మెట్టుదిగని ములాయం.. కొడుకుతో పంతం
మెట్టుదిగని ములాయం.. కొడుకుతో పంతం
Published Wed, Jan 18 2017 8:40 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
సమాజ్‌వాదీ పార్టీని, పార్టీ గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన తండ్రి ఆశీస్సుల కోసం వెళ్లారు. తనకు తండ్రితో ఎప్పుడూ విభేదాలు లేవని, ఆయన మార్గదర్శకత్వం తమకు ఎంతగానో అవసరమని చెప్పారు. అలాగే ములాయం సింగ్ యాదవ్ కూడా తాను కొడుకు మీద పోటీ చేయడం కోసం కొత్తగా పార్టీ ఏమీ పెట్టేది లేదని స్పష్టం చేశారు. అయితే.. దానికి బదులుగా కొన్ని షరతులు పెట్టారు. తాను ఎంపిక చేసిన 38 మంది అభ్యర్థులకు పార్టీ జాబితాలో తప్పనిసరిగా టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ జాబితాలో అఖిలేష్ చిన్నాన్న శివపాల్ యాదవ్‌కు తొలుత స్థానం కల్పించలేదు గానీ, ఆయన బదులు ఆయన కొడుకు ఆదిత్య యాదవ్‌కు జస్వంతనగర్ టికెట్ ఇవ్వాలన్నారు. అప్పటితో అయిపోలేదు.. మంగళవారం సాయంత్రానికల్లా మళ్లీ ములాయం మాట మార్చారు. శివపాల్ యాదవ్ పేరును తన జాబితాలో మళ్లీ చేర్చారు. పార్టీ పెట్టినప్పటి నుంచి తనను అంటిపెట్టుకుని ఉండటమే కాక, ఎప్పటినుంచో తన బాధ్యతలను పంచుకుంటున్న అనుంగు సోదరుడు, కష్టాల్లో వెన్నంటి ఉన్న అనుజుడు శివపాల్‌కు టికెట్ ఇవ్వకపోతే ఎలాగంటూ పట్టుబట్టారు.
తండ్రీ కొడుకుల మధ్య శాంతి ఒప్పందం దాదాపు కుదిరిపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ శివపాల్ యాదవ్‌ను తెరమీదకు తీసుకురావడంతో మరోసారి ముసలం మొదలైంది. దాదాపు నెల రోజుల క్రితం కూడా అభ్యర్థుల జాబితా వల్లే ములాయం - అఖిలేష్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అఖిలేష్ యాదవ్ ముందుగానే ఒక జాబితా సిద్ధం చేయగా, ములాయం మాత్రం తన తమ్ముడు శివపాల్‌తో కలిసి, మరో జాబితాను రూపొందించి, తమదే అసలైన అధికారిక జాబితా అని చెప్పారు. దాంతో అఖిలేష్ మండిపడ్డారు. తనకు మద్దతుగా నిలిచేవాళ్లు ఎందరు అనే విషయాన్ని తెలుసుకోడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం పెడితే, దాదాపు 85-90 శాతం మంది హాజరయ్యారు. ఇక పూర్తి ఆత్మవిశ్వాసంతో పార్టీ గుర్తు, పార్టీ ఆధిపత్యం తనవేనంటూ క్లెయిమ్ చేశారు. ఆ పోరాటంలో ఎన్నికల కమిషన్ వరకు వెళ్లి మరీ విజయం సాధించారు.
కానీ ఇప్పుడు మళ్లీ ములాయం పాత పాట పాడుతూ అఖిలేష్ నెత్తిమీద కుంపటి లాంటి శివపాల్ యాదవ్‌ను మరోసారి తీసుకురావడంతో ఇక సయోధ్య కుదిరే విషయం అనుమానంగానే కనిపిస్తోంది. శివపాల్, అమర్‌సింగ్‌లను పార్టీ నుంచి తప్పించాలని అఖిలేష్ చెబుతుంటే, శివపాల్‌కు టికెట్ ఇవ్వాలని ములాయం డిమాండ్ చేయడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దాదాపుగా చాలా వరకు పేర్లు రెండు జాబితాలలోను ఉన్నాయని, కొన్నింటి విషయంలోనే తేడాలున్నాయని అఖిలేష్ పైకి చెబుతున్నారు. ఆ 'కొన్ని' పేర్లలో శివపాల్ లాంటివి కూడా ముఖ్యమైనవి. ఎప్పటినుంచో తనకు విశ్వాసపాత్రులుగా ఉన్నవాళ్ల పేర్లను ములాయం తన జాబితాలో ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల మీద అవినీతి, ఇతర ఆరోపణలు ఉండటంతో వాళ్లను ఇప్పటికే అఖిలేష్ పక్కన పెట్టారు. ఇప్పుడు తండ్రితో తగువు పెట్టుకోవాలా, ఎలాగోలా నచ్చజెప్పి జాబితాను ఫైనల్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు.
Advertisement
Advertisement