బాబాయ్.. అబ్బాయ్ దోస్తీ ఓకేనా!
బాబాయ్.. అబ్బాయ్ దోస్తీ ఓకేనా!
Published Fri, Jan 20 2017 12:46 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరంటారు. సమాజ్‌వాదీ పార్టీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. తండ్రీకొడుకుల మధ్య ఏం ఒప్పందం జరిగిందో తెలియదు గానీ, తమ పార్టీకి చెందిన 191 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన అఖిలేష్.. అందులో తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు కూడా స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు ఉన్నట్లుగా ఈ జాబితాను బట్టి తెలుస్తోంది. తొలి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు. ఫిబప్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
గత నెలలో ములాయం విడుదల చేసిన జాబితాను పక్కన పెట్టి అఖిలేష్ యాదవ్ తన సొంత జాబితా సిద్ధం చేశారు. ములాయం జాబితాలో అఖిలేష్ కీలక అనుచరులైన అతుల్ ప్రధాన్, అరవింద్ సింగ్ లాంటి వాళ్లను పక్కన పెట్టగా తాజా లిస్టులో వాళ్లకు స్థానం దక్కింది. వారితో పాటు శివపాల్ యాదవ్‌కు కూడా చోటు ఇవ్వడంతో తండ్రీ కొడుకుల మధ్య పరిస్థితులు చక్కబడ్డాయని తెలుస్తోంది. అసలు శివపాల్ యాదవ్, అమర్‌సింగ్ ఇద్దరినీ పార్టీ నుంచి పంపేయాలని కూడా ఒక దశలో డిమాండ్ చేసిన అఖిలేష్, ఇప్పుడు తన తొలి జాబితాలోనే బాబాయ్‌కి టికెట్ ఇవ్వడంతో కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడిన విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించకపోయినా చెప్పినట్లే అయ్యింది. ములాయం సింగ్ యాదవ్ చెప్పినట్లే జస్వంత్‌నగర్ నియోజకవర్గ టికెట్‌ను శివపాల్‌కు కేటాయించారు. దాంతో ఇక అటు పార్టీలోను, ఇటు కుటుంబంలోను సమస్యలు ఏమీ ఉండకపోవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు. సైకిల్ గుర్తును అఖిలేష్ వర్గానికే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ములాయం 38 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను కొడుక్కి ఇచ్చారు. వాటిలో శివపాల్ పేరు ఉంది.
Advertisement