దింపుడు కల్లం ఆశలో ములాయం
దింపుడు కల్లం ఆశలో ములాయం
Published Sun, Jan 8 2017 3:36 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ (?) ములాయం సింగ్ యాదవ్, ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ తమకు కావాలంటే తమకు కావాలని తండ్రీకొడుకులు ఫైట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు చివరిసారిగా తన వాదనను వినిపించేందుకు పెద్దాయన సిద్ధమయ్యారు. రెండు రోజుల పాటు ముమ్మర ప్రయత్నాలు చేసినా రెండు వర్గాలు కలవడం మాత్రం అసాధ్యం అని తేలిపోవడంతో.. ఇక తన వెంట ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్‌ను తీసుకుని హస్తినకు చేరారు. ఎన్నికల కమిషన్ ముందు సోమవారం తమ బలాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే, ఈసారి వాళ్లిద్దరితో పాటు అమర్‌సింగ్ కూడా ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు పార్టీలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెబుతూనే మరోవైపు ఇలా ఎన్నికల గుర్తు కోసం ములాయం పోరాడాల్సి రావడం ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే చాలా క్లిష్ట సమయం అని పరిశీలకులు అంటున్నారు.
ఇక పార్టీపై తిరుగులేని పట్టు తనకే ఉందని చెబుతున్న అఖిలేష్ వర్గం.. దాదాపు ఆరు పెట్టెల నిండా భారీ మొత్తంలో అఫిడవిట్లను తీసుకెళ్లి ఎన్నికల సంఘానికి సమర్పించింది. శనివారం నాడు ఎన్నికల కమిషనర్ సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీని అఖిలేష్ వర్గం కలిసింది. రాంగోపాల్ యాదవ్, సురేంద్ర నాగర్, సునీల్ సాజన్.. ఈ ముగ్గురూ కలిసి అఫిడవిట్లు సమర్పించారు. సోమవారంతో గడువు ముగుస్తుండటంతో.. ఇక ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే నిర్ణయం వినడానికి రెండు వర్గాలు ఉత్కంఠగా ఉన్నాయి. దాదాపుగా తమకు పార్టీ గుర్తు రావడం ఖాయమైపోయిందని, అధికారికంగా ఎన్నికల కమిషన్ చెప్పడం ఒక్కటే మిగిలిందని అఖిలేష్ వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ చెబుతున్నారు. ఇదే నిజమైతే పాతికేళ్లుగా ములాయం పడిన కష్టం మొత్తం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
Advertisement
Advertisement