luo zhaohui
-
ఇండో–పాక్–చైనా మైత్రి!
న్యూఢిల్లీ: భారత్, చైనా, పాకిస్తాన్ల మధ్య త్రైపాక్షిక సహకారం ఉంటే భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడం భవిష్యత్తులో సులభమవుతుందని చైనా రాయబారి లువో ఝహూయ్ వ్యాఖ్యానించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ అక్కడి వుహన్ నగరంలో అనధికారికంగా భేటీ అవ్వడం తెలిసిందే. ఈ భేటీ అనంతరం భారత్–చైనాల బంధం ఇంకెంత దూరం వెళ్లగలదు అనే అంశంపై ఢిల్లీలో చైనా రాయబార కార్యాలయం ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ రాయబారి లువో మాట్లాడుతూ ‘షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) మూడు స్తంభాల్లో భద్రతా సహకారం కూడా ఒకటి. ఎస్సీవో కింద చైనా, భారత్, పాక్‌ల మధ్య త్రైపాక్షిక సహకారం ఉంటే బాగుంటుందని కొందరు భారతీయ స్నేహితులే నాతో అన్నారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. భారత్, పాక్‌ల సంబంధాలు పూర్తిగా ద్వైపాక్షికమేననీ, మూడో దేశం ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చైనా రాయబారి వ్యాఖ్యలను కాంగ్రెస్ కూడా ఖండించింది. భారత్, పాక్‌ల బంధం విషయంలో మరెవ్వరి జోక్యం ఉండకూడదంది. -
చెల్లి, బావతో చైనా రాయబారిని కలిసిన రాహుల్
న్యూఢిల్లీ: చెల్లెలు ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రా, భారత్‌లో చైనా రాయబారి ల్యూఝూహీలతో కలిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగిన ఫోటో బుధవారం వెలుగులోకి వచ్చింది. భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. భారత్-చైనాల మధ్య ఉన్న సమస్యపై తనకు ఎలాంటి సమాచారం లేదంటూ.. రాహుల్ ఢిల్లీలో చైనా రాయబారిని కలిశారు కూడా. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో రాహుల్ చైనా రాయబారిని మరోమారు కలిశారా? లేదా మరేదైనా విషయంపై కలిశారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా, రాహుల్ చైనా రాయబారిని కలవడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దాంతో డామేజ్ కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ-20 సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోను ఎప్పుడూ తీశారన్న విషయం మాత్రం తెలియరాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఫోటోపై ఎలా స్పందిస్తుందో చూడాలి.