యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న ఆరెస్సెస్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజీపీ రాజకీయ వేదికపైకి ఆరెస్సెస్ అడుగుపెట్టింది. పాట్నా నుంచి లక్నోకు మకాం మార్చిన ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే కేంద్రంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యూహం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య నాయకత్వంలోని పార్టీ కార్యవర్గ సభ్యులను సైతం పక్కన పెట్టిన దత్తాత్రేయ అన్నీ తానై చక్రం తిప్పుతున్నారని రాష్ట్ర బీజీపీ వర్గాలు చెబుతున్నాయి.
దత్తాత్రేయ తన టీమ్‌లోకి ఆరెస్సెస్ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఆరుగురు ప్రాంతీయ కార్యదర్శులతో పాటు కొంతమంది రాష్ట్ర బీజేపీ నాయకులను తీసుకున్నారు. ఆరెస్సెస్ ప్రాంతీయ కార్యదర్శుల్లో ఓం ప్రకాష్ శ్రీవాత్సవ్, చంద్రశేఖర్, భవానీ సింగ్, బ్రజ్ బహద్దూర్ తదితరులు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలో దత్తాత్రేయనే కీలకపాత్ర వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికల వ్యూహాలు, ఓటర్లను ఎలా సమీకరించే వ్యూహాలను ఆయన బృందమే చూసుకుంటోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని సీట్లను వదిలేసి మిగతా అన్నీ అసెంబ్లీ సీట్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దత్తాత్రేయ చూసుకుంటున్నారు. అయితే ఆయన ఎంపిక చేసినా.. తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర పార్టీ ఎన్నికల సంఘం చేస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రధాన మంత్రి కార్యాలయం ఎంపిక చేస్తుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ ఐదు సీట్లలో ప్రస్తుతం మూడు సీట్లకు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, రెండు సీట్లకు సమాజ్‌వాదీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు సహకరించే విషయమై దత్తాత్రేయ ఇప్పటీకే బహదూర్ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, సేవా భారతి సంఘాల నాయకులతో చర్చించారు.