ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు కుదిర్చినందుకు ప్రియాంకగాంధీ ప్రశంసల జల్లులో తడిసిపోతున్న తరుణంలో.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు కుదిర్చినందుకు ప్రియాంకగాంధీ ప్రశంసల జల్లులో తడిసిపోతున్న తరుణంలో.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఈ పొత్తును 'బ్రిలియంట్ ఐడియా' అంటూ కొనియాడిన ఆయన.. అదే సమయంలో రాహుల్‌గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఆకాశానికెత్తారు. ఈ ఇద్దరు యంగ్, డైనమిక్ నాయకులు అంటూ కితాబిచ్చారు. అయితే, ఈ పోస్టులో భార్య ప్రియాంకగాంధీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
వాద్రా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఎస్పీతో పొత్తు ప్రియాంక విజయమంటూ కాంగ్రెస్ పార్టీ ఓవైపు హోరెత్తిస్తూనే.. మరోవైపు ప్రియాంక తెరమీదకు రావడంతో రాహుల్‌ను పక్కనబెట్టలేదన్న సంకేతాలను ఇస్తోంది. అంతేకాకుండా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియోజకవర్గంలో ప్రియాంక పోటీచేసే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. ఈ తరుణంలో వాద్రా చేసిన రాజకీయ వ్యాఖ్యలు సహజంగానే ఆసక్తి రేపుతున్నాయి. రాహుల్, అఖిలేశ్ యూత్ ఐకాన్‌లు అని ప్రశంసించిన రాబర్ట్ వాద్రా.. ఈ ఇద్దరి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రపంచస్థాయి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందంటూ కూటమికి అభినందనలు తెలిపారు.