రాహుల్ గాంధీని పక్కన పెట్టేశారా?
రాహుల్ గాంధీని పక్కన పెట్టేశారా?
Published Mon, Jan 23 2017 7:36 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ఐదు రాష్ట్రాలకు వచ్చే నెల నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా, ప్రధానంగా అందరి దృష్టి అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల పొత్తుల విషయం కూడా చిట్టచివరి విషయం వరకు తేలకపోవడంతో చాలామంది నరాలు తెగే ఉత్కంఠకు గురయ్యారు. ఎట్టకేలకు ప్రియాంకా గాంధీ రంగప్రవేశం చేసిన తర్వాత మాత్రమే సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అంతకుముందు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా రాని ఫలితం.. ప్రియాంక వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే వచ్చింది. దీంతో ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఉన్న అభిప్రాయం మరోసారి బలపడింది.
రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంకను రంగంలోకి దించాలని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఎప్పటినుంచో వాదిస్తోంది. ఒకరకంగా ఇప్పుడు జరిగింది అదేనని అంటున్నారు. పొత్తు విషయంలో రాహుల్ గాంధీని పరిగణనలోకి తీసుకోకుండా ప్రియాంక నేరుగా రంగంలోకి దిగిన తర్వాత మాత్రమే.. అది కూడా సమాజ్‌వాదీ ముందునుంచి చెప్పిన 99 సీట్లు కాకుండా 105
సీట్లు ఇవ్వడానికి అంగీకరించేలా పొత్తు కుదిరిందన్నది వాళ్ల వాదన.
రాహుల్‌గాంధీకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నా, వాస్తవానికి అది ప్రతిసారీ వాయిదా పడుతూనే ఉంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రులుగా ఉండే కొంతమంది సీనియర్లు మాత్రం రాహుల్‌కు పట్టాభిషేకం చేయాలని చెబుతున్నా స్వయంగా ఆయన కూడా దాన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. కీలక సమయాల్లో ఉన్నట్టుండి మాయం కావడం, విదేశీ పర్యటనల వివరాలు ఎవరికీ తెలియకపోవడం, ఆయన ప్రచారం చేసిన రాష్ట్రాల్లో పార్టీ ఫలితాలు అంతగా ఏమీ లేకపోవడం.. ఇలాంటి పలు రకాల ప్రతికూలతలు రాహుల్ గాంధీకి ఉన్నాయన్నది కాంగ్రెస్‌లో మరో వర్గం వాదన. ప్రియాంకను రంగంలోకి దింపాలని, ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని ఇంతకుముందే ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్లు వెలిశాయి. అచ్చం ఇందిరాగాంధీ లాగే కనిపించే ప్రియాంకను తీసుకొస్తే పార్టీకి కూడా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు జరిగిన పరిణామాలను అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. పార్టీ ఇప్పుడైనా ప్రియాంకను ముందుకు తీసుకురావాలన్నది వాళ్ల ఆకాంక్ష.
Advertisement
Advertisement