సీఎం జాతకం ఏం చెబుతోంది?
కన్నతండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఇప్పటివరకు తన ఎత్తులన్నింటినీ విజయవంతంగానే అమలుచేస్తున్నారు. అయితే, ఇకమీదట మాత్రం ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుందట. ఈ విషయాన్ని చెబుతున్నది ఆయన జాతకమే. ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలేష్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప రాజకీయాల్లో నెగ్గుకురాలేరని జోతిష్య పండితులు అంటున్నారు. మరి అఖిలేష్ జాతకం ఏంటో.. ఎలా ఉందో ఓసారి చూద్దాం.
అఖిలేష్ యాదవ్ 1973 జూలై 1వ తేదీన జన్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లా సైఫై గ్రామంలో ఆయన పుట్టారు. ఆయన అదృష్టసంఖ్య 1. దాన్ని సూర్యుడి సంఖ్య అంటారు. 2017 సంవత్సరంలో ఉన్న అంకెలన్నింటినీ కలిపినా ఒకటే వస్తుంది. ఒకటి అదృష్టసంఖ్యగా ఉన్నవారికి 2017 బాగా కలిసొచ్చే సంవత్సరం అంటారు. అంటే, అఖిలేష్ యాదవ్‌కు కూడా ఇది మంచిదే. కానీ ఆయన సరైన సమయంలో సరైన అడుగులు వేయాలి. ఈ సంవత్సరంలో ఆయనకు కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.

అఖిలేష్ కన్యా లగ్నం మిథున రాశిలో పుట్టారు. ప్రస్తుతం ఆయనకు బుధ మహర్దశలో శని అంతర్దశ నడుస్తోంది. ఇది మార్చి 22తో ముగుస్తుంది. ప్రస్తుతం బుధుడు 11వ ఇంట ఉండటం అఖిలేష్‌కు కలిసొచ్చే అంశం. గురుడు బుధుడిని చూస్తుండటంతో సరైన నిర్ణయాలు తీసుకోడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. అయితే సరైన అడుగులు వేయకపోతే మాత్రం సులువైన విషయాలు కూడా ఆయనకు కష్టంగా మారుతాయి. రాజకీయాల్లో నిలబడాలంటే ప్రస్తుత తరుణంలో ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండాలని పండితులు అంటున్నారు.