బాబాయికి అబ్బాయ్ మళ్లీ ఝలక్
సమాజ్వాద్ పార్టీనంతా తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్న సీఎం అఖిలేష్ యాదవ్ ఇటు బాబాయికి భలే ఝలకిలిస్తున్నారు. తండ్రి ములాయం సింగ్కు, తనకు తీవ్ర స్థాయిలో చిచ్చులు రేపిన శివ్పాల్ యాదవ్ కున్న అధికారాలన్నింటిన్నీ కత్తిరిస్తూ పోతున్నారు. టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చిన అఖిలేష్యాదవ్, బాబాయిని కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితం చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ తరుఫున తొలి దశ పోల్స్కు ప్రచారం నిర్వర్తించాల్సిన జాబితాను సమాజ్ వాద్ పార్టీ విడుదల చేసింది. ఆ జాబితాలో శివ్పాల్ యాదవ్ను చేర్చలేదు. ప్రత్యర్థి బాబాయికి టిక్కెట్ ఇవ్వడంతో అఖిలేష్, శివ్పాల్ మధ్య నెలకొన్న సంక్షోభం సమసిపోయినట్లేనని కార్యకర్తలు భావించారు.
కానీ అంతకముందు పార్టీలో పొరపచ్చలు రేపిన బాబాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రానీయకూడదని, ఆయన్ను ప్రచారానికి వాడుకోకూడదని అఖిలేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేతాజీ కోరికమేరకు శివ్పాల్కు జస్వంత్ నగర్ నియోజకవర్గ టిక్కెట్ను అఖిలేష్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తండ్రి మాట మేరకు మళ్లీ తదుపరి ప్రచార జాబితాల్లో శివ్పాల్ పేరును చేర్చినా ఆశ్చర్యం పోవాల్సినవసరం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు ఏడు దశల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ప్రచార పోరుకు పార్టీలన్నీ సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. ఎస్పీ-కాంగ్రెస్లకు పోటీగా ఎన్నికల ప్రచారానికి కమలనాథులు సిద్ధమయ్యారు. బీఎస్పీ కూడా ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.