ఎస్పీ పట్టు నిలిచేనా? | The second phase of assembly polls | Sakshi
Sakshi News home page

ఎస్పీ పట్టు నిలిచేనా?

Published Wed, Feb 15 2017 1:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఎస్పీ పట్టు నిలిచేనా? - Sakshi

ఎస్పీ పట్టు నిలిచేనా?

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ముస్లింలు, ఓబీసీలు అధికంగా ఉన్న తెరాయ్, రహేల్‌ఖండ్‌ ప్రాంతాల్లోని 11 జిల్లాల్లో 67 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ముస్లింల అండతో 2012లో ఇక్కడ దాదాపు సగం(34) సీట్లు గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఈసారి కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. బలమైన మైనారిటీ నేత, రాష్ట్ర మంత్రి ఆజం ఖాన్ ఈ ప్రాంతంలో ఎస్పీకి పెద్ద దిక్కు. ఎస్పీలో అంతర్గత చిచ్చు, గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ హవా నేపథ్యంలో ప్రస్తుతం ఎస్పీ ఊపు అంతగా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

ముస్లింల ఆధిక్యం..
ఉత్తరాఖండ్, నేపాల్‌ సరిహద్దు జిల్లాల ప్రాంతం తెరాయ్‌. మొఘలుల హయాంలో ఆఖరిదశలో అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన రుహెల్లా పఠాన్లు పాలించిన ప్రాంతం రహేల్‌ఖండ్‌. ఈ రెండు ప్రాంతాల్లో ముస్లింల జనాభా దాదాపు 36 శాతం. రాంపూర్‌ జిల్లాలో ఏకంగా 50 శాతం ముస్లింలే. టర్కులు, పఠాన్లు, సైఫీలు, అన్సారీలు.. ముస్లింలలో బలమైన వర్గాలు. ఓబీసీల్లో కుర్మీలు బలీయంగా ఉన్న ప్రాంతమిది. తర్వాతి స్థానం మౌర్య కులస్తులది. షహరన్ పూర్‌ జిల్లాలో రాజకీయంగా, సంఖ్యాపరంగా గుజ్జర్ల ఆధిక్యంలో ఉంది.

ఎస్పీకి దన్ను గా నిలిచే యాదవ సామాజికవర్గం బదౌన్, సంబల్‌లు మినహా మిగతా 9 జిల్లాల్లో పెద్దగా లేదు. దీంతో ఆ పార్టీ ప్రధానంగా ముస్లిం ఓట్లపైనే ఆధారపడుతోంది. వీరిలో ఓట్లలో చీలిక వస్తే నష్టపోతామని భయపడుతోంది. బరిలో నిలిచిన ఎంఐఎం, ఇతర చిన్నాచితక ముస్లిం పార్టీల ప్రభావం అంతగా ఉండకపోవచ్చుగాని, వీరివల్ల జరిగే ఎంతోకొంత నష్టం మాత్రం ఎస్పీకే.  తాజా ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 18 సీట్లు ఇచ్చిన ఎస్పీ... హస్తంతో తమ పొత్తుపై, అభివృద్ధికి పెద్దపీట వేసే యువ సీఎంగా అఖిలేశ్‌కు ఉన్న ఇమేజ్‌పై ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం ఎస్పీకి సవాల్‌గా మారింది.

దళిత, మైనారిటీ వాదాన్ని వినిపించే బీఎస్పీకి ఈ ప్రాంతంలో ఏనాడూ 20 శాతానికి మించి ముస్లిం ఓట్లు పడలేదు. అయితే పలు జనరల్‌ స్థానాల్లో బీఎస్పీ తరఫున మాత్రమే ముస్లిం అభ్యర్థి ఉండటం, నియోజకవర్గాల వారీగా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని ముస్లింలు ఓటేస్తే ఆ పార్టీ లాభపడుతుంది. బీఎస్పీకి సహజంగా ఉండే దళిత ఓటు బ్యాంకూ ఉంటుంది.

చిక్కుల్లో బీజేపీ..
బదౌన్, ఖేరి జిల్లాలో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను వీడి వచ్చిన వారికి టిక్కెట్లిచ్చిన బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతోంది. యాదవేతర ఓబీసీల్లో బలం కూడగట్టుకుంటున్న బీజేపీకి అగ్రవర్ణాల మద్దతు ఉంది. మతపరమైన ఓట్ల విభజనకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. హిందువుల, ఓబీసీల్లోని యాదవేతరుల ఓట్లను ఏకం చేయడం ద్వారా ఇక్కడ సీట్లను పెంచుకోవాలని (2012లో బీజేపీ పదిచోట్లే గెలిచింది) చూస్తోంది. ఎస్పీలో అంతర్గత కలహాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలు తమకు కలసి వస్తాయని భావిస్తోంది. ఇక్కడి రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే చెరుకు రైతుల బకాయిలను ఇప్పిస్తామని హామీ ఇస్తోంది.

పోటీలో ఉన్న ప్రముఖులు
ఆజంఖాన్  (మంత్రి– ఎస్పీ)– రాంపూర్, అబ్దుల్‌ అజం (ఆజంఖాన్  కుమారుడు, ఎస్పీ)– సువార్, జితిన్  ప్రసాద్‌ (మాజీ కేంద్రమంత్రి– కాంగ్రెస్‌)– తిల్హర్, మెహబూబ్‌ అలీ (మంత్రి– ఎస్పీ)– అమ్రోహా, సురేష్‌ కుమార్‌ ఖన్నా (బీజేఎల్పీ నాయకుడు)– షాహజాన్ పూర్‌.

రెండో దశ పోలింగ్‌
అసెంబ్లీ నియోజకవర్గాలు             67
బరిలో ఉన్న అభ్యర్థులు             720
ఇందులో మహిళలు                    39
మొత్తం ఓటర్లు                         2.28 కోట్లు
ఇందులో మహిళలు                1.04 కోట్లు
పోలింగ్‌ కేంద్రాలు                  14,771
పోలింగ్‌ బూత్‌లు                  23,693


2012 ఎన్నికల్లో 67 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
ఎస్పీ         34
బీఎస్పీ      18
బీజేపీ        10
కాంగ్రెస్‌        3
ఇతరులు     2

జిల్లాలు– అసెంబ్లీ స్థానాలు: షహరన్ పూర్‌–7, బిజ్నోర్‌–8, మొరాదాబాద్‌–6, సంబల్‌–4, రాంపూర్‌–5, బరేలీ–9, అమ్రోహా–4, ఫిలిబిత్‌–4, ఖేరి–8, షాహజాన్ పూర్‌–6, బదౌన్ –6.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement