మళ్లీ యూటర్న్ తీసుకున్న ములాయం!
మళ్లీ యూటర్న్ తీసుకున్న ములాయం!
Published Thu, Feb 2 2017 11:27 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో చెప్పలేం. తాజాగా ఆ పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. నిన్న కాక మొన్న తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేది లేదని.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారరంగంలో ఉంటానని చెప్పిన ములాయం, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తరఫున కూడా ప్రచారంలో పాల్గొంటానన్నారు. ''ఎంతైనా వాడు నా కొడుకు కదా'' అని అఖిలేష్ గురించి అన్నారు. ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులుంటాయా అని ఒక విలేకరి అడిగినప్పుడు ఆయనిలా చెప్పారు. ఫిబ్రవరి తొమ్మిదో తేదీ తర్వాత తాను ప్రచార పర్వంలోకి వస్తానన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడిగినప్పుడు.. ''వాళ్లు మా మిత్రపక్షం కదా, మరెందుకు ప్రచారం చేయను?'' అని ఎదురు ప్రశ్నించారు.
జనవరి 22వ తేదీన అఖిలేష్ యాదవ్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు అక్కడ ములాయం కనిపించలేదు. అదేరోజు తాను తన భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి ములాయంకు మేనిఫెస్టో కాపీ ఇచ్చినట్లుగా ఉన్న ఒక ఫొటోను అఖిలేష్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. సరిగ్గా ఒక రోజు తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుపై ములాయం మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హస్తం పార్టీతో పొత్తు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా సమాజ్ వాదీ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పడంతో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఊపిరి పీల్చుకున్నాయి.
Advertisement