మీ కొట్లాటలు సరే.. మా సంగతేంటి?
ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయినా సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ముసలం ఇంకా తొలగిపోలేదు. దాంతో నేతల సంగతి ఎలా ఉన్నా.. ఆ పార్టీ జెండాలు, పోస్టర్లు అమ్మే దుకాణదారుల పరిస్థితి అయోమయంలో పడింది. తాము చాలా సంవత్సరాల నుంచి ఒక్క సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్ల లాంటి ఎన్నికల సామగ్రి మాత్రమే అమ్ముతున్నామని, సాధారణంగా వీటిని చాలా ముందు నుంచి తయారు చేసుకోవాల్సి ఉంటుందని లక్నోలో ఇలాంటి వ్యాపారం చేసే ఓ వ్యాపారి చెప్పారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచే ప్రింటింగ్, ఇతర పనులు పూర్తయిపోతాయని, అప్పటినుంచి మొదలుపెట్టి నాయకులకు, పార్టీ కార్యాలయాలకు, కార్యకర్తలకు, అభిమానులకు వీటిని విక్రయిస్తుంటామని అన్నారు.
కానీ ఇప్పుడు అసలు పార్టీ గుర్తు ఏదో తెలియకపోవడం, ఎవరి ఫొటోల కింద ఏ పార్టీ అని రాయాలో కూడా స్పష్టత లేకపోవడంతో ఇప్పటికే ముద్రించిన ఎన్నికల సామగ్రిని ఏం చేసుకోవాలో తెలియట్లేదని వాపోయారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ములాయం.. అఖిలేష్ ఇద్దరూ కలిసున్న ఫొటోలు, పోస్టర్లను పెద్ద మొత్తంలో సిద్ధం చేసుకున్నారు. అలాగే సైకిల్ గుర్తు, సమాజ్‌వాదీ పార్టీ అన్న పేరు మీద కూడా జెండాలు, పోస్టర్లు తయారైపోయాయి. ఇప్పుడు వీటిలో ఎన్ని పనికొస్తాయో, ఎన్నింటిని పారేయాల్సి వస్తుందోనని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఇద్దరి మధ్య గొడవ ఏదో తొందరగా పరిష్కారం అయ్యి, సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటిగానే ఈసారి పోటీ చేయాలని, అలా అయితేనే తమకు నష్టాలు రాకుండా ఉంటాయని అంటున్నారు. లేనిపక్షంలో ఇప్పటివరకు సిద్ధం చేసుకున్న సామగ్రి మొత్తాన్ని పారేసి, మళ్లీ కొత్తగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని వాపోతున్నారు.