ములాయం హోదా, నేమ్ ప్లేట్ మారాయి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ హోదా మారింది. మొన్నటి వరకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరించిన ములాయం ఇకనుంచి గార్డియన్‌గా ఉంటారు. శనివారం రాత్రి లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆయన నేమ్ ప్లేట్‌ను మార్చారు. చాలా ఏళ్లుగా ఉన్న ‘ములాయం సింగ్ యాదవ్, జాతీయ అధ్యక్షుడు’ నేమ్ ప్లేట్ స్థానంలో, ‘ములాయం సింగ్ యాదవ్, గార్డియన్’ అనే నేమ్ ప్లేట్‌ను ఉంచారు.
ములాయం కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గం.. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ములాయంను తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. ములాయం కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలు అనేక మలుపులు తిరుగుతూ, చివరకు అఖిలేష్ వర్గం పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ నేపథ్యంలో ములాయంను గార్డియన్గా పేర్కొంటూ పార్టీ ఆఫీసులో నేమ్ ప్లేట్ ఉంచారు. పార్టీలో ములాయంకు, అఖిలేష్కు సమాన హోదా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్కు ములాయం మార్గదర్శకుడిగా ఉంటారని తెలిపారు.