cycle symbol
-
‘సైకిల్’ కోసం న్యాయ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సైకిల్ గుర్తునే కేటాయించాలని కోరుతున్న సమాజ్‌వాదీ పార్టీ ఈ విషయంలో న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు హైకోర్టులో కేసు వేయనున్నట్లు తెలిసింది. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో విజయం సాధిం చినందున.. ఆ గుర్తును కేటాయించలేమని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. బుధవారం ఎస్పీకి ఓ తాత్కాలిక గుర్తును ఖరారు చేయనుంది. అయితే, జాతీయ పార్టీ అయిన తమకే సైకిల్ గుర్తును ఇవ్వాలని ఎస్పీ వాదిస్తోంది. టీడీపీ పోటీచేసే 13 నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన 106 స్థానాల్లో తమకు ఆ గుర్తును ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ పోటీ చేసే 13 చోట్ల తాత్కాలిక గుర్తుతో పోటీచేసేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు ఈసీ అంగీకరించకపోవడంతో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి న్యాయపోరాటా నికే మొగ్గుచూపుతున్నారు. వీలైనంత త్వరగా కేసు వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రచారానికి అఖిలేశ్.. ఎస్పీ తరఫున ప్రచారం చేయడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ త్వరలోనే రాష్ట్రానికి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, వరంగల్, జనగామ, కరీంనగర్‌తోపాటు ఉత్తర భారతీయులు అధికంగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్‌లలోనూ అఖిలేశ్ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని ఆ పార్టీ జనగామ అభ్యర్థి ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య వెల్లడించారు. -
సైకిల్ పేచి
-
'సైకిల్' రూట్ మార్చిన అఖిలేశ్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్'ను సొంతం చేసుకున్న యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. తన తండ్రిపై ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఓవైపు సైకిల్ గుర్తుపైకానీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష స్థానంపైగానీ తమ వాదనలు వినకుండా ముందస్తు ఆదేశాలు జారీచేయవద్దంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించిన అఖిలేశ్.. మరోవైపు తండ్రి ఫొటోలతోనే ఎన్నికల ప్రచారంలోకి దిగుతుండటం గమనార్హం. పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత భార్య డింపుల్ యాదవ్‌తో సహా తండ్రి ములాయంను కలుసుకుని ఆయన అశీర్వాదం తీసుకున్నారు. అయితే ఎస్పీలో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అందరూ భావిస్తున్న నేపథ్యంలో అఖిలేశ్ మాత్రం ఎంతో తెలివిగా తండ్రి ములాయం వర్గాన్ని మెప్పించాలని 'నాన్నకు ప్రేమతో..' అనే శైలిలో ప్రచారాన్ని చేపట్టారు. అఖిలేశ్ అంటే తండ్రి ములాయం సింగ్ అనే తరహాలో సీఎం వ్యవహరిస్తున్నారు. తండ్రి నుంచి తాను జీవితాన్ని అందుకున్నానని, యూపీ నుంచి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నానని భారీ ఫ్లెక్సీలతో ప్రచారానికి సిద్ధమయ్యారు అఖిలేశ్. తండ్రి ములాయం సింగ్ ఎస్పీని ఎంతో కష్టపడి ఏర్పాటుచేసి, అభివృద్ధి సాధించారని తెలియజేసే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తండ్రి ములాయం పాత్ర ఎలాంటిదో ఈ తాజా పోస్టర్ల ద్వారా యూపీ సీఎం చెప్పకనే చెబుతున్నారు. ఎప్పటిలాగే కలిసి పనిచేద్దాం.. విజయాన్ని సాదిద్ధాం అనే తాజా కొటేషన్లతో దూసుకుపోతున్నారు అఖిలేశ్. తొలిదశ ఎన్నికలకు మంగళవారం నోటిషికేషన్ విడుదలైంది. 15 జిల్లాల్లోని 73 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో వీరి మధ్య విభేదాలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయని భావించిన సీఎం వర్గీయులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఏర్పాటు చేసిన పార్టీ ఎస్పీ, ఎన్నికల గుర్తు సైకిల్ ఎప్పుడూ ములాయం పేరుతోనే నడుస్తాయని అర్ధం వచ్చేలా ఫ్లెక్సీలపై ముద్రించి ప్రచారం చేస్తున్నారు. నేటి ఉదయం మరోసారి తండ్రి ములాయంతో సీఎం అఖిలేశ్ భేటీ అయ్యారు. తాను పోటీచేసే స్థానంలోనే బరిలోకి దిగుతానని హెచ్చరించిన తండ్రిని ఆయన శాంతింపజేయడంలో విజయం సాధించారు. తాను రూపొందించిన జాబితా నుంచి 40 మందికి పోటీచేసే అవకాశం కల్పించాలని అశిలేశ్ను ములాయం కోరారు. తన వర్గీయులు శివపాల్ యాదవ్, శివపాల్ కుమారుడు అదిత్యా యాదవ్ లకు అవకాశం కల్పించాలని ములాయం కోరగా దీనిపై మరోసారి ఆలోచిస్తానని అఖిలేశ్ చెప్పారు. తమపై నమ్మకం ఉంచితే విజయంఖాయమని, యూపీలో మరింత అభివృద్ధి సాధిస్తామని తనమాటగా అఖిలేశ్ తన తండ్రికి నచ్చజెప్పారు. తండ్రితో విభేదాలు లేవని సూచించేలా విస్తృత ప్రచారాన్ని చేయాలని అఖిలేశ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే అఖిలేశ్ తన సైకిల్ రూట్ మార్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
'సైకిల్'పై సుప్రీంకోర్టుకు అఖిలేశ్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా గుర్తింపుతోపాటు, ఎన్నికల గుర్తైన 'సైకిల్'ను సైతం సొంతం చేసుకున్న అఖిలేశ్ యాదవ్.. వాటిని నిలుపుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సైకిల్ గుర్తుపైకానీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షస్థానంపైగానీ తమ వాదనలు వినకుండా ముందస్తు ఆదేశాలు జారీచేయరాదంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు అఖిలేశ్ తరఫున ఆయన బాబాయి రాంగోపాల్ యాదవ్ న్యాయవాదులతోకలిసి మంగళవారం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. (అఖిలేశ్‌కే ‘సైకిల్’ ) ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ములాయం సింగ్‌యాదవ్ హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అఖిలేశ్ వర్గం ఈ చర్యకు ఉపక్రమించింది. సైకిల్ గుర్తుకోసం చిన్నపాటి యుద్ధయం చేసి, భంగపడ్డ ములాయం.. ఎన్నికల్లో కొడుకుకు వ్యతిరేకంగా పోటీచేస్తారా? లేక కూడా ఉండి ఆశీర్వాదాలు ఇస్తారా? అనేది ఇంకా తేలాల్సిఉంది. ఇదిలాఉంటే, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. తొలిదశకు నోటిఫికేషన్ జారీ ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలకు మంగళవారం నోటిషికేషన్ విడుదలైంది. 15 జిల్లాల్లోని 73 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జనవరి 24. ఉపసంహరణ గడువు జనవరి 27. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న తొలిదశలో అత్యధిక స్థానాలు ముస్లిం ప్రాబల్యం ఉన్నవేకావడం గమనార్హం. వాటిలో ముజఫర్‌నగర్, మీరట్, షమ్లి, హాపుర్, అలీగఢ్, బులంద్ షహర్ ఆగ్రా, మథుర లాంటి ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయి. తొలిదశ పోలింగ్ దృష్ట్యా ములాయం.. అఖిలేశ్‌పై వేసిన 'ముస్లిం వ్యతిరేక' ముద్ర ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. -
పాపం పెద్దాయనకు దారేదీ?
కొడుకు మీద నిప్పులు చెరుగుతూ.. అవసరమైతే తాను స్వయంగా అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దిగుతానని, తన కుమారుడి మీద తానే పోటీ చేస్తానని ప్రకటించిన ములాయం సింగ్ యాదవ్ ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నిర్ణయం వెలువడగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కొడుకు, కోడలు తన ఇంటికి వచ్చి ఆశీర్వాదం కోరగానే వాళ్లకు ఆశీస్సులు ఇచ్చి, అభినందనలు కూడా తెలిపారు. కొడుకు తనతో ఒక్క నిమిషం కూడా మాట్లాడటం లేదని కొన్ని గంటల ముందే చిన్నబుచ్చుకున్న పెద్దాయన... ఆ తర్వాత భార్యతో సహా వచ్చిన కొడుకుతో సుదీర్ఘంగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న విషయం అయితే బయటకు రాలేదు గానీ, ఎన్నికల కమిషన్ నిర్ణయం వచ్చిన తర్వాత ములాయం సింగ్ కాస్త మెత్తబడ్డట్లే కనిపిస్తోంది. అంతకుముందు వరకు సమాజ్‌వాదీ పార్టీని గానీ, ఎన్నికల గుర్తును గానీ వదులుకునేది లేదని చెప్పినా, ఇప్పుడు అలాంటి అవకాశం ఏమీ లేకపోవడం, మరోవైపు తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా మంగళవారమే వెలువడుతుండటంతో తదుపరి కార్యాచరణ ఏం చేయాలో తెలియని డిఫెన్స్ పరిస్థితిలోకి ములాయం పడిపోయారు. ఎలాగైనా సైకిల్ గుర్తు తమకు వస్తుందన్న నమ్మకంతో ఉన్న పెద్దాయన.. ఇప్పుడు అది కాస్తా కొడుకు నేతృత్వంలోని వర్గానికి వెళ్లిపోవడంతో ఇక తన వద్ద మిగిలిన కొద్దిమంది నాయకులతో ఏం చేయాలోనని మల్లగుల్లాలు పడుతున్నారు. వరుసకు తమ్ముడయ్యే రాంగోపాల్ యాదవ్ (ప్రొఫెసర్ సాబ్) దగ్గరుండి మరీ కొడుక్కి సైకిల్ గుర్తును, పార్టీని వచ్చేలా చేయడంతో ఒకవైపు కారాలు మిరియాలు నూరుతున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ నాయకుడు అమర్‌సింగ్ తాను ఎన్నికలు అయిపోయే వరకు రాష్ట్రంలో కాదు కదా అసలు దేశంలోనే ఉండనని, లండన్ వెళ్లిపోతున్నానని చెప్పడం ఆయనను మరింత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు శివపాల్ యాదవ్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులెవరూ ములాయం దగ్గర లేరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో కూడా చాలామంది అఖిలేష్ వర్గానికి మద్దతుగా ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించారు. ఇప్పుడు పార్టీ గుర్తు, జెండా ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ సాధ్యం కాదు కాబట్టి మిగిలిన కొద్దిమంది కూడా అటువైపే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను స్థాపించిన పార్టీ చేజారిపోవడం, కొడుకు చేతుల్లోకి వెళ్లిపోవడం లాంటి పరిణామాలను ములాయం ఎలా జీర్ణించుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అఖిలేష్ వర్గం ఆఫర్ చేస్తున్న 'మార్గదర్శి' పోస్టును తీసుకోవడం ఒక్కటే ములాయం ముందున్న పెద్ద ఆప్షన్. అఖిలేష్ జోరు కాంగ్రెస్, ఆర్ఎల్డీ తదితర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటుచేయాలని అఖిలేష్ వర్గం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎటూ పార్టీ, గుర్తు కూడా తమకే వచ్చేశాయి కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో పావులు కదుపుతున్నారు. ఎలాగైనా మరోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆరితేరిన రాంగోపాల్ యాదవ్ అండదండలు ఉండటంతో అఖిలేష్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తాను ప్రశాంత కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తను పెట్టుకున్నా పెద్దగా ఫలితాలు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో అఖిలేష్‌తో కలిసి వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
నాన్నా నేనే గెలిచాను.. ఆశీర్వదించండి
లక్నో: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్టుగా ఉంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీరు. తండ్రి ములాయంపై తిరుగుబాటు చేశారు.. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించారు.. ఆయన స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టారు.. ఎన్నికల సంఘం వద్ద పోరాడి ఎస్పీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను దక్కించుకున్నారు.. ఈసీ తీపీ కబురు చెప్పగానే అఖిలేష్ వెంటనే తండ్రి ములాయం ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజకీయపరంగా తండ్రికి షాకులమీద షాకులిచ్చిన అఖిలేష్.. వ్యక్తిగతంగా తండ్రి ములాయంపై గౌరవం చాటుకున్నారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం.. అఖిలేష్ వర్గానికి ఎస్పీ పేరు, పార్టీ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అఖిలేష్ వర్గీయులు సంబరాలు చేసుకోగా, ములాయం వర్గం ఢీలాపడింది. ఈసీ ప్రకటన తెలియగానే అఖిలేష్ తన భార్య డింపుల్‌తో కలసి తన అధికార నివాసానికి సమీపంలోనే ములాయం ఇంటికి వెళ్లారు. ములాయం ఆశీర్వాదం తీసుకున్నారు. అఖిలేష్‌పై బహిరంగంగా విమర్శలు చేస్తున్న ములాయం.. ఇంటికొచ్చిన కొడుకు పట్ల ఎలా వ్యవహరించారో..? ఈసీ నిర్ణయం వెలువడగానే అఖిలేష్ నివాసం, పార్టీ కార్యాలయం వద్ద ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో ‘అఖిలేష్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు’ అన్న నేమ్ ప్లేట్‌ను తగిలించారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగేలా అఖిలేష్ వ్యూహరచన చేస్తున్నారు. కాగా తీరు మార్చుకోకుంటే అఖిలేష్‌పై పోటీ చేస్తానని, ఎన్నికల గుర్తు విషయంలో కోర్టును ఆశ్రయిస్తానని ములాయం ప్రకటించారు. -
ఇన్ని కార్లుండగా.. సైకిల్ ఎందుకు?
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి సైకిల్ తమకు కావాలంటే తమకు కావాలని కొట్టుకుంటున్నారు. కానీ, ఒక్కసారి వాళ్ల కార్లు చూస్తే కళ్లు తిరగక మానవు. సమాజ్‌వాదీ నాయకుడు ఆతిక్ అహ్మద్ లక్నోవీధుల్లో తన తెల్లటి హమ్మర్ వాహనంతోనే కనిపిస్తారు. దాని విలువ దాదాపు 70 లక్షలు. ఆయన మీద కిడ్నాప్ నుంచి హత్య వరకు దాదాపు 40 కేసులున్నాయి. ఆయనకున్న కార్లు, ఇతర వాహనాల సంఖ్య తక్కువేమీ కాదు. మూడు వారాల క్రితమే ఆయన హమ్మర్ సహా 50 వాహనాలను అలహాబాద్ సమీపంలో ఉన్న ఓ టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ఫీజు కట్టకుండానే పంపేశారు. ఇక పార్టీ అధినేతలలో ఎవరికి ఏ పదవి ఉందో తెలియని తండ్రీ కొడుకులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ఇద్దరికీ హై ఎండ్ మెర్సిడిస్ బెంజ్ కార్లున్నాయి. ములాయం సింగ్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన తన మెర్సిడిస్ ఎస్ క్లాస్ వాహనంలోనే కనిపిస్తారు. ఆయన కారు పక్కనే నలుగురు ఎన్ఎస్జీ గార్డులు పరుగులు తీస్తూ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అయితే మెర్సిడిస్ జీఎల్ఈ ఎస్‌యూవీలో వెళ్తుంటారు. బుల్లెట్ ప్రూఫ్ సదుపాయంతో కలిపి దాని విలువ దాదాపు రూ. 2.5 కోట్లు. వీళ్లిద్దరి కంటే.. యాదవ్ సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లో లేకపోయినా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తుంటాడు. ఆయన ప్రయాణించే నీలిరంగు లాంబోర్గిని కారు ఖరీదు దాదాపు 4 కోట్ల రూపాయలు. ఇన్ని రకాల ఖరీదైన కార్లు పెట్టుకుని సైకిల్ కోసం కొట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రస్తుతం సందేశాలు ఫార్వర్డ్ అవుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ కేసును ఇంకా తేల్చలేదు. ఇరువర్గాలూ తమకు మద్దతుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి సంతకాలతో కూడిన అఫిడవిట్లను సమర్పించారు. -
సైకిల్.. ఎవరికీ దక్కకుండా పోతుందా?
సమాజ్‌వాదీ పార్టీ స్థాపించిన పాతికేళ్ల తర్వాత.. ఆ పార్టీ గుర్తు సైకిల్ ఇప్పుడు ముక్కలు చెక్కలైపోయేలా ఉంది. నాదంటే నాదని తండ్రీకొడుకుల వర్గాలు కొట్టుకుంటుండటంతో ఎవరికీ దక్కకుండా అసలు పూర్తిగా ఆ గుర్తునే ఎన్నికల కమిషన్ రద్దుచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకసారి విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావించినపుడు అది ఊహాత్మకమైన ప్రశ్న అని సీఈసీ జైదీ కొట్టి పారేశారు గానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దానికి కూడా అవకాశం ఉంటుందనే అనిపిస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అటు అఖిలేష్ వర్గానికి గానీ, ఇటు ములాయం వర్గానికిగానీ సైకిల్ గుర్తు ఇవ్వకుండా ఆపేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం ఎన్నికల కమిషన్‌కు ఉందని అంటున్నారు. గత వారం పార్టీలో చీలిక వచ్చిన తర్వాత.. పార్టీ గుర్తు అయిన సైకిల్‌ను తనకే కేటాయించాలని ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎవరికి వారు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. (ములాయం 'సైకిల్' అఖిలేశ్‌కేనా?) ఇప్పటికే యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ప్రచారపర్వం ఊపందుకుంటోంది. కానీ అసలు ఏ గుర్తుతో ప్రచారం చేసుకోవాలోనన్న విషయం తేలకపోవడంతో అభ్యర్థులు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవైపు అఖిలేష్ వర్గంలోని కీలకనేత అయిన రాంగోపాల్ యాదవ్ కట్టలకొద్దీ అఫిడవిట్లు తీసుకుని ఎన్నికల కమిషన్‌కు సమర్పించగా, అందులో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీవేనని ములాయం, అమర్‌సింగ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి పంపడం కూడా సాధ్యం కాని పని. దాంతో ఎందుకొచ్చిన గొడవ అని పూర్తిగా ఆ గుర్తునే రద్దు చేసి, కొత్త గుర్తులను రెండు వర్గాలకు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎన్నికల కమిషన్ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా అయితే మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో సగానికి పైగా మెజారిటీ.. అంటే సాధారణ మెజారిటీ ఎవరికుంటే వాళ్లకు గుర్తు లభిస్తుంది. ఈనెల 17వ తేదీన తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆలోగానే తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ ఏం చేస్తుందన్న విషయం ఉత్కంఠభరితంగా మారింది. (సీఎం జోరు.. బాబాయ్ బేజారు!) గతంలోనూ ఇలాగే... గతంలో ఒకసారి ఇలాగే ఒక పార్టీ విడిపోయినప్పుడు గుర్తును రద్దుచేసిన చరిత్ర ఎన్నికల కమిషన్‌లో ఉంది. ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ అనే పార్టీ 2011లో విడిపోయింది. రెండు వర్గాలూ కుర్చీ గుర్తు తమకే కావాలని పట్టుబట్టాయి. దాంతో త్రివేందర్ సింగ్ పవార్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (పి) వర్గానికి కప్పు-సాసర్, దివాకర్ భట్ నేతృత్వంలోని జనతాంత్రిక్ ఉత్తరాఖండ్ క్రాంతిదళ్‌కు గాలిపటం ఇచ్చింది. -
పాపం... ములాయం!
ఒక పార్టీని స్థాపించడం, పాతికేళ్ల పాటు దాన్ని విజయవంతంగా నడిపించడం.. చివరకు దాన్ని వదులుకోవాల్సి రావడం ఎంత బాధాకరమో ములాయం సింగ్ యాదవ్‌కు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. కన్న కొడుకే తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని స్వాధీనం చేసుకోవడం, గుర్తును కూడా సొంతం చేసుకోవడం దాదాపు ఖాయమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఏం చేయాలో కూడా పెద్దాయనకు పాలుపోవడం లేదు. శుక్రవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహిస్తారని మీడియా సంస్థలన్నింటికీ సందేశాలు పంపి.. సరిగ్గా ఐదు నిమిషాల్లోనే మళ్లీ ఆ ప్రెస్‌మీట్ రద్దయిందని చెప్పారు. దీన్ని బట్టే ములాయం పరిస్థితి ఎంత సందిగ్ధంలో ఉందో అర్థమవుతుంది. ఎవరి వల్ల అయితే తాను పార్టీనుంచి బహిష్కరణకు గురి కావాల్సి వచ్చిందో.. ఎవరి కారణంగా తాను తండ్రితో తిట్లు తినాల్సి వచ్చిందో ఆ బాబాయ్ శివపాల్ యాదవ్ ఇంటికి సీఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఉదయం వెళ్లారు. ఆయన్ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వెంటనే శివపాల్ తన అన్న ములాయం ఇంటికి వెళ్లారు. ఇవన్నీ చూస్తే సమాజ్‌వాదీ పార్టీలో గొడవలు సర్దుమణిగిపోయాయేమో అని అంతా అనుకున్నారు. సంధి కుదిరిందనే భావించారు. కానీ అలా ఏమీ జరగలేదు. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే హక్కును వదులుకుని తనకు ఇవ్వాలని అఖిలేష్ షరతు పెట్టగా.. దానికి శివపాల్ ససేమిరా అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలలో అత్యధికుల మద్దతు తమకే ఉందని అఖిలేష్‌కు మద్దతుగా నిలిచిన మరో బాబాయ్.. ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్ చెబుతున్నారు. మొత్తం 229 మంది ఎమ్మెల్యేలలో 212 మంది, 68 మంది ఎమ్మెల్సీలలో 56 మంది, 24 మంది ఎంపీలలో 15 మంది తమకు మద్దతుగా అఫిడవిట్లపై సంతకాలు చేశారని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రమే తాము తమ వద్ద ఉన్న అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తామని, అందువల్ల కచ్చితంగా సైకిల్ గుర్తు తమకే వస్తుందని ఆయన అన్నారు. ములాయం పార్టీ పెట్టినప్పటి నుంచి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసుకోవడం, ఎన్నికల కమిషన్ వద్దకు కావల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చూడటంలో రాంగోపాల్ యాదవ్‌కు మంచి అనుభవం ఉంది. అలాంటి 'ప్రొఫెసర్ సాబ్' ఇప్పుడు అఖిలేష్‌కు అండగా ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చింది. మరోవైపు శివపాల్ యాదవ్, అమర్‌సింగ్ తదితర సీనియర్ల మద్దతున్న ములాయం సింగ్ యాదవ్ కూడా సైకిల్ గుర్తు తనకే చెందాలని ఈసీ వద్ద ఒక అఫిడవిట్ సమర్పించారు గానీ, అందులో ఎంతమంది సంతకాలు పెట్టారన్న విషయం మాత్రం బయటకు రావడంలేదు. ఇద్దరి వాదనలను వింటున్న ఎన్నికల కమిషన్.. తన తుది నిర్ణయం వెల్లడించేవరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. -
ఢిల్లీ వెళ్లిన పెద్దాయన!
తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. దాదాపు పాతికేళ్ల క్రితం పెట్టిన పార్టీని, అప్పుడు తీసుకున్న గుర్తును కాపాడుకోడానికి ములాయం సింగ్ యాదవ్ నానా పాట్లు పడుతున్నారు. తమ్ముడు శివపాల్ యాదవ్‌ను తీసుకుని ఆయన ఢిల్లీకి బయల్దేరారు. తమకు మద్దతిచ్చేవాళ్లు అందరి దగ్గర నుంచి అఫిడవిట్లు తీసుకుని.. వాటిని ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తానని చెబుతున్నారు. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు మాత్రం ప్రస్తుతానికి అఖిలేష్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. ములాయం మాత్రం తనకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే.. ఎంతమంది ఆయనకు మద్దతు చెబుతున్నారో మాత్రం ఇంతవరకు బయటపడలేదు. పార్టీ గుర్తు తమదేనని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలని అటు ములాయం, ఇటు అఖిలేష్ ఇద్దరికీ ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందుకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించింది. అయితే అంవతరకు ఆగడం ఎందుకని, ఇప్పటికే ములాయం ఢిల్లీ బయల్దేరగా.. అఖిలేష్ కూడా అఫిడవిట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం నాడు హస్తిన టూర్ పెట్టుకున్నారు. నోటి మాటగా కాకుండా.. అఫిడవిట్ల రూపంలోనే ఎవరెవరికి ఎంతెంత మద్దతు ఉందో చూపించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన అనూహ్య పరిణామంలో.. ములాయం సింగ్ స్థానంలో జాతీయాధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఆయన వర్గం ఎన్నుకుంది. దాంతోపాటు శివపాల్ యాదవ్‌ను యూపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఉత్తరం - దక్షిణం
-
‘సైకిల్’ కోసం హస్తినలో పంచాయితీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. ఆ పార్టీ అధికార గుర్తు కోసం తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. ‘సైకిల్’ నాదంటే నాదని పోరుకు సిద్ధమయ్యారు. సైకిల్ గుర్తు కోసం ములాయం, అఖిలేష్‌లు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. సైకిల్ తమదంటే తమదంటూ కుస్తీ పట్లు పడుతున్నారు. దీంతో సైకిల్ గుర్తు పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో సైకిల్ గుర్తుపై హక్కులు తమవేనంటు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని ఈ మేరకు ఆయన సీఈసీకి విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా యూపీలోని తాజా పరిణామాలను వివరించారు. కాగా ములాయంతో పాటు ఆయన సోదరుడు శివపాల్ యాదవ్, సీనియర్ నేత అమర్ సింగ్, జయప్రద కూడా ఎన్నికల సంఘాన్ని కలిశారు. మెజార్టీ ఎమ్మెల్యేలు అఖిలేష్ యాదవ్‌కే మద్దతు పలికినప్పటికీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ములాయం అంటున్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు అఖిలేష్ వర్గం కూడా సిద్ధమైంది. సైకిల్ గుర్తు కోసం అబ్బాయి వర్గం కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీలో మెజార్టీ తనవైపే ఉందని, అందుకే పార్టీ గుర్తు తమకే కేటాయించాలని పట్టు బడుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి విజ్ఞప్తి చేయాలని అఖిలేష్ టీం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యులాయం మరో సోదరుడు, ఎస్పీ బహిష్కృత నేత శివపాల్ యాదవ్ రేపు (మంగళవారం) ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు అఖిలేష్ వర్గానికి ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఇచ్చింది. -
ఆ ‘సైకిల్’ స్వతంత్రులదే..!
ఇప్పుడు టీడీపీకి గుర్తుగా ఉన్న సైకిల్ 1983కు ముందు ఇండిపెండెంట్లకు కేటాయించేవారు. ఇదిగో అదే సైకిల్ గుర్తుపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన చరిత్ర కరీంనగర్ జిల్లా బుగ్గారం సెగ్మెంట్‌కు సొంతం. బుగ్గారం నియోజకవర్గం 2009 పునర్విభజనతో కనుమరుగైంది. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి కాంగ్రెస్ తరపున ఎ. మోహన్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా కోరుట్ల మండలం జోగన్‌పల్లికి చెందిన ఏనుగు నారాయణరెడ్డి పోటీ పడ్డారు. నారాయణరెడ్డికి ఎన్నికల సంఘం సైకిల్ గుర్తు కేటాయించింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్ల మధ్యనే హోరాహోరీగా పోటీ సాగింది. నారాయణరెడ్డి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో సైకిల్‌పైనే తిరుగుతూ ప్రచారం సాగించారు. ఆ సమయంలో సైకిల్ గుర్తు అందరినీ ఆకట్టుకుంది. చివరికి సైకిల్ గుర్తుపై పోటీ చేసిన నారాయణరెడ్డికి 20,807 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మోహన్‌రెడ్డికి 20,493 ఓట్లు వచ్చాయి. కేవలం 300పై చిలుకు ఓట్ల తేడాతో నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదీ స్వతంత్రుల సైకిల్ సంగతి. - న్యూస్‌లైన్, కోరుట్ల