మీ నాన్న చాలా మొండోడు!
సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరపడుతుందో లేదో తెలియదు గానీ.. తమ తాత వద్దకు వెళ్లడానికి ఆయన మనవరాళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముద్దుల కూతుళ్లు అదితి (15), టీనా (10) ఇద్దరూ చకచకా గెంతుకుంటూ పక్కపక్కనే ఉన్న ములాయం, అఖిలేష్ ఇళ్ల మధ్య తిరుగుతున్నారు. కనీసం వీళ్ల పుణ్యమాని తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు ఏమైనా తగ్గుతాయేమోనని కుటుంబసభ్యులు ఆశిస్తున్నారు.
ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఇలాగే టీనా తన వద్దకు వచ్చినప్పుడు.. 'మీ నాన్న చాలా మొండోడు' అని అఖిలేష్ గురించి టీనాతో ములాయం అన్నారట. ఆమె వెంటనే అదే విషయాన్ని తన తండ్రి వద్దకు వచ్చి చెప్పగా.. 'అవును.. మొండోడినే' అని అఖిలేష్ అన్నారట.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలోనే జరగనుండగా.. యాదవ్ కుటుంబంలో నెలకొన్న సంక్షోభం మాత్రం ఇంకా సమసిపోలేదు. ములాయం తన సొంత సోదరుడైన శివపాల్ యాదవ్‌ను వెనకేసుకు వస్తుంటే, అఖిలేష్‌కు మాత్రం మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్ అండగా ఉన్నారు. ఇప్పుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ సైకిల్ గుర్తు తమకే కావాలని పట్టుబడుతున్నారు.