ఇన్ని కార్లుండగా.. సైకిల్ ఎందుకు?
ఇన్ని కార్లుండగా.. సైకిల్ ఎందుకు?
Published Mon, Jan 16 2017 12:42 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి సైకిల్ తమకు కావాలంటే తమకు కావాలని కొట్టుకుంటున్నారు. కానీ, ఒక్కసారి వాళ్ల కార్లు చూస్తే కళ్లు తిరగక మానవు. సమాజ్‌వాదీ నాయకుడు ఆతిక్ అహ్మద్ లక్నోవీధుల్లో తన తెల్లటి హమ్మర్ వాహనంతోనే కనిపిస్తారు. దాని విలువ దాదాపు 70 లక్షలు. ఆయన మీద కిడ్నాప్ నుంచి హత్య వరకు దాదాపు 40 కేసులున్నాయి. ఆయనకున్న కార్లు, ఇతర వాహనాల సంఖ్య తక్కువేమీ కాదు. మూడు వారాల క్రితమే ఆయన హమ్మర్ సహా 50 వాహనాలను అలహాబాద్ సమీపంలో ఉన్న ఓ టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ఫీజు కట్టకుండానే పంపేశారు.
ఇక పార్టీ అధినేతలలో ఎవరికి ఏ పదవి ఉందో తెలియని తండ్రీ కొడుకులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ఇద్దరికీ హై ఎండ్ మెర్సిడిస్ బెంజ్ కార్లున్నాయి. ములాయం సింగ్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన తన మెర్సిడిస్ ఎస్ క్లాస్ వాహనంలోనే కనిపిస్తారు. ఆయన కారు పక్కనే నలుగురు ఎన్‌ఎస్‌జీ గార్డులు పరుగులు తీస్తూ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అయితే మెర్సిడిస్ జీఎల్ఈ ఎస్‌యూవీలో వెళ్తుంటారు. బుల్లెట్ ప్రూఫ్ సదుపాయంతో కలిపి దాని విలువ దాదాపు రూ. 2.5 కోట్లు.
వీళ్లిద్దరి కంటే.. యాదవ్ సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లో లేకపోయినా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తుంటాడు. ఆయన ప్రయాణించే నీలిరంగు లాంబోర్గిని కారు ఖరీదు దాదాపు 4 కోట్ల రూపాయలు.
ఇన్ని రకాల ఖరీదైన కార్లు పెట్టుకుని సైకిల్ కోసం కొట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రస్తుతం సందేశాలు ఫార్వర్డ్ అవుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ కేసును ఇంకా తేల్చలేదు. ఇరువర్గాలూ తమకు మద్దతుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి సంతకాలతో కూడిన అఫిడవిట్లను సమర్పించారు.
Advertisement