అందుకే ఓడిపోయాం: ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపై ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. ఓటమికి ఏ ఒక్కరూ కారణం కాదని ములాయం అన్నారు. ఓటర్లను సంతృప్తి పరచలేకపోయామని, అందుకే ఓటమి చవిచూశామని చెప్పారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి 54 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ అంచనాలకు మించి 325 సీట్లు కైవసం చేసుకుంది. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికలకు ముందు ములాయం కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలు ఎస్పీ ఓటమి కారణాలుగా భావిస్తున్నారు. ములాయం ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. కేవలం సోదరుడు శివపాల్ యాదవ్, కోడలు అపర్ణ పోటీచేసిన జశ్వంత్ నగర్, లక్నో కంటోన్మెంట్‌లలో మాత్రమే ప్రచారం చేశారు. శివపాల్ విజయం సాధించగా, అపర్ణ ఓటమి చవిచూశారు. కాగా తమకు ఓటమి కొత్త కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని ములాయం అన్నారు.