నాన్నా నేనే గెలిచాను.. ఆశీర్వదించండి
లక్నో: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్టుగా ఉంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీరు. తండ్రి ములాయంపై తిరుగుబాటు చేశారు.. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించారు.. ఆయన స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టారు.. ఎన్నికల సంఘం వద్ద పోరాడి ఎస్పీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను దక్కించుకున్నారు.. ఈసీ తీపీ కబురు చెప్పగానే అఖిలేష్ వెంటనే తండ్రి ములాయం ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజకీయపరంగా తండ్రికి షాకులమీద షాకులిచ్చిన అఖిలేష్.. వ్యక్తిగతంగా తండ్రి ములాయంపై గౌరవం చాటుకున్నారు.
సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం.. అఖిలేష్ వర్గానికి ఎస్పీ పేరు, పార్టీ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అఖిలేష్ వర్గీయులు సంబరాలు చేసుకోగా, ములాయం వర్గం ఢీలాపడింది. ఈసీ ప్రకటన తెలియగానే అఖిలేష్ తన భార్య డింపుల్‌తో కలసి తన అధికార నివాసానికి సమీపంలోనే ములాయం ఇంటికి వెళ్లారు. ములాయం ఆశీర్వాదం తీసుకున్నారు. అఖిలేష్‌పై బహిరంగంగా విమర్శలు చేస్తున్న ములాయం.. ఇంటికొచ్చిన కొడుకు పట్ల ఎలా వ్యవహరించారో..?
ఈసీ నిర్ణయం వెలువడగానే అఖిలేష్ నివాసం, పార్టీ కార్యాలయం వద్ద ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో ‘అఖిలేష్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు’ అన్న నేమ్ ప్లేట్‌ను తగిలించారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగేలా అఖిలేష్ వ్యూహరచన చేస్తున్నారు. కాగా తీరు మార్చుకోకుంటే అఖిలేష్‌పై పోటీ చేస్తానని, ఎన్నికల గుర్తు విషయంలో కోర్టును ఆశ్రయిస్తానని ములాయం ప్రకటించారు.