చెల్లి, బావతో చైనా రాయబారిని కలిసిన రాహుల్
న్యూఢిల్లీ: చెల్లెలు ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రా, భారత్‌లో చైనా రాయబారి ల్యూఝూహీలతో కలిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగిన ఫోటో బుధవారం వెలుగులోకి వచ్చింది. భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. భారత్-చైనాల మధ్య ఉన్న సమస్యపై తనకు ఎలాంటి సమాచారం లేదంటూ.. రాహుల్ ఢిల్లీలో చైనా రాయబారిని కలిశారు కూడా. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో రాహుల్ చైనా రాయబారిని మరోమారు కలిశారా? లేదా మరేదైనా విషయంపై కలిశారా? అన్న విషయం తెలియరాలేదు.
కాగా, రాహుల్ చైనా రాయబారిని కలవడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దాంతో డామేజ్ కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ-20 సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోను ఎప్పుడూ తీశారన్న విషయం మాత్రం తెలియరాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఫోటోపై ఎలా స్పందిస్తుందో చూడాలి.