uttarpradesh politics
-
మాయా వ్యూహం.. మహా తంత్రం
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి రాజకీయ వర్గాలను సందిగ్ధంలో పడేశారు. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ అధినేత ఎన్నికలకు దూరంగా ఉండటం వ్యూహాత్మకమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థి రేసులో ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేయరాదని మాయావతి నిర్ణయించుకోవడం వెనక రాష్ట్రంలో పార్టీని పూర్వ వైభవం తేవాలన్న పట్టుదల ఉందని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక మాయావతి పోటీ చేస్తే బీజేపీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఆమెను నియోజకవర్గానికే పరిమితం చేస్తుందని, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉండదని, మిత్రపక్షాలైన సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) తరఫున కూడా ప్రచారం చేయడానికి వీలుండదని అది కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మాయావతి పోటీలో లేకపోవడం అంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకపోవడమేనని బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలను చేసినా ఆమె పోటీకి దూరంగా ఉండటం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కింగ్ మేకర్ కావాలనే.. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీఎస్పీ 38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో వీలైనన్ని సీట్లను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని మాయావతి ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలి ఎన్నికల్లో ఆమె పార్టీ దారుణంగా దెబ్బతింది. 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 300కుపైగా సీట్లలో పోటీ చేస్తే 19 సీట్లు మాత్రమే వచ్చాయి. తాడోపేడో తేల్చుకోవాల్సిన వేళ.. గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలవాలి. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి. అందుకే దృష్టంతా పార్టీ అభ్యర్థుల గెలుపుపై పెట్టాల్సిన పరిస్థితి. 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని బీజేపీని దెబ్బకొట్టారు మాయావతి. ఆ విజయాన్ని పునరావృతం చేయాలన్న లక్ష్యంతో ఈసారీ ఎస్పీ, ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. సంకీర్ణ ధర్మంలో భాగంగా ఆమె మిత్రపక్షాల తరఫున కూడా ప్రచారం చేయాల్సి ఉంది. ఈ కారణాలన్నీ మాయావతిని ఎన్నికల బరికి దూరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి 2022లో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాయావతి ఇప్పుడు పోరుకు దూరంగా ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీఎస్పీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ సహకారంతో బెహన్జీ కచ్చితంగా గెలుస్తారు. దాంతో ఐదేళ్లు ఢిల్లీలోనే ఉండాల్సి వస్తుంది. ఆమె పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి ఒక సీటు పోవడం తప్ప పెద్దగా నష్టమేమీ ఉండదు. మాయావతి ఇక్కడే ఉండటం వల్ల 2022 అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవి కోసం అఖిలేశ్‌తో బేరాలాడే అవకాశం ఉంటుంది’ అని ఆయన వివరించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేసి మాయావతి లోక్‌సభకు వెళ్లిపోతే, ఇక్కడే ఉన్న అఖిలేశ్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ముందుంటారు. ఆ అవకాశం దక్కించుకోవడానికే మాయావతి పోటీ చేయడం లేదు’ అని ఆయన అన్నారు. మాకే లాభమంటున్న బీజేపీ మాయావతి ఎన్నికలకు దూరంగా ఉండటాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ద్వారా తాను ప్రధానమంత్రి రేసులో లేనని మాయావతి చెప్పకనే చెప్పినట్టయింది. దీనివల్ల జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీగా నిలిచేది కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్‌పై మాయావతి గుర్రుగా ఉన్నారు. ప్రధానమంత్రి రేసులో కాంగ్రెస్ నేతలు ఉండటాన్ని మాయావతి సమ్మతించరు. కాబట్టి ఎటు చూసినా ఓటర్లకు ప్రధాని పదవికి మోదీ మినహా మరొకరు కానరారు. అందువల్ల మాయావతి నిర్ణయం తమకే లాభిస్తుందని బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఓటమి.. ఆపై అన్నీ గెలుపే మాయావతి 1985లో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో మీరా కుమార్ (కాంగ్రెస్)తో పోటీచేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత అదే స్థానంలో కాంగ్రెస్‌ను ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆమె ఇంత వరకు లోక్‌సభకు నాలుగు సార్లు (1989, 1998, 1999, 2004) ఎన్నికయ్యారు. రాజ్యసభకు మూడు సార్లు (1994, 2004, 2012) ఎన్నికయ్యారు. అయితే, మూడుసార్లూ రాజ్యసభ సభ్యత్వ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేశారు. -
మళ్లీ యూటర్న్ తీసుకున్న ములాయం!
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో చెప్పలేం. తాజాగా ఆ పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. నిన్న కాక మొన్న తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేది లేదని.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారరంగంలో ఉంటానని చెప్పిన ములాయం, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తరఫున కూడా ప్రచారంలో పాల్గొంటానన్నారు. ''ఎంతైనా వాడు నా కొడుకు కదా'' అని అఖిలేష్ గురించి అన్నారు. ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులుంటాయా అని ఒక విలేకరి అడిగినప్పుడు ఆయనిలా చెప్పారు. ఫిబ్రవరి తొమ్మిదో తేదీ తర్వాత తాను ప్రచార పర్వంలోకి వస్తానన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడిగినప్పుడు.. ''వాళ్లు మా మిత్రపక్షం కదా, మరెందుకు ప్రచారం చేయను?'' అని ఎదురు ప్రశ్నించారు. జనవరి 22వ తేదీన అఖిలేష్ యాదవ్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు అక్కడ ములాయం కనిపించలేదు. అదేరోజు తాను తన భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి ములాయంకు మేనిఫెస్టో కాపీ ఇచ్చినట్లుగా ఉన్న ఒక ఫొటోను అఖిలేష్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సరిగ్గా ఒక రోజు తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుపై ములాయం మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హస్తం పార్టీతో పొత్తు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా సమాజ్ వాదీ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పడంతో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఊపిరి పీల్చుకున్నాయి. -
బరిలో ములాయం రెండో కోడలు
-
రాహుల్ గాంధీని పక్కన పెట్టేశారా?
ఐదు రాష్ట్రాలకు వచ్చే నెల నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా, ప్రధానంగా అందరి దృష్టి అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల పొత్తుల విషయం కూడా చిట్టచివరి విషయం వరకు తేలకపోవడంతో చాలామంది నరాలు తెగే ఉత్కంఠకు గురయ్యారు. ఎట్టకేలకు ప్రియాంకా గాంధీ రంగప్రవేశం చేసిన తర్వాత మాత్రమే సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అంతకుముందు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా రాని ఫలితం.. ప్రియాంక వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే వచ్చింది. దీంతో ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఉన్న అభిప్రాయం మరోసారి బలపడింది. రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంకను రంగంలోకి దించాలని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఎప్పటినుంచో వాదిస్తోంది. ఒకరకంగా ఇప్పుడు జరిగింది అదేనని అంటున్నారు. పొత్తు విషయంలో రాహుల్ గాంధీని పరిగణనలోకి తీసుకోకుండా ప్రియాంక నేరుగా రంగంలోకి దిగిన తర్వాత మాత్రమే.. అది కూడా సమాజ్‌వాదీ ముందునుంచి చెప్పిన 99 సీట్లు కాకుండా 105 సీట్లు ఇవ్వడానికి అంగీకరించేలా పొత్తు కుదిరిందన్నది వాళ్ల వాదన. రాహుల్‌గాంధీకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నా, వాస్తవానికి అది ప్రతిసారీ వాయిదా పడుతూనే ఉంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రులుగా ఉండే కొంతమంది సీనియర్లు మాత్రం రాహుల్‌కు పట్టాభిషేకం చేయాలని చెబుతున్నా స్వయంగా ఆయన కూడా దాన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. కీలక సమయాల్లో ఉన్నట్టుండి మాయం కావడం, విదేశీ పర్యటనల వివరాలు ఎవరికీ తెలియకపోవడం, ఆయన ప్రచారం చేసిన రాష్ట్రాల్లో పార్టీ ఫలితాలు అంతగా ఏమీ లేకపోవడం.. ఇలాంటి పలు రకాల ప్రతికూలతలు రాహుల్ గాంధీకి ఉన్నాయన్నది కాంగ్రెస్‌లో మరో వర్గం వాదన. ప్రియాంకను రంగంలోకి దింపాలని, ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని ఇంతకుముందే ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్లు వెలిశాయి. అచ్చం ఇందిరాగాంధీ లాగే కనిపించే ప్రియాంకను తీసుకొస్తే పార్టీకి కూడా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు జరిగిన పరిణామాలను అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. పార్టీ ఇప్పుడైనా ప్రియాంకను ముందుకు తీసుకురావాలన్నది వాళ్ల ఆకాంక్ష. -
అపర్ణ బరిలోకి దిగితే.. ఇక అంతే!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వాతావరణం ఇప్పుడు పూర్తిస్థాయిలో వేడెక్కింది. లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న విషయం అక్కడ ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరఫున ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషి పేరును ఇప్పటికే ప్రకటించారు. ఆమె గత ఎన్నికల్లో అక్కడినుంచి పోటీ చేసి గెలిచారు. సమాజ్‌వాదీ మాత్రం ఇంకా అక్కడ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. తన రెండో కోడలు అపర్ణా యాదవ్ అయితే బాగుంటుందన్నది ములాయం భావన. అయితే.. అసలు తన మరదలు అపర్ణను బరిలోకి అఖిలేష్ దిగనిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ములాయం మాత్రం ఈ స్థానంలో అపర్ణా యాదవ్ దిగుతారని దాదాపు ఏడాది క్రితమే చెప్పారు. అప్పటినుంచి ఆమె నియోజకవర్గంలో కూడా బాగా తిరుగుతున్నారు. ఇప్పటివరకు అక్కడ సమాజ్‌వాదీ ఒక్కసారి కూడా నెగ్గలేదు. అయితే.. ఇప్పుడు సమాజ్‌వాదీలో రెండు వర్గాల మధ్య పోరు గట్టిగా ఉండటంతో అఖిలేష్ పూర్తిగా అభ్యర్థుల ఎంపికను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చాలామంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు. కానీ లక్నో కంటోన్మెంటుకు మాత్రం ఎవరినీ ఇంకా చెప్పలేదు. వాస్తవానికి అపర్ణాయాదవ్ ముందునుంచి తన పిన మామగారు శివపాల్ యాదవ్ శిబిరంలోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్క శివపాల్ తప్ప ఆయన వర్గానికి ఎన్నికల్లో ప్రాతినిధ్యం కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో రీటా బహుగుణపై పోటీకి అపర్ణ దిగుతారా, ఆమెకు అఖిలేష్ అవకాశం ఇస్తారా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ అపర్ణ బరిలోకి దిగితే మాత్రం ఆమెకు చాలా గట్టి పోటీ తప్పదు. ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్‌కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమవతీ నందన్ బహుగుణకు సొంత కూతురే రీటా బహుగుణ. ఆమె కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు యూపీ రాష్ట్ర చీఫ్‌గా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. ఈసారి సమాజ్‌వాదీ - కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా, రీటా బహుగుణ మాత్రం బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ధీమాలో అపర్ణ ములాయం చిన్నకోడలు అపర్ణా యాదవ్ మాత్రం తనకు టికెట్ వస్తుందని పూర్తి ధీమాలో ఉన్నారు. తన విజయం, పార్టీ విజయం కోసం ఇక్కడ తాను గట్టిగా పనిచేస్తానని, రీటా బహుగుణకు పోటీ ఇస్తానని ఆమె లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో చెప్పారు. పాలిటిక్స్‌లో పీజీ చేసిన అపర్ణ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాల కోర్సు కూడా చేశారు. అపర్ణ మంచి గాయని కూడా. ములాయం రెండో భార్య సాధన కుమారుడైన ప్రతీక్ యాదవ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. -
ఎస్పీ-కాంగ్రెస్ కటీఫ్? రంగంలోకి ప్రియాంక
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మంచి సస్పెన్స్ డ్రామాను తలపిస్తున్నాయి. నిమిషానికో సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తండ్రీ కొడుకుల మధ్య ఏదో జరిగిపోయిందని అనుకుంటే.. శివపాల్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా అదంతా తుస్‌మన్నట్లే అయింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలతో కూడిన మహా కూటమి బీజేపీ - బీఎస్పీల భరతం పడుతుందని ముందునుంచి చెబుతుంటే, ఇప్పటికే ఆర్ఎల్డీ దాంట్లోంచి తప్పుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంగతి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఎవరికి వాళ్లు పంతాలు పట్టింపులకు పోతుండటంతో పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ప్రియాంకా గాంధీ వెంటనే రంగంలోకి దిగారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చర్చించడానికి తన వ్యక్తిగత దూతను లక్నో పంపారు. సమాజ్‌వాదీ పార్టీ 210 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేయడంతో కాంగ్రెస్‌లో గుబులు పట్టుకుంది. రెండు పార్టీల మధ్య పొత్తు విషయం ఇంకా ఏమీ తేలకముందే ఇలా సొంత జాబితా ఇచ్చేయడం, అందులోనూ.. గాంధీల కంచుకోటలు అయిన అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కూడా ఉండటం కాంగ్రెస్‌ను కలవరపరిచింది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ వ్యవహారం గురించి మాట్లాడేందుకు ప్రియాంక తరఫున దూతగా వచ్చిన ధీరజ్.. సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ఇంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తోనే తాము ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆయనతో చర్చిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ చెప్పారు. అయితే, ప్రియాంకా గాంధీ ఏకంగా 11 మెసేజ్‌లు పెట్టినా, అఖిలేష్ నుంచి వాటికి సమాధానం వెళ్లలేదని విశ్వసనీయ సమాచారం. దాంతో అసలు మహాకూటమి విషయం పక్కన పెడితే మామూలు పొత్తులు కూడా అయోమయంలోనే పడ్డాయి. అవసరమైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. చిట్టచివరి నిమిషంలో అఖిలేష్ ఇలా చేస్తారని కాంగ్రెస్ అసలు ఊహించలేదు. తమకు కనీసం వంద సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ ఒప్పుకొందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నా, అది చాలా పెద్ద సంఖ్య అవుతుందని సమాజ్‌వాదీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏమంత గొప్పగా లేదని, గత ఎన్నికల్లో కేవలం 28 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి ఇప్పుడు ఏకంగా వంద స్థానాలు కేటాయిస్తే వాటిలో కూడా తాము కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా లక్నో వచ్చి చర్చించాలని అఖిలేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనికి కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. రాహుల్ వస్తే ఇద్దరూ కలిసి సంయుక్త ప్రచారం చేద్దామని కూడా అఖిలేష్ ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్నాళ్లూ 103 సీట్లు అడుగుతుండగా, ఒక్కసారిగా ఆ సంఖ్యను 138కి పెంచేసింది. అసలు వంద స్థానాలు ఇవ్వడమే దండగ అనుకుంటే ఇప్పుడు ఏకంగా 138 ఎలా ఇస్తామన్నది సమాజ్‌వాదీ వర్గాల వాదన. ఆదివారం నాడు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. లాభం ఎవరికి? ఒకవేళ నిజంగానే సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పొత్తు కుదరకపోతే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. ప్రశాంత కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తను రంగంలోకి దించినా అక్కడ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. 404 (403 + ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ మెంబర్) అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఈసారి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే 15 స్థానాలకు మించి రావడం కష్టమని కూడా అంటున్నారు. కానీ, ఆ పార్టీ సమాజ్‌వాదీ, బీఎస్పీల నుంచి ముస్లిం ఓట్లను కొంతమేర చీల్చుకుంటుంది. అప్పుడు అసలు ప్రయోజనం మొత్తం బీజేపీకి వస్తుంది. సమాజ్ వాదీ, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు జరిగితే మాత్రం కమలనాథులు ప్రశాంతంగా ఉండొచ్చనేది ఎన్నికల పండితుల అంచనా. -
బాబాయ్.. అబ్బాయ్ దోస్తీ ఓకేనా!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరంటారు. సమాజ్‌వాదీ పార్టీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. తండ్రీకొడుకుల మధ్య ఏం ఒప్పందం జరిగిందో తెలియదు గానీ, తమ పార్టీకి చెందిన 191 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన అఖిలేష్.. అందులో తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు కూడా స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు ఉన్నట్లుగా ఈ జాబితాను బట్టి తెలుస్తోంది. తొలి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు. ఫిబప్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత నెలలో ములాయం విడుదల చేసిన జాబితాను పక్కన పెట్టి అఖిలేష్ యాదవ్ తన సొంత జాబితా సిద్ధం చేశారు. ములాయం జాబితాలో అఖిలేష్ కీలక అనుచరులైన అతుల్ ప్రధాన్, అరవింద్ సింగ్ లాంటి వాళ్లను పక్కన పెట్టగా తాజా లిస్టులో వాళ్లకు స్థానం దక్కింది. వారితో పాటు శివపాల్ యాదవ్‌కు కూడా చోటు ఇవ్వడంతో తండ్రీ కొడుకుల మధ్య పరిస్థితులు చక్కబడ్డాయని తెలుస్తోంది. అసలు శివపాల్ యాదవ్, అమర్‌సింగ్ ఇద్దరినీ పార్టీ నుంచి పంపేయాలని కూడా ఒక దశలో డిమాండ్ చేసిన అఖిలేష్, ఇప్పుడు తన తొలి జాబితాలోనే బాబాయ్‌కి టికెట్ ఇవ్వడంతో కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడిన విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించకపోయినా చెప్పినట్లే అయ్యింది. ములాయం సింగ్ యాదవ్ చెప్పినట్లే జస్వంత్‌నగర్ నియోజకవర్గ టికెట్‌ను శివపాల్‌కు కేటాయించారు. దాంతో ఇక అటు పార్టీలోను, ఇటు కుటుంబంలోను సమస్యలు ఏమీ ఉండకపోవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు. సైకిల్ గుర్తును అఖిలేష్ వర్గానికే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ములాయం 38 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను కొడుక్కి ఇచ్చారు. వాటిలో శివపాల్ పేరు ఉంది. -
ఎన్నికలు ముంచుకొచ్చినా.. తేలని పొత్తులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తొలిదశ నామినేషన్లకు గడువు గట్టిగా వారం రోజులు కూడా లేదు. కానీ అక్కడ ఇంకా పొత్తుల విషయం తేలలేదు. అఖిలేష్ నేతృత్వంలో ఏర్పడుతుందనుకుంటున్న మహాకూటమిలో అజిత్ సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) ఉంటుందో లేదోనన్న అనుమానాలు వస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ.. ఇవన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయాలని, తద్వారా బీజేపీ, బీఎస్పీలను ఓడించాలని ముందునుంచి భావిస్తున్నారు. అయితే.. తొలిదశలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. అదే ఇప్పుడు పొత్తు విషయంలో ప్రధాన అడ్డంకిగా మారింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఆర్ఎల్డీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు కూడా. దాదాపు వారం రోజుల క్రితం తొలిదఫా చర్చలు జరిగాయి. అప్పుడు ఆర్ఎల్డీకి 23 టికెట్లు ఇస్తామని సమాజ్‌వాదీ ఆఫర్ చేసింది. అయితే తమకు మరిన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం కావాలని అజిత్ సింగ్ డిమాండ్ చేశారు. కానీ దానికి అఖిలేష్ బృందం అంగీకరించలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ చర్చలన్నవి ఏమీ జరగలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని మొదటి రెండు దశల్లో.. ముజఫర్ నగర్, మీరట్, హాపూర్, బులంద్ షహర్, అలీగఢ్, ఆగ్రా, మథుర లాంటి ప్రాంతాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఇక్కడ సీట్లు బాగానే గెలుచుకుంది. ఇక్కడ తమకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తే బీజేపీని గట్టి ఎదుర్కోగలమని ఆర్ఎల్డీ అంటోంది. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీకి వచ్చిన స్థానాలు 8 మాత్రమే. అందువల్ల ఇప్పుడు ఎన్ని స్థానాలు కేటాయించాలన్న విషయంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో.. ఏం చేయాలోనని తలపట్టుకుంటున్నాయి. -
అఖిలేష్‌పై నేనే పోటీ చేస్తా: ములాయం
ఇప్పటివరకు మాటలకే పరిమితమైన ములాయం - అఖిలేష్ పోరు ఇక నేరుగా ఎన్నికల బరిలోకి తలపడే వరకు వెళ్లింది. అవసరమైతే స్వయంగా తానే అసెంబ్లీ ఎన్నికల బరిలో తన కొడుకు అఖిలేష్ యాదవ్ మీద పోటీ చేస్తానని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. అఖిలేష్ ముస్లింలను సమాజ్‌వాదీ పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని ఆయన ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ఎవరికి చెందాలనే విషయం గురించి ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని సోమవారమే వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ములాయం తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. తాను పార్టీని, సైకిల్ గుర్తును కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నానని.. అఖిలేష్ తన మాటలు వినిపించుకోకపోతే తాను ప్రత్యక్షంగా అతడిపై పోటీకి దిగుతానని ములాయం స్పష్టం చేశారు. తాను మూడుసార్లు అఖిలేష్‌ను పిలిచానని, కానీ అతడు ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉండి, తాను మాట్లాడటం మొదలుపెట్టడానికి ముందే అక్కడినుంచి వెళ్లిపోయాడని అన్నారు. సైకిల్ గుర్తు విషయంలో ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ, ఇతర ప్రతిపక్షాలతో అఖిలేష్ చేతులు కలిపాడని, అతడికి నచ్చజెప్పడానికి తాను ఎంత ప్రయత్నించినా తన తప్పులు తెలుసుకోవడం లేదని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, అఖిలేష్‌కు వ్యతిరేకంగా ప్రజల సాయం కోరుతానని తెలిపారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు? కాంగ్రెస్, ఆర్ఎల్డీ పార్టీలతో కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగాలని అఖిలేష్ వర్గం భావిస్తుండగా.. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించడం ద్వారా ఆ వర్గానికి ముస్లిం ఓట్లను దూరం చేసేందుకు ములాయం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా 19 శాతం వరకు ఉంది. ఇన్నాళ్లూ సమాజ్‌వాదీ పార్టీకి వాళ్ల మద్దతు గట్టిగా ఉండేది. చివరకు ములాయంను 'మౌలానా ములాయం' అని కూడా అనేవారు. అలాంటి భారీ మద్దతును కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే అఖిలేష్ వర్గంపై 'బీజేపీ అనుకూల' రంగు పులిమేందుకు ములాయం ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం. -
ఇన్ని కార్లుండగా.. సైకిల్ ఎందుకు?
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి సైకిల్ తమకు కావాలంటే తమకు కావాలని కొట్టుకుంటున్నారు. కానీ, ఒక్కసారి వాళ్ల కార్లు చూస్తే కళ్లు తిరగక మానవు. సమాజ్‌వాదీ నాయకుడు ఆతిక్ అహ్మద్ లక్నోవీధుల్లో తన తెల్లటి హమ్మర్ వాహనంతోనే కనిపిస్తారు. దాని విలువ దాదాపు 70 లక్షలు. ఆయన మీద కిడ్నాప్ నుంచి హత్య వరకు దాదాపు 40 కేసులున్నాయి. ఆయనకున్న కార్లు, ఇతర వాహనాల సంఖ్య తక్కువేమీ కాదు. మూడు వారాల క్రితమే ఆయన హమ్మర్ సహా 50 వాహనాలను అలహాబాద్ సమీపంలో ఉన్న ఓ టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ఫీజు కట్టకుండానే పంపేశారు. ఇక పార్టీ అధినేతలలో ఎవరికి ఏ పదవి ఉందో తెలియని తండ్రీ కొడుకులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ఇద్దరికీ హై ఎండ్ మెర్సిడిస్ బెంజ్ కార్లున్నాయి. ములాయం సింగ్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన తన మెర్సిడిస్ ఎస్ క్లాస్ వాహనంలోనే కనిపిస్తారు. ఆయన కారు పక్కనే నలుగురు ఎన్ఎస్జీ గార్డులు పరుగులు తీస్తూ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అయితే మెర్సిడిస్ జీఎల్ఈ ఎస్‌యూవీలో వెళ్తుంటారు. బుల్లెట్ ప్రూఫ్ సదుపాయంతో కలిపి దాని విలువ దాదాపు రూ. 2.5 కోట్లు. వీళ్లిద్దరి కంటే.. యాదవ్ సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ రాజకీయాల్లో లేకపోయినా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తుంటాడు. ఆయన ప్రయాణించే నీలిరంగు లాంబోర్గిని కారు ఖరీదు దాదాపు 4 కోట్ల రూపాయలు. ఇన్ని రకాల ఖరీదైన కార్లు పెట్టుకుని సైకిల్ కోసం కొట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రస్తుతం సందేశాలు ఫార్వర్డ్ అవుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ కేసును ఇంకా తేల్చలేదు. ఇరువర్గాలూ తమకు మద్దతుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి సంతకాలతో కూడిన అఫిడవిట్లను సమర్పించారు. -
మీ కొట్లాటలు సరే.. మా సంగతేంటి?
-
మీ కొట్లాటలు సరే.. మా సంగతేంటి?
ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయినా సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ముసలం ఇంకా తొలగిపోలేదు. దాంతో నేతల సంగతి ఎలా ఉన్నా.. ఆ పార్టీ జెండాలు, పోస్టర్లు అమ్మే దుకాణదారుల పరిస్థితి అయోమయంలో పడింది. తాము చాలా సంవత్సరాల నుంచి ఒక్క సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్ల లాంటి ఎన్నికల సామగ్రి మాత్రమే అమ్ముతున్నామని, సాధారణంగా వీటిని చాలా ముందు నుంచి తయారు చేసుకోవాల్సి ఉంటుందని లక్నోలో ఇలాంటి వ్యాపారం చేసే ఓ వ్యాపారి చెప్పారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచే ప్రింటింగ్, ఇతర పనులు పూర్తయిపోతాయని, అప్పటినుంచి మొదలుపెట్టి నాయకులకు, పార్టీ కార్యాలయాలకు, కార్యకర్తలకు, అభిమానులకు వీటిని విక్రయిస్తుంటామని అన్నారు. కానీ ఇప్పుడు అసలు పార్టీ గుర్తు ఏదో తెలియకపోవడం, ఎవరి ఫొటోల కింద ఏ పార్టీ అని రాయాలో కూడా స్పష్టత లేకపోవడంతో ఇప్పటికే ముద్రించిన ఎన్నికల సామగ్రిని ఏం చేసుకోవాలో తెలియట్లేదని వాపోయారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ములాయం.. అఖిలేష్ ఇద్దరూ కలిసున్న ఫొటోలు, పోస్టర్లను పెద్ద మొత్తంలో సిద్ధం చేసుకున్నారు. అలాగే సైకిల్ గుర్తు, సమాజ్‌వాదీ పార్టీ అన్న పేరు మీద కూడా జెండాలు, పోస్టర్లు తయారైపోయాయి. ఇప్పుడు వీటిలో ఎన్ని పనికొస్తాయో, ఎన్నింటిని పారేయాల్సి వస్తుందోనని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఇద్దరి మధ్య గొడవ ఏదో తొందరగా పరిష్కారం అయ్యి, సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటిగానే ఈసారి పోటీ చేయాలని, అలా అయితేనే తమకు నష్టాలు రాకుండా ఉంటాయని అంటున్నారు. లేనిపక్షంలో ఇప్పటివరకు సిద్ధం చేసుకున్న సామగ్రి మొత్తాన్ని పారేసి, మళ్లీ కొత్తగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని వాపోతున్నారు. -
సొంత రాష్ట్రంలో విడిపోయినా బయట మాత్రం...
కుటుంబంలో చెలరేగిన గొడవల కారణంగా సొంత రాష్ట్రంలో వేరుకుంపట్లు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ.. ఇతర రాష్ట్రాలలో మాత్రం పార్టీ ఐకమత్యంగానే కనిపిస్తోంది. తండ్రి ములాయం సింగ్ యాదవ్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి.. సైకిల్ గుర్తు కోసం పోరాటం చేస్తున్న అఖిలేష్ యాదవ్ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పార్టీని ఇంకా అంతగా పట్టించుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లో మాత్రం పార్టీ ఇంకా ఒక్కటిగానే.. అంటే ములాయం ఆధీనంలోనే ఉంది. ఉత్తరాఖండ్‌లో సమాజ్‌వాదీ పార్టీలో వర్గాలు ఏమీ లేవని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ సచ్చన్ తెలిపారు. అలాగే బిహార్‌లో కూడా తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని, అక్కడ ఒకటే పార్టీ ఉందని ఆ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ యాదవ్ చెప్పారు. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఒడిషా, మధ్యప్రదేశ్.. ఇలా పార్టీ ఉనికిలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ మినహా ఇంకెక్కడా పార్టీలో వర్గాలు లేవు. ఉత్తరాఖండ్‌లో ప్రత్యేకంగా వర్గాలు అంటూ లేకపోయినా.. కార్యకర్తలు మాత్రం తాము ఎటువైపు ఉండాలన్న అయోమయంలో కనిపిస్తున్నారు. యూపీ కంటే ముందే ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరుగుతాయని, ఇప్పటికే ఇక్కడ అభ్యర్థులెవరన్నది నిర్ణయించినా, ఇంకా ప్రకటించలేదని సచ్చన్ తెలిపారు. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను 50 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. -
యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న ఆరెస్సెస్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజీపీ రాజకీయ వేదికపైకి ఆరెస్సెస్ అడుగుపెట్టింది. పాట్నా నుంచి లక్నోకు మకాం మార్చిన ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే కేంద్రంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యూహం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య నాయకత్వంలోని పార్టీ కార్యవర్గ సభ్యులను సైతం పక్కన పెట్టిన దత్తాత్రేయ అన్నీ తానై చక్రం తిప్పుతున్నారని రాష్ట్ర బీజీపీ వర్గాలు చెబుతున్నాయి. దత్తాత్రేయ తన టీమ్‌లోకి ఆరెస్సెస్ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఆరుగురు ప్రాంతీయ కార్యదర్శులతో పాటు కొంతమంది రాష్ట్ర బీజేపీ నాయకులను తీసుకున్నారు. ఆరెస్సెస్ ప్రాంతీయ కార్యదర్శుల్లో ఓం ప్రకాష్ శ్రీవాత్సవ్, చంద్రశేఖర్, భవానీ సింగ్, బ్రజ్ బహద్దూర్ తదితరులు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలో దత్తాత్రేయనే కీలకపాత్ర వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికల వ్యూహాలు, ఓటర్లను ఎలా సమీకరించే వ్యూహాలను ఆయన బృందమే చూసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని సీట్లను వదిలేసి మిగతా అన్నీ అసెంబ్లీ సీట్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దత్తాత్రేయ చూసుకుంటున్నారు. అయితే ఆయన ఎంపిక చేసినా.. తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర పార్టీ ఎన్నికల సంఘం చేస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రధాన మంత్రి కార్యాలయం ఎంపిక చేస్తుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ ఐదు సీట్లలో ప్రస్తుతం మూడు సీట్లకు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రెండు సీట్లకు సమాజ్‌వాదీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు సహకరించే విషయమై దత్తాత్రేయ ఇప్పటీకే బహదూర్ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, సేవా భారతి సంఘాల నాయకులతో చర్చించారు. -
కొత్త పార్టీ ఏర్పాటు.. గుర్తు మోటార్ సైకిల్?
ఉత్తరప్రదేశ్‌లో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. అందులోనూ సాక్షాత్తు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవే ఈ విషయం చెబుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాంగోపాల్ యాదవ్ కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారని, దానికి మోటార్ సైకిల్ గుర్తును ఆయన తీసుకున్నారని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. దానికి 'అఖిల భారతీయ సమాజ్‌వాదీ పార్టీ' అని పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. తాజాగా ములాయం, అఖిలేష్ యాదవ్‌ల మధ్య జరిగిన సమావేశంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి విషయంలో ఇద్దరూ రాజీ పడలేదని తెలుస్తోంది. ఎన్నికల గుర్తు సైకిల్ కోసం ఇరు వర్గాలు దాఖలు చేసుకున్న పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ములాయం చేసిన ప్రతిపాదనను కూడా అఖిలేష్ తోసిపుచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కావాలంటే శివపాల్ యాదవ్, అమర్‌సింగ్‌లను ఈ ఎన్నికల నుంచి పక్కకు పెట్టడానికి సరేనన్న ములాయం.. అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడానికి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా తానే ఉంటానని, ఇన్నాళ్లూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాంగోపాల్ యాదవ్ అనుభవించిన అధికారాలన్నింటినీ అఖిలేష్‌కు ఇస్తానని కూడా ములాయం ప్రతిపాదించారు. అంటే, రాంగోపాల్ యాదవ్‌ను మాత్రం పార్టీ నుంచి బయటకు పంపాలన్నదే ములాయం ప్రతిపాదనగా తెలుస్తోంది. -
ఎన్నికల వేళ.. భారీ ఎదురుదెబ్బ!
త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో బహుజన సమాజ్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనందకుమార్‌కు చెందిన రూ. 1300 కోట్ల ఆస్తులపై ఆదాయపన్ను శాఖ కన్ను పడింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా చెబుతోంది. ఏడేళ్ల కాలంలో ఆనందకుమార్ సంపద రూ. 7.1 కోట్ల నుంచి రూ. 1300 కోట్లకు పెరిగినట్లు చెబుతున్నారు. అంటే ఏకంగా 18000 శాతం పెరుగుదల అన్నమాట. ఆయన 12 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. 2007 నుంచి 2014 సంవత్సరాల మధ్య ఒక్కసారిగా ఆయన సంపద వేల రెట్లు పెరిగిపోయింది. ఫ్యాక్టర్ టెక్నాలజీస్, హోటల్ లైబ్రరీ, సాచి ప్రాపర్టీస్, దియా రియల్టర్స్, ఇషా ప్రాపర్టీస్ అనే ఐదు కంపెనీలను ఐటీ శాఖ ప్రముఖంగా పేర్కొంది. ఈ ఐదు కంపెనీల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. సరిగ్గా 2007 నుంచి 2012 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన సంపద భారీగా పెరిగినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఆనందకుమార్ కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చిన తీరు మీద కూడా ఆదాయపన్ను శాఖ గట్టిగానే నిఘా వేసింది. షెల్ కంపెనీలు, స్వీట్హార్ట్ ఒప్పందాల ద్వారానే ఆయనకు పెట్టుబడులు వెల్లువెత్తాయని అధికారులు అంటున్నారు. బహుశా ఇదంతా కూడా రాజకీయ మనీ లాండరింగ్‌కు సంబంధించిన మొత్తం అయి ఉంటుందన్న కోణంలో ఆదాయపన్ను శాఖ దర్యాప్తు కొనసాగుతోంది. కంపెనీ 2007 2014 ఫ్యాక్టర్ టెక్నాలజీస్ 0.56 కోట్లు 55.8 కోట్లు హోటల్ లైబ్రరీ 0.93 కోట్లు 214.4 కోట్లు సాచి ప్రాపర్టీస్ 2.92 కోట్లు 104.34 కోట్లు దియా రియల్టర్స్ 0.21 కోట్లు 95.25 కోట్లు ఇషా ప్రాపర్టీస్ 2.75 కోట్లు 66.68 కోట్లు -
బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్
-
మీ నాన్న చాలా మొండోడు!
సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరపడుతుందో లేదో తెలియదు గానీ.. తమ తాత వద్దకు వెళ్లడానికి ఆయన మనవరాళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముద్దుల కూతుళ్లు అదితి (15), టీనా (10) ఇద్దరూ చకచకా గెంతుకుంటూ పక్కపక్కనే ఉన్న ములాయం, అఖిలేష్ ఇళ్ల మధ్య తిరుగుతున్నారు. కనీసం వీళ్ల పుణ్యమాని తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు ఏమైనా తగ్గుతాయేమోనని కుటుంబసభ్యులు ఆశిస్తున్నారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఇలాగే టీనా తన వద్దకు వచ్చినప్పుడు.. 'మీ నాన్న చాలా మొండోడు' అని అఖిలేష్ గురించి టీనాతో ములాయం అన్నారట. ఆమె వెంటనే అదే విషయాన్ని తన తండ్రి వద్దకు వచ్చి చెప్పగా.. 'అవును.. మొండోడినే' అని అఖిలేష్ అన్నారట. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలోనే జరగనుండగా.. యాదవ్ కుటుంబంలో నెలకొన్న సంక్షోభం మాత్రం ఇంకా సమసిపోలేదు. ములాయం తన సొంత సోదరుడైన శివపాల్ యాదవ్‌ను వెనకేసుకు వస్తుంటే, అఖిలేష్‌కు మాత్రం మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్ అండగా ఉన్నారు. ఇప్పుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ సైకిల్ గుర్తు తమకే కావాలని పట్టుబడుతున్నారు. -
బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్
సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభం నిమిషానికో మలుపు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ సరికొత్త బాంబు పేల్చారు. అఖిలేష్ వర్గం తమకు మోటార్ సైకిల్ గుర్తు కావాలని ఎన్నికల సంఘాన్ని కోరిందని, ఇందుకోసం నెల రోజుల క్రితమే ఎన్నికల కమిషన్‌ను కలిసిందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవానికి సోమవారం లోగా పార్టీలో ఎవరికి ఎంత బలం ఉందో తెలియజేయాలంటూ ఎన్నికల కమిషన్ రెండు వర్గాలకు గడువు విధించిన విషయం తెలిసిందే. దాంతో అఖిలేష్ వర్గానికి చెందిన బహిష్కృత సమాజ్‌వాదీ నేత రాంగోపాల్ యాదవ్ భారీ మొత్తంలో అఫిడవిట్లను తీసుకెళ్లి కమిషన్‌కు ఇచ్చారు. కానీ వాటి మీద సంతకాలు ఫోర్జరీవని ములాయం, అమర్‌సింగ్ ఇద్దరూ అన్నారు. మరోవైపు రాంగోపాల్ యాదవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేత పదవి నుంచి తొలగించాలని కూడా ములాయం కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శివపాల్ యాదవ్ విడుదల చేసిన వీడియో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. -
సైకిల్.. ఎవరికీ దక్కకుండా పోతుందా?
సమాజ్‌వాదీ పార్టీ స్థాపించిన పాతికేళ్ల తర్వాత.. ఆ పార్టీ గుర్తు సైకిల్ ఇప్పుడు ముక్కలు చెక్కలైపోయేలా ఉంది. నాదంటే నాదని తండ్రీకొడుకుల వర్గాలు కొట్టుకుంటుండటంతో ఎవరికీ దక్కకుండా అసలు పూర్తిగా ఆ గుర్తునే ఎన్నికల కమిషన్ రద్దుచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకసారి విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావించినపుడు అది ఊహాత్మకమైన ప్రశ్న అని సీఈసీ జైదీ కొట్టి పారేశారు గానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దానికి కూడా అవకాశం ఉంటుందనే అనిపిస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అటు అఖిలేష్ వర్గానికి గానీ, ఇటు ములాయం వర్గానికిగానీ సైకిల్ గుర్తు ఇవ్వకుండా ఆపేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం ఎన్నికల కమిషన్‌కు ఉందని అంటున్నారు. గత వారం పార్టీలో చీలిక వచ్చిన తర్వాత.. పార్టీ గుర్తు అయిన సైకిల్‌ను తనకే కేటాయించాలని ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎవరికి వారు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. (ములాయం 'సైకిల్' అఖిలేశ్‌కేనా?) ఇప్పటికే యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ప్రచారపర్వం ఊపందుకుంటోంది. కానీ అసలు ఏ గుర్తుతో ప్రచారం చేసుకోవాలోనన్న విషయం తేలకపోవడంతో అభ్యర్థులు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవైపు అఖిలేష్ వర్గంలోని కీలకనేత అయిన రాంగోపాల్ యాదవ్ కట్టలకొద్దీ అఫిడవిట్లు తీసుకుని ఎన్నికల కమిషన్‌కు సమర్పించగా, అందులో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీవేనని ములాయం, అమర్‌సింగ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి పంపడం కూడా సాధ్యం కాని పని. దాంతో ఎందుకొచ్చిన గొడవ అని పూర్తిగా ఆ గుర్తునే రద్దు చేసి, కొత్త గుర్తులను రెండు వర్గాలకు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎన్నికల కమిషన్ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా అయితే మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో సగానికి పైగా మెజారిటీ.. అంటే సాధారణ మెజారిటీ ఎవరికుంటే వాళ్లకు గుర్తు లభిస్తుంది. ఈనెల 17వ తేదీన తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆలోగానే తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ ఏం చేస్తుందన్న విషయం ఉత్కంఠభరితంగా మారింది. (సీఎం జోరు.. బాబాయ్ బేజారు!) గతంలోనూ ఇలాగే... గతంలో ఒకసారి ఇలాగే ఒక పార్టీ విడిపోయినప్పుడు గుర్తును రద్దుచేసిన చరిత్ర ఎన్నికల కమిషన్‌లో ఉంది. ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ అనే పార్టీ 2011లో విడిపోయింది. రెండు వర్గాలూ కుర్చీ గుర్తు తమకే కావాలని పట్టుబట్టాయి. దాంతో త్రివేందర్ సింగ్ పవార్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (పి) వర్గానికి కప్పు-సాసర్, దివాకర్ భట్ నేతృత్వంలోని జనతాంత్రిక్ ఉత్తరాఖండ్ క్రాంతిదళ్‌కు గాలిపటం ఇచ్చింది. -
దింపుడు కల్లం ఆశలో ములాయం
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ (?) ములాయం సింగ్ యాదవ్, ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ తమకు కావాలంటే తమకు కావాలని తండ్రీకొడుకులు ఫైట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు చివరిసారిగా తన వాదనను వినిపించేందుకు పెద్దాయన సిద్ధమయ్యారు. రెండు రోజుల పాటు ముమ్మర ప్రయత్నాలు చేసినా రెండు వర్గాలు కలవడం మాత్రం అసాధ్యం అని తేలిపోవడంతో.. ఇక తన వెంట ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్‌ను తీసుకుని హస్తినకు చేరారు. ఎన్నికల కమిషన్ ముందు సోమవారం తమ బలాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే, ఈసారి వాళ్లిద్దరితో పాటు అమర్‌సింగ్ కూడా ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు పార్టీలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెబుతూనే మరోవైపు ఇలా ఎన్నికల గుర్తు కోసం ములాయం పోరాడాల్సి రావడం ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే చాలా క్లిష్ట సమయం అని పరిశీలకులు అంటున్నారు. ఇక పార్టీపై తిరుగులేని పట్టు తనకే ఉందని చెబుతున్న అఖిలేష్ వర్గం.. దాదాపు ఆరు పెట్టెల నిండా భారీ మొత్తంలో అఫిడవిట్లను తీసుకెళ్లి ఎన్నికల సంఘానికి సమర్పించింది. శనివారం నాడు ఎన్నికల కమిషనర్ సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీని అఖిలేష్ వర్గం కలిసింది. రాంగోపాల్ యాదవ్, సురేంద్ర నాగర్, సునీల్ సాజన్.. ఈ ముగ్గురూ కలిసి అఫిడవిట్లు సమర్పించారు. సోమవారంతో గడువు ముగుస్తుండటంతో.. ఇక ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే నిర్ణయం వినడానికి రెండు వర్గాలు ఉత్కంఠగా ఉన్నాయి. దాదాపుగా తమకు పార్టీ గుర్తు రావడం ఖాయమైపోయిందని, అధికారికంగా ఎన్నికల కమిషన్ చెప్పడం ఒక్కటే మిగిలిందని అఖిలేష్ వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ చెబుతున్నారు. ఇదే నిజమైతే పాతికేళ్లుగా ములాయం పడిన కష్టం మొత్తం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. -
యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీ తనయుల మధ్య ఏర్పడిన తగువు త్వరగా తీరకపోతే పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందా? చీలిపోతే నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా ఏ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఎలా ఉంటాయి? ములాయం వర్గంతో అఖిలేష్ వర్గం విడిపోతే పార్టీలో మెజారిటీ వర్గం ఆయనవైపే ఉన్నా ఆయన పొత్తు కుదుర్చుకునే కూటమి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందా? 2012లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న ముందస్తు అంచనాలు దాదాపు అన్నీ నిజమయ్యాయి. అప్పుడు మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీచిన గాలులతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరు అంచనా వేయగలిగారు. అయితే అఖండ విజయం సాధిస్తుందని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఈసారి కూడా ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ అవి తన మీద పడకుండా అఖిలేష్ తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నారు. తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్ లాంటి పెద్దల జోక్యం వల్ల తనకు స్వేచ్ఛ లేకపోయిందని అఖిలేష్ ప్రజలను నమ్మించగలిగారు. రాజకీయ సమీకరణలు ఏమిటి? ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కూడా తనకే పూర్తి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో సొంత జాబితాను విడుదల చేసి తండ్రితో అఖిలేష్ తగువుకు దిగారు. ఇరువురి మధ్య సమీప భవిష్యత్తులో రాజీ కుదురుతుందా.. అన్న అంశంపై భవిష్యత్ రాజకీయ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి. పార్టీ నుంచి అఖిలేష్ చీలిపోతే ఆయన పార్టీతో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పొత్తు కడతాయి. అప్పుడు విజయావకాశాలు కొద్దిగా మెరుగుపడతాయి. పార్టీ విడిపోకపోతే కాంగ్రెస్‌తో పొత్తుకు ములాయం సింగ్ అంగీకరించరు. ఒకవేళ అంగీకరిస్తే సమాజ్‌వాదీ పార్టీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అది ఎంత ఎక్కువన్నది ఇప్పుడే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారన్న విషయం ఇప్పటికైతే అంతు చిక్కడం లేదు. సర్వేలు ఏం చెబుతున్నాయి? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 33 శాతం ఓట్లు వస్తాయని, సమాజ్‌వాదీ పార్టీకి 26 శాతం, బీఎస్పీకి 26 శాతం, కాంగ్రెస్‌కు ఆరుశాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే–ఆక్సిస్ ఇటీవల నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకుంటే సమాజ్‌వాదీ పార్టీ కొచ్చే ఓట్ల శాతం 32. అంటే, బీజేపీ కన్నా ఒక్క శాతం తక్కువ. లోక్‌నీతి–ఏబీపీ–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీకి 27 శాతం, ఎస్పీకి 30 శాతం, బీఎస్పీకి 22 శాతం, కాంగ్రెస్‌కు 8 శాతం ఓట్లు వస్తాయి. అంటే కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీకి 38 శాతం ఓట్లు వస్తాయి. ఇది బీజేపీ కన్నా 11 శాతం ఎక్కువ కనుక సమాజ్‌వాదీ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోకి రావాలంటే... ఎన్నికల తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకునే అవకాశం బీజేపీకి లేదు గానీ, అదే జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. నాటి ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 42.63 శాతం ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి 22.30 శాతం ఓట్లు వచ్చాయి. నాడు కాంగ్రెస్‌కు, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీ కూటమికి 30.74 శాతం ఓట్లు అవుతాయి. అంటే, అప్పటికీ బీజేపీ కన్నా 12 శాతం ఓట్లు తక్కువ. అప్పుడు మోదీకున్న ప్రతిష్ట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని చెప్పలేం. ఎంతో కొంత తక్కువే ఉంటుంది. అది ఎంత తక్కువన్నదే ప్రస్తుతం రాజకీయ పరిశీలకులకు కూడా అంతుచిక్కడం లేదు. బీజేపీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మోదీ ప్రతిష్టను నమ్ముకునే ఎన్నికల్లోకి దిగుతోంది. బీఎస్పీతో పొత్తు కుదిరితే.... బిహార్ తరహా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీని యూపీలో సులువుగా ఓడించవచ్చు. ఆ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ పొత్తు కుదుర్చుకున్నట్లు యూపీలో ఎస్పీ, బీఎస్పీలు సంకీర్ణ ప్రభుత్వానికి సంసిద్ధం కావాలి. ముఖ్యమంత్రి పదవి వదులుకోడానికి అఖిలేష్ యాదవ్, మాయావతిలో ఎవరూ సిద్ధంగా ఉండరు. ఏదిఏమైనా సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయన్న అంశంపైనే రాజకీయ సమీకరణలు, విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
పాపం... ములాయం!
ఒక పార్టీని స్థాపించడం, పాతికేళ్ల పాటు దాన్ని విజయవంతంగా నడిపించడం.. చివరకు దాన్ని వదులుకోవాల్సి రావడం ఎంత బాధాకరమో ములాయం సింగ్ యాదవ్‌కు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. కన్న కొడుకే తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని స్వాధీనం చేసుకోవడం, గుర్తును కూడా సొంతం చేసుకోవడం దాదాపు ఖాయమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఏం చేయాలో కూడా పెద్దాయనకు పాలుపోవడం లేదు. శుక్రవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహిస్తారని మీడియా సంస్థలన్నింటికీ సందేశాలు పంపి.. సరిగ్గా ఐదు నిమిషాల్లోనే మళ్లీ ఆ ప్రెస్‌మీట్ రద్దయిందని చెప్పారు. దీన్ని బట్టే ములాయం పరిస్థితి ఎంత సందిగ్ధంలో ఉందో అర్థమవుతుంది. ఎవరి వల్ల అయితే తాను పార్టీనుంచి బహిష్కరణకు గురి కావాల్సి వచ్చిందో.. ఎవరి కారణంగా తాను తండ్రితో తిట్లు తినాల్సి వచ్చిందో ఆ బాబాయ్ శివపాల్ యాదవ్ ఇంటికి సీఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఉదయం వెళ్లారు. ఆయన్ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వెంటనే శివపాల్ తన అన్న ములాయం ఇంటికి వెళ్లారు. ఇవన్నీ చూస్తే సమాజ్‌వాదీ పార్టీలో గొడవలు సర్దుమణిగిపోయాయేమో అని అంతా అనుకున్నారు. సంధి కుదిరిందనే భావించారు. కానీ అలా ఏమీ జరగలేదు. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే హక్కును వదులుకుని తనకు ఇవ్వాలని అఖిలేష్ షరతు పెట్టగా.. దానికి శివపాల్ ససేమిరా అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలలో అత్యధికుల మద్దతు తమకే ఉందని అఖిలేష్‌కు మద్దతుగా నిలిచిన మరో బాబాయ్.. ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్ చెబుతున్నారు. మొత్తం 229 మంది ఎమ్మెల్యేలలో 212 మంది, 68 మంది ఎమ్మెల్సీలలో 56 మంది, 24 మంది ఎంపీలలో 15 మంది తమకు మద్దతుగా అఫిడవిట్లపై సంతకాలు చేశారని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రమే తాము తమ వద్ద ఉన్న అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తామని, అందువల్ల కచ్చితంగా సైకిల్ గుర్తు తమకే వస్తుందని ఆయన అన్నారు. ములాయం పార్టీ పెట్టినప్పటి నుంచి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసుకోవడం, ఎన్నికల కమిషన్ వద్దకు కావల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చూడటంలో రాంగోపాల్ యాదవ్‌కు మంచి అనుభవం ఉంది. అలాంటి 'ప్రొఫెసర్ సాబ్' ఇప్పుడు అఖిలేష్‌కు అండగా ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చింది. మరోవైపు శివపాల్ యాదవ్, అమర్‌సింగ్ తదితర సీనియర్ల మద్దతున్న ములాయం సింగ్ యాదవ్ కూడా సైకిల్ గుర్తు తనకే చెందాలని ఈసీ వద్ద ఒక అఫిడవిట్ సమర్పించారు గానీ, అందులో ఎంతమంది సంతకాలు పెట్టారన్న విషయం మాత్రం బయటకు రావడంలేదు. ఇద్దరి వాదనలను వింటున్న ఎన్నికల కమిషన్.. తన తుది నిర్ణయం వెల్లడించేవరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. -
సీఎం జాతకం ఏం చెబుతోంది?
కన్నతండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఇప్పటివరకు తన ఎత్తులన్నింటినీ విజయవంతంగానే అమలుచేస్తున్నారు. అయితే, ఇకమీదట మాత్రం ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుందట. ఈ విషయాన్ని చెబుతున్నది ఆయన జాతకమే. ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలేష్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప రాజకీయాల్లో నెగ్గుకురాలేరని జోతిష్య పండితులు అంటున్నారు. మరి అఖిలేష్ జాతకం ఏంటో.. ఎలా ఉందో ఓసారి చూద్దాం. అఖిలేష్ యాదవ్ 1973 జూలై 1వ తేదీన జన్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లా సైఫై గ్రామంలో ఆయన పుట్టారు. ఆయన అదృష్టసంఖ్య 1. దాన్ని సూర్యుడి సంఖ్య అంటారు. 2017 సంవత్సరంలో ఉన్న అంకెలన్నింటినీ కలిపినా ఒకటే వస్తుంది. ఒకటి అదృష్టసంఖ్యగా ఉన్నవారికి 2017 బాగా కలిసొచ్చే సంవత్సరం అంటారు. అంటే, అఖిలేష్ యాదవ్‌కు కూడా ఇది మంచిదే. కానీ ఆయన సరైన సమయంలో సరైన అడుగులు వేయాలి. ఈ సంవత్సరంలో ఆయనకు కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అఖిలేష్ కన్యా లగ్నం మిథున రాశిలో పుట్టారు. ప్రస్తుతం ఆయనకు బుధ మహర్దశలో శని అంతర్దశ నడుస్తోంది. ఇది మార్చి 22తో ముగుస్తుంది. ప్రస్తుతం బుధుడు 11వ ఇంట ఉండటం అఖిలేష్‌కు కలిసొచ్చే అంశం. గురుడు బుధుడిని చూస్తుండటంతో సరైన నిర్ణయాలు తీసుకోడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. అయితే సరైన అడుగులు వేయకపోతే మాత్రం సులువైన విషయాలు కూడా ఆయనకు కష్టంగా మారుతాయి. రాజకీయాల్లో నిలబడాలంటే ప్రస్తుత తరుణంలో ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండాలని పండితులు అంటున్నారు. -
ఢిల్లీ వెళ్లిన పెద్దాయన!
తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. దాదాపు పాతికేళ్ల క్రితం పెట్టిన పార్టీని, అప్పుడు తీసుకున్న గుర్తును కాపాడుకోడానికి ములాయం సింగ్ యాదవ్ నానా పాట్లు పడుతున్నారు. తమ్ముడు శివపాల్ యాదవ్‌ను తీసుకుని ఆయన ఢిల్లీకి బయల్దేరారు. తమకు మద్దతిచ్చేవాళ్లు అందరి దగ్గర నుంచి అఫిడవిట్లు తీసుకుని.. వాటిని ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తానని చెబుతున్నారు. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు మాత్రం ప్రస్తుతానికి అఖిలేష్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. ములాయం మాత్రం తనకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే.. ఎంతమంది ఆయనకు మద్దతు చెబుతున్నారో మాత్రం ఇంతవరకు బయటపడలేదు. పార్టీ గుర్తు తమదేనని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలని అటు ములాయం, ఇటు అఖిలేష్ ఇద్దరికీ ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందుకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించింది. అయితే అంవతరకు ఆగడం ఎందుకని, ఇప్పటికే ములాయం ఢిల్లీ బయల్దేరగా.. అఖిలేష్ కూడా అఫిడవిట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం నాడు హస్తిన టూర్ పెట్టుకున్నారు. నోటి మాటగా కాకుండా.. అఫిడవిట్ల రూపంలోనే ఎవరెవరికి ఎంతెంత మద్దతు ఉందో చూపించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన అనూహ్య పరిణామంలో.. ములాయం సింగ్ స్థానంలో జాతీయాధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఆయన వర్గం ఎన్నుకుంది. దాంతోపాటు శివపాల్ యాదవ్‌ను యూపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.