‘సైకిల్’ కోసం హస్తినలో పంచాయితీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. ఆ పార్టీ అధికార గుర్తు కోసం తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. ‘సైకిల్’ నాదంటే నాదని పోరుకు సిద్ధమయ్యారు. సైకిల్ గుర్తు కోసం ములాయం, అఖిలేష్‌లు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. సైకిల్ తమదంటే తమదంటూ కుస్తీ పట్లు పడుతున్నారు. దీంతో సైకిల్ గుర్తు పంచాయితీ ఢిల్లీకి చేరింది.
ఈ నేపథ్యంలో సైకిల్ గుర్తుపై హక్కులు తమవేనంటు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని ఈ మేరకు ఆయన సీఈసీకి విజ‍్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా యూపీలోని తాజా పరిణామాలను వివరించారు. కాగా ములాయంతో పాటు ఆయన సోదరుడు శివపాల్ యాదవ్, సీనియర్ నేత అమర్ సింగ్, జయప్రద కూడా ఎన్నికల సంఘాన్ని కలిశారు. మెజార్టీ ఎమ్మెల్యేలు అఖిలేష్ యాదవ్‌కే మద్దతు పలికినప్పటికీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ములాయం అంటున్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు అఖిలేష్ వర్గం కూడా సిద్ధమైంది. సైకిల్ గుర్తు కోసం అబ్బాయి వర్గం కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీలో మెజార్టీ తనవైపే ఉందని, అందుకే పార్టీ గుర్తు తమకే కేటాయించాలని పట్టు బడుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి విజ్ఞప్తి చేయాలని అఖిలేష్ టీం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యులాయం మరో సోదరుడు, ఎస్పీ బహిష్కృత నేత శివపాల్ యాదవ్ రేపు (మంగళవారం) ఎన్నికల సంఘాన‍్ని కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు అఖిలేష్ వర్గానికి ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఇచ్చింది.