సొంత రాష్ట్రంలో విడిపోయినా బయట మాత్రం...
Published Sat, Jan 14 2017 2:49 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
కుటుంబంలో చెలరేగిన గొడవల కారణంగా సొంత రాష్ట్రంలో వేరుకుంపట్లు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ.. ఇతర రాష్ట్రాలలో మాత్రం పార్టీ ఐకమత్యంగానే కనిపిస్తోంది. తండ్రి ములాయం సింగ్ యాదవ్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి.. సైకిల్ గుర్తు కోసం పోరాటం చేస్తున్న అఖిలేష్ యాదవ్ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పార్టీని ఇంకా అంతగా పట్టించుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లో మాత్రం పార్టీ ఇంకా ఒక్కటిగానే.. అంటే ములాయం ఆధీనంలోనే ఉంది. ఉత్తరాఖండ్‌లో సమాజ్‌వాదీ పార్టీలో వర్గాలు ఏమీ లేవని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ సచ్చన్ తెలిపారు. అలాగే బిహార్‌లో కూడా తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని, అక్కడ ఒకటే పార్టీ ఉందని ఆ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ యాదవ్ చెప్పారు.
ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఒడిషా, మధ్యప్రదేశ్.. ఇలా పార్టీ ఉనికిలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ మినహా ఇంకెక్కడా పార్టీలో వర్గాలు లేవు. ఉత్తరాఖండ్‌లో ప్రత్యేకంగా వర్గాలు అంటూ లేకపోయినా.. కార్యకర్తలు మాత్రం తాము ఎటువైపు ఉండాలన్న అయోమయంలో కనిపిస్తున్నారు. యూపీ కంటే ముందే ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరుగుతాయని, ఇప్పటికే ఇక్కడ అభ్యర్థులెవరన్నది నిర్ణయించినా, ఇంకా ప్రకటించలేదని సచ్చన్ తెలిపారు. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను 50 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement