పాపం... ములాయం!
పాపం... ములాయం!
Published Fri, Jan 6 2017 3:44 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఒక పార్టీని స్థాపించడం, పాతికేళ్ల పాటు దాన్ని విజయవంతంగా నడిపించడం.. చివరకు దాన్ని వదులుకోవాల్సి రావడం ఎంత బాధాకరమో ములాయం సింగ్ యాదవ్‌కు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. కన్న కొడుకే తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని స్వాధీనం చేసుకోవడం, గుర్తును కూడా సొంతం చేసుకోవడం దాదాపు ఖాయమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఏం చేయాలో కూడా పెద్దాయనకు పాలుపోవడం లేదు. శుక్రవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహిస్తారని మీడియా సంస్థలన్నింటికీ సందేశాలు పంపి.. సరిగ్గా ఐదు నిమిషాల్లోనే మళ్లీ ఆ ప్రెస్‌మీట్ రద్దయిందని చెప్పారు. దీన్ని బట్టే ములాయం పరిస్థితి ఎంత సందిగ్ధంలో ఉందో అర్థమవుతుంది.
ఎవరి వల్ల అయితే తాను పార్టీనుంచి బహిష్కరణకు గురి కావాల్సి వచ్చిందో.. ఎవరి కారణంగా తాను తండ్రితో తిట్లు తినాల్సి వచ్చిందో ఆ బాబాయ్ శివపాల్ యాదవ్ ఇంటికి సీఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఉదయం వెళ్లారు. ఆయన్ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వెంటనే శివపాల్ తన అన్న ములాయం ఇంటికి వెళ్లారు. ఇవన్నీ చూస్తే సమాజ్‌వాదీ పార్టీలో గొడవలు సర్దుమణిగిపోయాయేమో అని అంతా అనుకున్నారు. సంధి కుదిరిందనే భావించారు. కానీ అలా ఏమీ జరగలేదు. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే హక్కును వదులుకుని తనకు ఇవ్వాలని అఖిలేష్ షరతు పెట్టగా.. దానికి శివపాల్ ససేమిరా అన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలలో అత్యధికుల మద్దతు తమకే ఉందని అఖిలేష్‌కు మద్దతుగా నిలిచిన మరో బాబాయ్.. ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్ చెబుతున్నారు. మొత్తం 229 మంది ఎమ్మెల్యేలలో 212 మంది, 68 మంది ఎమ్మెల్సీలలో 56 మంది, 24 మంది ఎంపీలలో 15 మంది తమకు మద్దతుగా అఫిడవిట్లపై సంతకాలు చేశారని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రమే తాము తమ వద్ద ఉన్న అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తామని, అందువల్ల కచ్చితంగా సైకిల్ గుర్తు తమకే వస్తుందని ఆయన అన్నారు. ములాయం పార్టీ పెట్టినప్పటి నుంచి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసుకోవడం, ఎన్నికల కమిషన్ వద్దకు కావల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చూడటంలో రాంగోపాల్ యాదవ్‌కు మంచి అనుభవం ఉంది. అలాంటి 'ప్రొఫెసర్ సాబ్' ఇప్పుడు అఖిలేష్‌కు అండగా ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చింది.
మరోవైపు శివపాల్ యాదవ్, అమర్‌సింగ్ తదితర సీనియర్ల మద్దతున్న ములాయం సింగ్ యాదవ్ కూడా సైకిల్ గుర్తు తనకే చెందాలని ఈసీ వద్ద ఒక అఫిడవిట్ సమర్పించారు గానీ, అందులో ఎంతమంది సంతకాలు పెట్టారన్న విషయం మాత్రం బయటకు రావడంలేదు. ఇద్దరి వాదనలను వింటున్న ఎన్నికల కమిషన్.. తన తుది నిర్ణయం వెల్లడించేవరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది.
Advertisement
Advertisement