అపర్ణ బరిలోకి దిగితే.. ఇక అంతే!
అపర్ణ బరిలోకి దిగితే.. ఇక అంతే!
Published Mon, Jan 23 2017 3:08 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వాతావరణం ఇప్పుడు పూర్తిస్థాయిలో వేడెక్కింది. లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న విషయం అక్కడ ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరఫున ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషి పేరును ఇప్పటికే ప్రకటించారు. ఆమె గత ఎన్నికల్లో అక్కడినుంచి పోటీ చేసి గెలిచారు. సమాజ్‌వాదీ మాత్రం ఇంకా అక్కడ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. తన రెండో కోడలు అపర్ణా యాదవ్ అయితే బాగుంటుందన్నది ములాయం భావన. అయితే.. అసలు తన మరదలు అపర్ణను బరిలోకి అఖిలేష్ దిగనిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ములాయం మాత్రం ఈ స్థానంలో అపర్ణా యాదవ్ దిగుతారని దాదాపు ఏడాది క్రితమే చెప్పారు. అప్పటినుంచి ఆమె నియోజకవర్గంలో కూడా బాగా తిరుగుతున్నారు. ఇప్పటివరకు అక్కడ సమాజ్‌వాదీ ఒక్కసారి కూడా నెగ్గలేదు.
అయితే.. ఇప్పుడు సమాజ్‌వాదీలో రెండు వర్గాల మధ్య పోరు గట్టిగా ఉండటంతో అఖిలేష్ పూర్తిగా అభ్యర్థుల ఎంపికను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చాలామంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు. కానీ లక్నో కంటోన్మెంటుకు మాత్రం ఎవరినీ ఇంకా చెప్పలేదు. వాస్తవానికి అపర్ణాయాదవ్ ముందునుంచి తన పిన మామగారు శివపాల్ యాదవ్ శిబిరంలోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్క శివపాల్ తప్ప ఆయన వర్గానికి ఎన్నికల్లో ప్రాతినిధ్యం కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో రీటా బహుగుణపై పోటీకి అపర్ణ దిగుతారా, ఆమెకు అఖిలేష్ అవకాశం ఇస్తారా అనేది అనుమానంగా మారింది.
ఒకవేళ అపర్ణ బరిలోకి దిగితే మాత్రం ఆమెకు చాలా గట్టి పోటీ తప్పదు. ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్‌కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమవతీ నందన్ బహుగుణకు సొంత కూతురే రీటా బహుగుణ. ఆమె కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు యూపీ రాష్ట్ర చీఫ్‌గా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. ఈసారి సమాజ్‌వాదీ - కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా, రీటా బహుగుణ మాత్రం బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
ధీమాలో అపర్ణ
ములాయం చిన్నకోడలు అపర్ణా యాదవ్ మాత్రం తనకు టికెట్ వస్తుందని పూర్తి ధీమాలో ఉన్నారు. తన విజయం, పార్టీ విజయం కోసం ఇక్కడ తాను గట్టిగా పనిచేస్తానని, రీటా బహుగుణకు పోటీ ఇస్తానని ఆమె లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో చెప్పారు. పాలిటిక్స్‌లో పీజీ చేసిన అపర్ణ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాల కోర్సు కూడా చేశారు. అపర్ణ మంచి గాయని కూడా. ములాయం రెండో భార్య సాధన కుమారుడైన ప్రతీక్ యాదవ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.
Advertisement