ఎన్నికలు ముంచుకొచ్చినా.. తేలని పొత్తులు
ఎన్నికలు ముంచుకొచ్చినా.. తేలని పొత్తులు
Published Thu, Jan 19 2017 1:21 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తొలిదశ నామినేషన్లకు గడువు గట్టిగా వారం రోజులు కూడా లేదు. కానీ అక్కడ ఇంకా పొత్తుల విషయం తేలలేదు. అఖిలేష్ నేతృత్వంలో ఏర్పడుతుందనుకుంటున్న మహాకూటమిలో అజిత్ సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ) ఉంటుందో లేదోనన్న అనుమానాలు వస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ.. ఇవన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయాలని, తద్వారా బీజేపీ, బీఎస్పీలను ఓడించాలని ముందునుంచి భావిస్తున్నారు. అయితే.. తొలిదశలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. అదే ఇప్పుడు పొత్తు విషయంలో ప్రధాన అడ్డంకిగా మారింది.
వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఆర్ఎల్డీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు కూడా. దాదాపు వారం రోజుల క్రితం తొలిదఫా చర్చలు జరిగాయి. అప్పుడు ఆర్ఎల్డీకి 23 టికెట్లు ఇస్తామని సమాజ్‌వాదీ ఆఫర్ చేసింది. అయితే తమకు మరిన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం కావాలని అజిత్ సింగ్ డిమాండ్ చేశారు. కానీ దానికి అఖిలేష్ బృందం అంగీకరించలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ చర్చలన్నవి ఏమీ జరగలేదు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని మొదటి రెండు దశల్లో.. ముజఫర్ నగర్, మీరట్, హాపూర్, బులంద్ షహర్, అలీగఢ్, ఆగ్రా, మథుర లాంటి ప్రాంతాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఇక్కడ సీట్లు బాగానే గెలుచుకుంది. ఇక్కడ తమకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తే బీజేపీని గట్టి ఎదుర్కోగలమని ఆర్ఎల్డీ అంటోంది. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీకి వచ్చిన స్థానాలు 8 మాత్రమే. అందువల్ల ఇప్పుడు ఎన్ని స్థానాలు కేటాయించాలన్న విషయంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో.. ఏం చేయాలోనని తలపట్టుకుంటున్నాయి.
Advertisement