యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
Published Sat, Jan 7 2017 4:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీ తనయుల మధ్య ఏర్పడిన తగువు త్వరగా తీరకపోతే పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందా? చీలిపోతే నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా ఏ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఎలా ఉంటాయి? ములాయం వర్గంతో అఖిలేష్ వర్గం విడిపోతే పార్టీలో మెజారిటీ వర్గం ఆయనవైపే ఉన్నా ఆయన పొత్తు కుదుర్చుకునే కూటమి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందా?
2012లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న ముందస్తు అంచనాలు దాదాపు అన్నీ నిజమయ్యాయి. అప్పుడు మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీచిన గాలులతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరు అంచనా వేయగలిగారు. అయితే అఖండ విజయం సాధిస్తుందని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఈసారి కూడా ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ అవి తన మీద పడకుండా అఖిలేష్ తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నారు. తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్ లాంటి పెద్దల జోక్యం వల్ల తనకు స్వేచ్ఛ లేకపోయిందని అఖిలేష్ ప్రజలను నమ్మించగలిగారు.
రాజకీయ సమీకరణలు ఏమిటి?
ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కూడా తనకే పూర్తి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో సొంత జాబితాను విడుదల చేసి తండ్రితో అఖిలేష్ తగువుకు దిగారు. ఇరువురి మధ్య సమీప భవిష్యత్తులో రాజీ కుదురుతుందా.. అన్న అంశంపై భవిష్యత్ రాజకీయ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి. పార్టీ నుంచి అఖిలేష్ చీలిపోతే ఆయన పార్టీతో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పొత్తు కడతాయి. అప్పుడు విజయావకాశాలు కొద్దిగా మెరుగుపడతాయి. పార్టీ విడిపోకపోతే కాంగ్రెస్‌తో పొత్తుకు ములాయం సింగ్ అంగీకరించరు. ఒకవేళ అంగీకరిస్తే సమాజ్‌వాదీ పార్టీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అది ఎంత ఎక్కువన్నది ఇప్పుడే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారన్న విషయం ఇప్పటికైతే అంతు చిక్కడం లేదు.
సర్వేలు ఏం చెబుతున్నాయి?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 33 శాతం ఓట్లు వస్తాయని, సమాజ్‌వాదీ పార్టీకి 26 శాతం, బీఎస్పీకి 26 శాతం, కాంగ్రెస్‌కు ఆరుశాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే–ఆక్సిస్ ఇటీవల నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకుంటే సమాజ్‌వాదీ పార్టీ కొచ్చే ఓట్ల శాతం 32. అంటే, బీజేపీ కన్నా ఒక్క శాతం తక్కువ. లోక్‌నీతి–ఏబీపీ–సీఎస్‌డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీకి 27 శాతం, ఎస్పీకి 30 శాతం, బీఎస్పీకి 22 శాతం, కాంగ్రెస్‌కు 8 శాతం ఓట్లు వస్తాయి. అంటే కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీకి 38 శాతం ఓట్లు వస్తాయి. ఇది బీజేపీ కన్నా 11 శాతం ఎక్కువ కనుక సమాజ్‌వాదీ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ అధికారంలోకి రావాలంటే...
ఎన్నికల తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకునే అవకాశం బీజేపీకి లేదు గానీ, అదే జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. నాటి ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 42.63 శాతం ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి 22.30 శాతం ఓట్లు వచ్చాయి. నాడు కాంగ్రెస్‌కు, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీ కూటమికి 30.74 శాతం ఓట్లు అవుతాయి. అంటే, అప్పటికీ బీజేపీ కన్నా 12 శాతం ఓట్లు తక్కువ. అప్పుడు మోదీకున్న ప్రతిష్ట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని చెప్పలేం. ఎంతో కొంత తక్కువే ఉంటుంది. అది ఎంత తక్కువన్నదే ప్రస్తుతం రాజకీయ పరిశీలకులకు కూడా అంతుచిక్కడం లేదు. బీజేపీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మోదీ ప్రతిష్టను నమ్ముకునే ఎన్నికల్లోకి దిగుతోంది.
బీఎస్పీతో పొత్తు కుదిరితే....
బిహార్ తరహా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీని యూపీలో సులువుగా ఓడించవచ్చు. ఆ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ పొత్తు కుదుర్చుకున్నట్లు యూపీలో ఎస్పీ, బీఎస్పీలు సంకీర్ణ ప్రభుత్వానికి సంసిద్ధం కావాలి. ముఖ్యమంత్రి పదవి వదులుకోడానికి అఖిలేష్ యాదవ్, మాయావతిలో ఎవరూ సిద్ధంగా ఉండరు. ఏదిఏమైనా సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయన్న అంశంపైనే రాజకీయ సమీకరణలు, విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Advertisement
Advertisement