ఆయన ప్రత్యర్థు లను కాదు. సంఖ్యాబలాన్ని తారుమారు చేయడానికి అది సరిపోతుందా? షహజాద్ పూర్‌లో బంగాళ దుంపలను ఏరుతున్న బడి పిల్లల్లాంటి యువత పెద్ద సంఖ్యలో ఉంది. 2019 నాటికి వారు ఓటర్లవుతారు, అప్పుడైనా ఈ ప్రతిష్టంభన తొలగిపోతుంది.
ఎన్నికల బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ వెలువరిస్తున్న సంకేతాలు గత దశాబ్దిగా మనం చదువుతున్న, నివేదిస్తున్న వాటికంటే చాలా విభిన్నమైన చిత్రాన్ని సూచిస్తున్నాయి. బిహార్‌లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ గోడల మీది రాతలు అప్పట్లో ఆకాంక్షను ఎక్కువగా తెలియజేస్తుండేవి. ఆశావాదం, ఆకలి, ఆత్మవిశ్వాసం, ప్రత్యేకించి యువతలో కనిపించేవి. కుటుంబాల వద్ద ఖర్చుపెట్టడానికి కొంత మిగులు డబ్బుండేది. ఉత్తరాదిలో ప్రైవేటు బడి చదువుల నుంచి దక్షిణాదిన బ్రాండెడ్ చికెన్ వరకు మార్కెట్లు కళకళలాడుతుండేవి. ఇక పంజాబ్ నుంచి విదేశాలకు వలస పోతుండేవారు. రోజుకు రెండుసార్లు నోట్లోకి వేళ్లు పోవడమే గగనమై, ఆశనేదే కానరానిదిగా ఉండిన పేద రాష్ట్రం బిహార్ సైతం నితీష్ కుమార్ తొలి దఫా పాలనలో బ్రాండెడ్ లోదుస్తులను కొనడం మొదలెట్టింది.
ఆవిరైపోయిన ఆశావాదం
ఈ పరిస్థితి మారడం మొదలైందనడానికి ఉత్తరప్రదేశ్ ఒకవేళ సంకేతమే అయితే అది మెరుగైన మార్పు కానవసరం లేదు. ఆకాంక్షాభరితమైన ఆ వెల్లువ 2009లో యూపీఏను మరింత ఎక్కువ సంఖ్యాబలంతో తిరిగి అధి కారంలోకి తెచ్చింది. పాత ‘ముయా’(ముస్లిం–యాదవ్) ఓటు బ్యాంకుతోనే సాధ్యం కానంతటి పెద్ద మెజారిటీతో అది యువకుడైన అఖిలేష్ యాదవ్‌పై నమ్మకం ఉంచింది. 2014లో నరేంద్ర మోదీకి అది మెజారిటీని కానుకగా ఇచ్చింది, ‘‘పని చేస్తున్న’’ పలువురు ముఖ్యమంత్రులకు తిరిగి పట్టంగట్టింది. వారిలో కొందరు మూడోసారి ఎన్నికయినవారు. ఆ వెల్లువ నేడు సన్నగిల్లి పోతోంది. కానీ అంతరించిపోలేదు. ఆనాటి కొంత ఆశావాదం స్థానే నిరాశా నిస్పృహలు ప్రవేశిస్తున్నాయి. ఇది కొన్నిసార్లు చెడ్డ, పాత చిట్కాను తిరిగి ఆశ్రయించేలా చేస్తోంది. అంతకంటే ఎక్కువగా అది ఒకప్పటి హిందూ వృద్ధి రేటు కాలాన్ని గుర్తుకుతెచ్చేలా అస్తిత్వ రాజకీయాలు తిరిగి రంగప్రవేశం చేయడాన్ని సూచిస్తోంది. గత నాలుగేళ్లుగా మన ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి వద్ద నిలచిపోవడాన్ని హిందూ వృద్ధి రేటుగానే అభివర్ణించాల్సి ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్‌లో నేడు జరుగుతున్న ఎన్నికలు తిరిగి అలాగే జరుగు తున్నాయి. అస్తిత్వ (కులం లేదా మత విశ్వాసం) దుర్గం నుంచి యువతను బయటకు నడిపిన ఆశావాదం నేడు ఆవిరైపోయింది. కాబట్టే నేటి ఎన్నికల ప్రచారం పాతకాలపు కందకాల యుద్ధంగా మారింది. ఈ ప్రతిష్టంభనను బద్దలు కొట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నది ఒక్క నరేంద్ర మోదీనే.
ఓటర్ల మానసిక స్థితిలో వచ్చిన ఈ మార్పునకు మరింత కచ్చితమైన ఆధారాల అన్వేషణలో నాలుగు రోజులు రోడ్డు మార్గాన పయనించాను. ఢిల్లీ నుంచి పశ్చిమ యూపీలోని జాట్ల ఆధిక్యతగల ప్రాంతం నుంచి బుందేల్ ఖండ్‌కు, యాదవ్‌లకు పెట్టనికోట ఇటా, కాన్పూర్, లక్నోల గుండా ఈ ప్రయాణం సాగింది. అంతేలేనిదిలా అనిపించే ఆ తూర్పు పయనపు మధ్యలో బారాబంకి సమీపంలోని జైద్‌పూర్ గ్రామంలో (నియోజక వర్గం కూడా) నాకు అలాంటి ఆధారం దొరికింది. అది నిగనిగలాడుతున్న బిజినెస్ కార్డు. అది 23 ఏళ్ల అటార్ రెహ్మాన్ అన్సారీది. ఆ కార్డుకు మించి షెల్ఫ్‌లు, సరుకులే లేని అతని దుకాణం లేదా దాని గోడల మీది ప్రకటనలు ఎక్కువ విషయాలు చెప్పాయి.
అతని స్టార్ ఆన్‌లైన్ సెంటర్ అండ్ జనసేవా కేంద్రం నెలరోజుల క్రితమే ఏర్పాటైంది. కిరాణా దుకాణంలో దొరకనివి దాదాపు అన్నీ అక్కడ దొరుకు తాయి: పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ–చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భూయాజమాన్య రికార్డుల నకళ్లు, మార్పులు చేర్పులు చేయిం చడం, జీవిత బీమా, పాస్‌పోర్ట్, యూనివర్సిటీ పరీక్షల, ఉద్యోగాల దర ఖాస్తులు, ఫోన్ రీచార్జ్‌లు, మొబైల్ ఈ–వాలెట్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం వగైరా. ఇంటర్‌నెట్ ద్వారా చేయగలిగినది ప్రతిదీ.
అటా బీఎస్‌సీ రెండో ఏడాది విద్యార్థి. అతని కుటుంబం చేనేత మగ్గంపై నూలు, విస్కోజ్, పట్టువస్త్రాలను నేసే వృత్తిని నమ్ముకున్నది. పెద్ద నోట్ల రద్దుతో సరఫరాలు నిలిచిపోయి, కనీసం తాత్కాలికంగానే అయినా అది దెబ్బతినిపోయింది. పెద్ద నోట్ల రద్దు సృష్టించిన∙సంక్షోభంపై ఆధారపడే అటా స్టార్ ఆన్‌లైన్ సెంటర్ దుకాణం పెట్టాడు. అందులో జియో ఇంటర్నెట్ లైన్లతో కూడిన రెండు కంప్యూటర్లున్నాయి. గోడలకు ఆన్‌లైన్–చెల్లింపులు, ఈ–వ్యాలెట్ కంపెనీల పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఇక విద్యుత్ సరఫరా మరో సవాల్. దుకాణం ముందే ఓ సౌర విద్యుత్ యూనిట్‌ను పెట్టుకు న్నాడు. పగటిపూట అది నిలకడగా 300 వాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుంది. దుకాణంలోని కంప్యూటర్లు, లెడ్ బల్బులు, ఫ్యాన్ పనిచేయడానికి అది చాలు.
తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి పోర్టబుల్ సోలార్ విద్యుత్ యూనిట్ విలక్షణమైన యోచన. ఫోన్ చార్జింగ్, మోటార్ రిపేర్‌ల నుంచి హెయిర్ కటింగ్ దుకాణాల ముందు సైతం అవి అక్కడ కనిపిస్తాయి. మనిషి సృష్టించిన అత్యంత ప్రబలమైన ప్రతికూలతల మధ్యనే ప్రజలు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. అటా స్టార్ ఆన్‌లైన్ సెంటర్ ఉత్తర భార తంలోని సమస్యలను ఏకరువు పెడుతుంది: నాసిరకం పాలన, ఆర్థిక వృద్ధి లేమి, నిరుద్యోగం, వీటి నుంచి ఎలాగైనా బయటపడాలనే తపన, ఇటీవలే కోల్పోయిన ఆశావహదృష్టి. ఈ పరిస్థితి ఒక విద్యావంతుడైన యువ కునికి మంచి చేసినా, అందుకు భిన్నంగా ప్రతికూలతల మధ్య అవకాశాన్ని చేజిక్కిం చుకోవాలని ప్రయత్నిస్తున్నవారు కోట్లలో ఉన్నారు.
మార్పునకు ఆధారాలు ఇవిగో
ఉత్తర భారతానికి సంబంధించిన నిరక్షరాస్యత, పేదరికం, ఆఫ్రికా దేశాల స్థాయి సామాజిక సూచికల మూసుపోత చిత్రానికి కాలదోషం పట్టిపో యింది. విద్య ద్వారా ఆ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉన్నదని ప్రజలు భావించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఆ అవసరాలను తీర్చడంలో విఫలమైంది. దీంతో వారు పిల్లలకు తమ తాహతుకు మించిన ఖరీదైన చదువులను చెప్పించడానికి అప్పులు చేశారు, భూమిలో కొంత అమ్మేశారు. నేడు వారి పిల్లలకు మంచి డిగ్రీలున్నాయి. కానీ ఉద్యోగాల్లేవు లేదా విద్య నాణ్యత రీత్యా వారు ఉద్యోగాలకు అర్హులు కారు. ఇంకా రుణగ్రస్తులుగానే ఉన్న వారి తల్లిదండ్రులంతా ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి వారిలో కొందరు పొలాల్లో తమ తల్లిదండ్రులు ఏం చేశారో సరిగ్గా అవే పనులను చేస్తున్నారు. దీన్ని ద్వేషిస్తున్నారు. పాసీ దళితుడైన రామ్ శరణ్‌కు బీఎస్సీ డిగ్రీ ఉంది. అతను షహజాద్‌పూర్‌లో బంగాళ దుంపలను తవ్వి తీస్తున్నాడు. బాగా ప్రచారంలోకి వచ్చిన ఎన్‌డీటీవీ వీడియోలో మోదీ చర్యలను, శైలిని తాను ఎందుకు అభిమానిస్తాడో అత్యుత్సాహంగా చెప్పింది అతడే. అతని ఊహకు అందేది ఉపాధ్యాయ ఉద్యోగమే. రిజర్వేషన్లున్నా అది దొరకడం లేదు. బీఈడీ చేసినా ‘‘ఇదిగో, ఈ పనికిరాని బతుకే’’ అన్నాడు. అతని పొలంలో బడిలో చదువుతున్న ఏడుగురు ఆడపిల్లలు కూలీలుగా, ఉత్త చేతులతో మట్టిని కుళ్ల గిస్తూ బంగాళ దుంపలను దేవులాడుతున్నారు. వారు కూడా దళిత పాసీలే. వారికింకా ఓటు హక్కు రాలేదు. అయినా ఎవరికి ఓటేస్తారని అడిగితే, మోదీ అంటారు. 2019 వరకు వేచి చూడంyì . ఆ పిల్లలు పెరిగి భ్రమలు కోల్పోయి, విసిగిపోయి, ఆగ్రహంతో తిరుగబడుతుంటారు.
మరో ఠాకూర్ (రాజ్‌పుట్) గ్రామంలోని జనక్ సింగ్‌కు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉంది. అతను పొలం పని చేసుకుంటూ, రేషన్ దుకా ణాన్ని చూసుకుంటున్నాడు. సైనికుల రిక్రుట్‌మెంట్లో మూడుసార్లు విఫలమ య్యాడు. మాస్టర్స్ డిగ్రీ ఉన్న వ్యక్తి సైనికుడు కావాలని ఎందుకు ప్రయత్ని స్తాడు? కొన్ని వందల బంట్రోతు లేదా సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు 20 లక్షల మంది, వారిలో ఎక్కువ మంది డిగ్రీలు, చాలా మంది మాస్టర్ డిగ్రీలు, పీహెచ్‌డీలు సైతం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న ప్రాంతం అది. హిందూ వృద్ధి రేటు తిరిగి రావడం, నాణ్యతలేని విద్య కలసి మనల్ని జనాభాపరమైన విపత్తుకు చేరువగా నెట్టాయి. మీకేమైనా సందేహాలుంటే నాతోపాటూ యూపీలో పర్యటించండి.. భావి పరిణామాల సూచనలు స్పష్టంగా కని పిస్తాయి.
సరిపెట్టుకుంటూనే ఉంటారా?
ప్రతిచోటా కనిపించేది ఇదే చిత్రం. లక్నోలో అఖిలేష్ యాదవ్ ప్రచార బృందపు కాల్‌సెంటర్‌లో పనిచేసే బ్యూటీ సింగ్ అమే«థీలోని రాజ్‌పుట్ కుటుంబానికి చెందినది. ఆమెలో ఆత్వవిశ్వాసం ఉంది, జాగ్రత్తా ఉంది. మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఆమె నెలకు రూ. 11,000కు ఈ అతి స్వల్ప కాలపు ఉద్యోగం చేయడానికి ఇబ్బందేమీ పడటం లేదు. ఇది ఉత్తర భారతంలో వచ్చిన పెద్ద మార్పు. లేదా ఎన్నోవిధాలుగా విచారించదగిన మార్పులేక పోవడం. విద్య ఉన్నా ఉద్యోగాల్లేవు. ఆశనుగానీ, ఉద్యోగార్హతను గాని కలి గించలేని డిగ్రీలున్నాయి. అందువల్ల కలిగే నిరాశాస్పృహ ఉంది. కొత్త పారి శ్రామిక సంస్థలు లేవు. ఇంకా మిగిలిన కుటీర పరిశ్రమలేమేనా ఉంటే అవి పెద్ద నోట్ల రద్దు దెబ్బకు నాశనమయ్యాయి. వాస్తవానికి కొత్తగా ఆశ చిగు రించడమే లేదు. అయినా ఆగ్రహంతో విసుగెత్తి ఉన్న యువత నగరాలను తగలబెట్టడం లేదు, సాయుధ నక్సలైట్లలో చేరడం లేదా పంజాబ్‌లోలాగా మాదకద్రవ్యాలకు అలవాటు పడటం లేదు. మన గతి ఇంతేనని సరిపెట్టు కోవడం ఉత్తర భారతంలో బహుశా తేలిక కావచ్చు. ఇంకా వారికి ప్రజా స్వామ్యంలో, ఎన్నికల్లో నమ్మకం ఉండటం కూడా కొంతవరకు అందుకు కారణం కావచ్చు.
ఈ ఎన్నికలకు సంబంధించి మూడు స్వాభావిక లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, ఎవరూ ఎవరిపైనా పెద్దగా ఆశపెట్టుకోలేదు. రెండు, తమ సంప్ర దాయక (ప్రధానంగా కుల ప్రాతిపదికన) ఓటింగు ధోరణులను మార్చు కునేలా చేసేటంతటి బలమైన ప్రేరణ ఏదీ ప్రజలకు లేదు. మూడు, ‘‘బయటి వారు’’ అనే రీతిలో ఆలోచించేవారు... అలా మోదీవైపే చూస్తున్నారు తప్ప, అఖిలేష్, రాహుల్, మాయావతిల వైపు చూడటం లేదు. మనకు తెలియం దల్లా ఒక్కటే, ఇది ఈ ఎన్నికల్లో సంఖ్యాబలాన్ని తారుమారు చేయడానికి సరిపోతుందా? అలా జరగకున్నా, ఆశలేదని భావించే యువతలో చాలా మంది షహజాద్‌పూర్‌లో బంగాళ దుంపలను ఏరుతున్న బడి పిల్లల్లా ఇంకా ఓటర్లు కాలేదు. 2019 ఎన్నికల నాటికి వారు ఓటర్లవుతారు. అప్పుడు ఈ ప్రతిష్టంభన తొలగిపోతుంది.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta