లక్నో : వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ స్పష్టతనిచ్చారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం తన భార్య డింపుల్ యాదవ్ ఎంపీగా కొనసాగుతున్న కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి తను పోటీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) మణిపురి నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఇదివరకే తన భార్య స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పిన అఖిలేశ్ దానిపై మరింత స్పష్టతనిచ్చారు.
ప్రతిపక్ష నాయకులు సమాజ్‌వాది పార్టీని కుటుంబ పార్టీగా ఆరోపిస్తున్నారని.. అందుకనే తన భార్య 2019 ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అలాగే పొత్తులు, సీట్ల పంపకాలపై మాట్లాడుతూ.. మిత్ర పక్ష అభ్యర్థులు బరిలో నిలిచిన చోట కార్యకర్తలందరు వారి విజయానికి, బీజేపీ ఓటమికి కృషి చేయాలని కోరారు. ఈ సారి బీజేపీకి ప్రజల మద్దతు ఉండదన్నారు. బీజేపీ కేవలం మాటలకే పరిమితమవుతుందని.. క్షేత్ర స్థాయిలో అంత శూన్యమని అఖిలేశ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment