ఢిల్లీ వెళ్లిన పెద్దాయన!
దాదాపు పాతికేళ్ల క్రితం పెట్టిన పార్టీని, అప్పుడు తీసుకున్న గుర్తును కాపాడుకోడానికి ములాయం సింగ్ యాదవ్ నానా పాట్లు పడుతున్నారు.
తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. దాదాపు పాతికేళ్ల క్రితం పెట్టిన పార్టీని, అప్పుడు తీసుకున్న గుర్తును కాపాడుకోడానికి ములాయం సింగ్ యాదవ్ నానా పాట్లు పడుతున్నారు. తమ్ముడు శివపాల్ యాదవ్‌ను తీసుకుని ఆయన ఢిల్లీకి బయల్దేరారు. తమకు మద్దతిచ్చేవాళ్లు అందరి దగ్గర నుంచి అఫిడవిట్లు తీసుకుని.. వాటిని ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తానని చెబుతున్నారు. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు మాత్రం ప్రస్తుతానికి అఖిలేష్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. ములాయం మాత్రం తనకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే.. ఎంతమంది ఆయనకు మద్దతు చెబుతున్నారో మాత్రం ఇంతవరకు బయటపడలేదు.
పార్టీ గుర్తు తమదేనని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలని అటు ములాయం, ఇటు అఖిలేష్ ఇద్దరికీ ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందుకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించింది. అయితే అంవతరకు ఆగడం ఎందుకని, ఇప్పటికే ములాయం ఢిల్లీ బయల్దేరగా.. అఖిలేష్ కూడా అఫిడవిట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం నాడు హస్తిన టూర్ పెట్టుకున్నారు. నోటి మాటగా కాకుండా.. అఫిడవిట్ల రూపంలోనే ఎవరెవరికి ఎంతెంత మద్దతు ఉందో చూపించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన అనూహ్య పరిణామంలో.. ములాయం సింగ్ స్థానంలో జాతీయాధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఆయన వర్గం ఎన్నుకుంది. దాంతోపాటు శివపాల్ యాదవ్‌ను యూపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.